
‘ఇందిరమ్మకు’ ఉచిత ఇసుక
● ఒక్కో ఇంటికి 40 టన్నులు ● ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం ● పంచాయతీ కార్యాలయాల్లో దరఖాస్తు ప్రక్రియ ● తహసీల్దార్ అనుమతితో ఇసుక సరఫరా ● ఆత్మకూర్ పెద్దవాగు నుంచి తరలించేలా చర్యలు
మెట్‌పల్లిరూరల్: పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోంది. ఆ ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుకను కూడా ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అధికారులకు ఆదేశాలు కూడా వచ్చాయి. ఇసుక కోసం దరఖాస్తుపత్రాలు ఇప్పటికే గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సిద్ధంగా ఉన్నాయి.
లబ్ధిదారులు ముందుకు రావాలని..
ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారిలో చాలామంది ఆర్థిక స్థోమత లేనివారే. దీంతో ఇంటి నిర్మాణానికి ముందుకు రావడంలేదు. మరికొందరు అష్టకష్టాలు పడుతూ ఎలాగోల నిర్మాణం చేపడుతున్నారు. వారి పరిస్థితిని క్షేత్రస్థాయిలో గమనించిన ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందించాలని, ఒక్కో ఇంటికి సుమారు 40 టన్నులు సరఫరా చేయాలని నిర్ణయించింది. మెట్‌పల్లి మండలంలో 564 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో తమకు కొంతమేర ఆర్థిక భారం తగ్గడంతోపాటు ఆదనంగా ప్రయోజనం కలుగుతుందని లబ్ధిదారులు చెబుతున్నారు. ఇసుక కావాల్సిన లబ్ధిదారులు స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు ఫారంతోపాటు పంచాయతీ పర్మిషన్ జిరాక్స్‌ను కార్యదర్శులకు అందించాలి. వాటిని పరిశీలించి తహసీల్దార్‌కు నివేదిస్తారు. తహసీల్దార్ పరిశీలించి అనుమతులు జారీ చేస్తారు.
ఆత్మకూర్ రీచ్ నుంచి సరఫరా
మెట్‌పల్లి ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఆత్మకూర్ పెద్దవాగు నుంచి ఇసుక సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు. గతంలో పెద్దవాగును ప్రభుత్వం రీచ్‌గా గుర్తించింది. ఆ ప్రాంతంలో సుమారు 5,550 టన్నుల ఇసుక తీసుకునే వీలుంది. ఇందులో దాదాపు వెయ్యి టన్నుల ఇసుక సీసీ రోడ్లు, ఇతరత్రా పనులకు తరలించారు. రెండు రోజుల క్రితం మరోమారు పెద్దవాగులో ఇసుక లభ్యతను పరిశీలించిన మైనింగ్ అధికారులు.. దాదాపు 4,550 టన్నుల ఇసుక తీయవచ్చని గుర్తించారు. ఇందుకోసం ఆత్మకూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిని సాండ్ రీచ్ ఆఫీసర్ (ఎస్‌ఆర్‌వో)గా నియమించారు.
దరఖాస్తు చేసుకోవాలి
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఉచిత ఇసుక కోసం గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కో ఇంటి నిర్మాణానికి 40 టన్నులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– మహేశ్వర్‌రెడ్డి, ఎంపీడీవో, మెట్‌పల్లి
ఆదేశాలు ఉన్నాయి
లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక అందించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. లబ్ధిదారులు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. వాటిని రెవెన్యూ కార్యాలయంలో అందించాక పరిశీలించి అనుమతులు జారీ చేస్తాం.
– నీత, తహసీల్దార్, మెట్‌పల్లి