
గుల్లకోటలో 18.3 మి.మీ వర్షం
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకు అత్యధికంగా ఎండపల్లి మండలం గుల్లకోటలో 18.3 మి.మీ, అత్యల్పం ఇబ్రహీంపట్నం మండలం గోదూర్‌లో 0.5 మి.మీ వర్షం కురిసింది. ఎండపల్లిలో 15.5, బీర్‌పూర్ మండలం కొల్వాయి 11.5, గొల్లపల్లి 10.5, బుగ్గారం మండలం సిరికొండ 10.5, మిగతా మండలాల్లో 8.5 నుంచి 0.5 మి.మీ వర్షపాతం నమోదైంది.
జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో రాబోయే ఐదురోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త బి.శ్రీలక్ష్మి తెలిపారు. అలాగే, అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షంతో పాటు, గంటకు 30–40 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 27–32 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 24–25 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ ఉదయం 80–92 శాతం, మధ్యాహ్నం 59–78 శాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలి
జగిత్యాలరూరల్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు ఎండగట్టాలని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. శుక్రవారం జగిత్యాల అర్బన్ మండలం అంబారిపేట గ్రామంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. తుమ్మ గంగాధర్, ఆనందరావు, గొడిశెల గంగాధర్, కమలాకర్, లక్ష్మణ్‌రావు, ప్రవీణ్‌గౌడ్, సాగర్‌రావు, ముత్తయ్య, వెంకటేశ్, తిరుపతిగౌడ్ పాల్గొన్నారు.
ఇంటిపన్ను డబ్బులు పక్కదారి?
జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీలో ఇంటిపన్ను వసూలు చేసిన డబ్బులు పక్కదారి పట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అందులో పని చేస్తున్న ఓ అధికారి సుమారు రూ.60 వేల వరకు వసూలు చేసి ఆఫీసులో అప్పగించాల్సి ఉండగా, మున్సిపల్ అకౌంట్‌లో జమచేయనట్లు తెలిసింది. ఈ విషయంపై అధికారులు మెమో సైతం జారీ చేసినట్లు సమాచారం. ఈ విషయంపై వివరణ కోరేందుకు మున్సిపల్ కమిషనర్‌కు ఫోన్ చేయగా స్పందించలేదు.
నానో యూరియాతో మంచి దిగుబడులు
జగిత్యాలఅగ్రికల్చర్: నానో యూరియా వాడడం వల్ల పంటల్లో దిగుబడులు పెరుగుతాయని జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ అన్నారు. సారంగాపూర్ మండలం కోనాపూర్ గ్రామంలో శుక్రవారం నానో యూరియా వాడకంపై క్షేత్రస్థాయి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంప్రదాయ ఎరువులతో పోల్చితే నానో యూరియా, నానో డీఏపీ ఎరువులు పంటలపై అధిక ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. నానో యూరియాతో పర్యావరణానికి మేలు జరుగుతుందని వెల్లడించారు. రైతులకు ఖర్చు తగ్గుతుందని చెప్పారు. ప్రతీ క్లస్టర్ పరిధిలో నానో టెక్నాలజీ ఆధారంగా ఎరువుల వాడకంపై ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని వివరించారు.
డీఈగా బాధ్యతల స్వీకరణ
జగిత్యాల: జగిత్యాల మున్సిపల్ డీఈగా శుక్రవారం ఆనంద్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కమిషనర్ స్పందన, ఏఈ చరణ్ పాల్గొన్నారు.

గుల్లకోటలో 18.3 మి.మీ వర్షం

గుల్లకోటలో 18.3 మి.మీ వర్షం