
పాఠశాల ఆవరణ శుభ్రంగా ఉండాలి
జగిత్యాలరూరల్: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యాబోధన జరుగుతుందని, పాఠశాల ఆవరణలో శుభ్రత పాటించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం జగిత్యాల రూరల్ మండలం కల్లెడ జిల్లా పరిషత్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, తరగతుల నిర్వహణ, పారిశుధ్య సౌకర్యాలు వంటి అంశాలను పరిశీలించారు. అనంతరం ముఖాముఖి సంభాషణ జరిపి విద్యార్థులతో పాఠాలు చదివించడమే కాకుండా బోర్డుపై రాయించి వారి విద్యాబోధనస్థాయిని తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలోని వంటగది, ఆహార నాణ్యతను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం వడ్డిస్తున్నారా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భోజనం విషయంలో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలన్నారు. డీఈవో రాములు, రూరల్ తహసీల్దార్ శ్రీనివాస్, ఎంఈవో గాయత్రి పాల్గొన్నారు.
● కలెక్టర్ సత్యప్రసాద్