
శ్మశానవాటికను దున్నిన రైతు
ఇల్లంతకుంట(మానకొండూర్): ప్రభుత్వ శ్మశానవాటిక స్థలం దాని పక్కనే నర్సరీ కేంద్రం పల్లెప్రకృతి వనం, డంపింగ్‌యార్డ్ ఉన్న భూమి తనదేనంటూ రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్లలో ఓ వ్యక్తి దున్నేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని వల్లంపట్లకు చెందిన మాజీ నక్సలైట్ కుక్కల మల్లేశం జనజీవన స్రవంతిలో కలిసే సమయంలో 1993లో ప్రభుత్వం మూడెకరాల అసైన్డ్ భూమిని జీవనోపాధి కోసం ఇచ్చింది. దాన్ని సాగుచేయకపోవడంతో నిరుపయోగంగా ఉంది. గ్రామస్తులు ఆ భూమిలోని ఒకటిన్నర ఎకరంలో ఐదేళ్ల క్రితం శ్మశానవాటిక, పల్లెప్రకృతి వనం, నర్సరీ, సెగ్రిగేషన్ షెడ్ నిర్మించారు. రెండు రోజుల క్రితం మల్లేశం కొడుకు కుక్కల శ్రావణ్ సదరు శ్మశాన వాటికలో తమ భూమి ఉందంటూ దున్నేశాడు. ఇది గమనించిన గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గ్రామపంచాయతీకి శ్రావణ్ పిలిపించగా.. ఇటీవల సర్వేయర్ పంచనామా చేసి ఇచ్చిన రిపోర్టును చూపించాడు. ఇప్పుడు అటువైపు ఎవరూ వెళ్లవద్దని ఉన్నతాధికారులకు తెలియజేస్తానని కార్యదర్శి తెలిపారు. ఈ విషయంపై శ్రావణ్‌ను వివరణ కోరగా శ్మశానవాటిక, నర్సరీ, డంపింగ్‌యార్డ్ ఉన్న 374/1 సర్వే నంబర్‌లో తమకు ఎకరంనర స్థలం ప్రభుత్వం ఇచ్చిందేనన్నారు. రికార్డుల్లో తమ పేరు ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారులు న్యాయం చేయాలని కోరారు.