
పేదలకు నష్టం కలిగించను
● అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా ● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాల: పేదలకు ఎప్పుడూ నష్టం కలిగించబోనని, జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధిలో రాజకీయాలకు వెళ్లబోనని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం జిల్లాకేంద్రంలోని నూకపల్లి సమీపంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 4500 ఇళ్లు నిర్మించామని, ప్రస్తుతం లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. ఇళ్ల వద్ద వసతుల కోసం సీఎంకు విన్నవించగా రూ.20 కోట్లు మంజూరు చేశారని, వాటితో నూకపల్లిలో స్కూల్, ఆసుపత్రి, గుడికి స్థలాలు సేకరించాలని చెప్పానన్నారు. అయితే అక్కడ కొన్ని ఇళ్లు బేస్‌మెంట్ వరకు నిర్మించి విడిచిపెట్టి ఉన్నాయని, వాటిని తొలగించాల్సి వచ్చిందని, ఎవరికి నష్టం కలిగించకుండా అప్పుడు కట్టకున్న వారికి ప్రత్యామ్నాయం చూపించాలని అధికారులను ఆదేశించానని వివరించారు. దీనిపై కొందరు రాజకీయం చేస్తున్నారని, తెలిపారు. తాను అభివృద్ధి కోసమే పనిచేస్తున్నానని, ఎటువంటి దురుద్దేశం లేదన్నారు. నష్టపోయిన వారికి తప్పకుండా ఆదుకుంటానని పేర్కొన్నారు.