
గురుకులంలో ఎలుకల కలకలం
హుజూరాబాద్: గురుకులంలో విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటన కలకలం రేపింది. మున్సిపల్ పరిధి బోర్నపల్లి శివారులోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాల(సైదాపుర్)లో 8వ తరగతి చదువుతున్న యశ్వంత్, సాయిచరణ్, కౌశిక్, అక్షిత్, శజన్, 9వ తరగతికి చెందిన రక్షిత్‌ను బుధవారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఎలుకలు కొరికాయి. విద్యార్థులు గురువారం ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లగా, పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వ్యాక్సిన్ వేయించారు. పాఠశాల చుట్టూ రైస్ మిల్లులు, పాఠశాలకు ఆనుకునే చెట్ల పొదలు ఉండటంతో విపరీతమైన దోమలతో పాటు, ఎలుకలు తిరుగుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. ప్రిన్సిపాల్ రాణిని వివరణ కోరగా విద్యార్థులకు ప్రమాదం ఏం లేదని, ఆరుగురిని ఎలుకలు కరిచినట్లు తెలిసిందని, మరో ఇద్దరికి కరిచినట్లు అనుమానం ఉందని తెలిపారు. అందరికి వ్యాక్సిన్ వేయించినట్లు పేర్కొన్నారు. ఎలుకల బోన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శుక్రవారం ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ గురుకులంను సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.