
రాత్రివేళ నిరంతర గస్తీ
● ఎస్పీ
అశోక్‌కుమార్
జగిత్యాలక్రైం: రాత్రివేళ అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా బ్లూకోల్ట్స్, పెట్రోకార్ వాహనాలతో నిరంతర గస్తీ నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల ప్రాంతాల్లో పెట్రోలింగ్ వ్యవస్థను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు అదనంగా నైట్ బీట్ వ్యవస్థను బలోపేతం చేస్తూ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రాత్రి సమయంలో నిఘా మరింత పటిష్టం చేస్తూ సమయానుకూల చర్యలు తీసుకోవడం ద్వారా చాలా వరకు నేరాలను నియంత్రించవచ్చన్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను తనిఖీ చేయడంతో పాటు వారి వేలిముద్రలను సేకరించి, గత నేర చరిత్ర గల నిందితులతో సరిపోల్చడం జరుగుతోందని చెప్పారు. అలాగే, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, దొంగతనాల నివారణకు పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్ట పరచడం జరిగిందన్నారు. జిల్లాలోని ప్రజలు ప్రశాంతం ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందని ఎస్పీ వివరించారు.