
పల్లెలకు స్వచ్ఛ బృందాలు
● గ్రామాల్లో అభివృద్ధి పనుల పరిశీలన ● జిల్లాలో 20 గ్రామాల ఎంపిక
రాయికల్:(జగిత్యాల): స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్– 2025లో భాగంగా పారిశుధ్య పరిస్థితిని మెరుగుపర్చేందుకు గ్రామపంచాయతీల్లో కేంద్ర బృందం సర్వే చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అకాడమీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ సంస్థ ప్రతినిధుల పర్యవేక్షణ కొనసాగుతోంది. చెత్త సేకరణ, తరలింపు తీరు, ప్రభుత్వ సంస్థల పనితీరు తదితర అంశాలపై నేరుగా ప్ర జలతో మాట్లాడి వివరాలు సేకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఒక ప్రత్యేక యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ఆయా గ్రామాల్లోని అభివృద్ధి ప నులు తదితర ఫొటోలను అప్‌లోడ్ చేస్తున్నారు.
అభివృద్ధి ఆధారంగా మార్కులు
పల్లెల్లో అభివృద్ధి పనులు తదితర అంశాలపై సేకరించిన సమాచారం ఆధారంగా స్వచ్ఛ పల్లెలకు మార్కులు కేటాయిస్తారు. జిల్లాలోని పాత 18 మండలాల్లో 380 గ్రామాలు ఉండగా కేంద్ర ప్రభుత్వం 20 గ్రామాల్లో సర్వే చేపట్టనున్నారు. ఆయా గ్రామాల్లో 16 నివాస గృహాలను సందర్శించి వారి అభిప్రాయాలు పరిశీలిస్తారు. మూడు ఎస్సీ, మూడు ఎస్టీ, ఎనిమిది ఇతర కుటుంబాలు, మరో రెండు నివాసాలు అధికారుల నిర్ణయం మేరకు ఎంచుకుంటారు. ఇలా 20 గ్రామాల్లో సుమారు 10 రోజుల పాటు సర్వే చేస్తారు. అనంతరం కేంద్రానికి నివేదిక పంపించి ఆయా గ్రామాలకు ర్యాంకులు ప్రకటిస్తారు. ఇందులో భాగంగా శుక్రవారం జిల్లాలోని జగిత్యాల రూరల్, మల్లాపూర్ మండలాల్లో కేంద్ర బృందం సభ్యులు మధు, జయంత్ సర్వే నిర్వహించారు. వీరి వెంట జిల్లా స్వచ్ఛభారత్ మిషన్ కోఆర్డినేటర్ చిరంజీవి ఉన్నారు.