
అధిక ధరకు ఎరువులు విక్రయిస్తే చర్యలు
● కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాలఅగ్రికల్చర్ ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సత్యప్రసాద్ హెచ్చరించారు. జగిత్యాల సింగిల్ విండోలోని ఎరువుల దుకాణాన్ని ఆదివారం తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. ఎరువుల గోదాంను పరిశీలించి, ఏయే ఎరువులు.. ఏ రేటుకు విక్రయిస్తున్నారు..? అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయా..? అని అడిగి తెలుసుకున్నారు. ఎరువుల బస్తాల వివరాలను ఈ–పాస్‌లో నమోదు చేయాలని సూచించారు. రైతులకు అవసరం మేరకు మాత్రమే విక్రయించాలని, నిల్వ చేయడానికి ఇవ్వొద్దన్నారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి వినీల, ఏఈఓ నాగరాజు, సంఘ సీఈవో వేణు, సంఘ సిబ్బంది పాల్గొన్నారు.
డ్రైనేజీలో ఆయిల్‌బాల్స్ వేయాలి
జగిత్యాల: డ్రైనేజీల్లో దోమలు చేరకుండా ఆయిల్ బాల్స్ వేయాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాకేంద్రంలోని 16, 17 వ వార్డుల్లో డ్రైనేజీలను పరిశీలించారు. డ్రైనేజీ పనుల్లో నాణ్యత ఉండాలని, లేకుంటే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. వర్షాలు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో డ్రైనేజీల్లో ప్లాస్టిక్ కవర్లు, చెత్త డబ్బాలు ఉంటే తొలగించాలని, కాలువను శుభ్రం చేయాలని ఆదేశించారు. పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆయన వెంట కమిషనర్ స్పందన, ఏఈ చరణ్ తదితరులు ఉన్నారు.