
పేదల ఆత్మగౌరవం రేషన్‌కార్డు
జగిత్యాలరూరల్/ధర్మపురి: రాష్ట్రంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేటలోని బీఎల్‌ఎన్ గార్డెన్స్, ధర్మపురి పట్టణంలోని ఎస్‌హెచ్ గార్డెన్‌లో కొత్తగా మంజూరైన రేషన్‌కార్డులను ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 25 నుంచి ఆగస్టు 10 వరకు కొత్త రేషన్‌కార్డుల పంపిణీ మండల కేంద్రాల్లో కొనసాగుతుందన్నారు. రేషన్‌కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, కార్డు రానివారు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రేషన్‌కార్డుల పంపిణీ ఆశించిన మేర జరగలేదని, ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రభుత్వం అర్హులను గుర్తించి కార్డుల పంపిణీ మొదలు పెట్టిందన్నారు. అలాగే ధర్మపురి నియోజకవర్గంలోని 124 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. ధర్మపురి పట్టణంలో కేఎన్‌ఆర్ కాంప్లెక్స్ గదులు, నాగమయ్య ఆలయం, పుట్టబంగారం వేదికలను ప్రారంభించారు. అంతకముందు శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో పూజలు చేశారు. అదనపు కలెక్టర్ బీఎస్ లత, ఆర్డీవో మధుసూదన్, జిల్లా పౌరసరపరాల శాఖ అధికారి జితేందర్‌రెడ్డి, ఎస్సీ వెల్ఫేర్ అధికారి రాజ్‌కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, రామ్మోహన్, ఆలయ ఈవో శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్, నాయకులు ఎస్.దినేశ్, ఏఎంసీ చైర్‌పర్సన్ చిలుముల లావణ్య లక్ష్మణ్, చీపిరిశెట్టి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్