
అల్ఫోర్స్‌లో శ్రావణమాస ఆరంభ వేడుకలు
కొత్తపల్లి: కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్‌లో శ్రావణ మాస ఆరంభోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సరస్వతీ మాత విగ్రహానికి జ్యోతి ప్రజ్వలన చేసి అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి ఈ వేడుకలను ప్రారంభించారు. శ్రావణ మాసం శివునికి అత్యంత ప్రీతికరమని, భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
నవోదయకు దరఖాస్తు చేసుకోవాలి
చొప్పదండి: నవోదయలో వచ్చే విద్యా సంవత్సరం 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తుకు జూలై 29 చివరి తేదీగా ప్రకటించబడిందని ప్రిన్సిపాల్ మంగతాయారు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఆధార్ కార్డు లేదా రెసిడెంట్ సర్టిఫికెట్, ఫోటో, పేరెంటు, స్టూడెంట్ సంతకంతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
తండ్రి మందలించాడని కొడుకు ఆత్మహత్య
తిమ్మాపూర్: ఉద్యోగానికి వెళ్లడం లేదంటూ తండ్రి మందలించడంతో కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని మన్నెంపల్లి గ్రామంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన దరిపల్లి సతీశ్ మండలంలోని కొత్తపల్లిలో హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని కొడుకు అజయ్(23) ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. కొన్నాళ్లుగా జల్సాలకు అలవాటు పడి ఉద్యోగానికి వెళ్లడం లేదు. సోమవారం ఉద్యోగానికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండడంతో సతీశ్ అజయ్‌ని మందలించాడు. మనస్తాపం చెందిన అజయ్ గ్రామ శివారులోకి వెళ్లి గడ్డిమందు తాగాడు. తరువాత వరసకు చిన్నాన్న అయిన వేణుకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. అజయ్‌ని 108లో కరీంనగర్ తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం చనిపోయాడు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అల్ఫోర్స్‌లో శ్రావణమాస ఆరంభ వేడుకలు