
మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాల: మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలో నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు ప్రమాదబీమా, లోన్‌బీమా కల్పించామని, ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబసభ్యులకు రూ.10 లక్షల పరిహారం అందుతుందని, సహజ మరణం పొందితే సభ్యురాలి పేరిట ఉన్న రుణం గరిష్టంగా రూ.2 లక్షల వరకు మాఫీ అవుతుందన్నారు. జిల్లాలో 134 మంది మహిళలకు విద్యార్థుల డ్రెస్సులు కుట్టే బాధ్యత అప్పగించి.. వారికి కుటీర వ్యాపార యూనిట్లు ఏర్పాటు చేశామన్నారు. మహిళాసంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకిచ్చామన్నారు. తాటిపల్లి మహిళాసంఘాలకు పైలెట్ ప్రాజెక్ట్ కింద వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళిక రూపొందించామన్నారు. చల్‌గల్‌లో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహిళాశక్తి కార్యక్రమం అమలు చేస్తోందన్నారు. వడ్డీమాఫీ కింద 2,670 మంది స్వశక్తి సభ్యులకు రూ.3.11 కోట్ల చెక్కులు పంపిణీ చేశారు. వడ్డీ లేని రుణాలను 123 సంఘాలకు రూ.17 కోట్లు, సీ్త్రనిధి ద్వారా పట్టణ పొదుపు సంఘాలకు రూ.17 లక్షలు అందించారు. డీఆర్డీవో రఘువరణ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
20 వేల మందికి నివాసం
20 వేల మంది నివసించేలా అర్బన్ హౌసింగ్ ఇందిరమ్మ కాలనీ ప్రాజెక్ట్ రూపకల్పన చేశామని ఎమ్మెల్యే అన్నారు. ఆర్డీవో కార్యాలయంలో ఇందిరమ్మ కాలనీ వసతులపై సమీక్షించారు. 4,520 ఇళ్లలో నివసించే ప్రజల కోసం వసతులు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్డీవో మధుసూదన్, హౌసింగ్ పీడీ ప్రసాద్, కమిషనర్ స్పందన, తహసీల్దార్ రాంమోహన్, సర్వేయర్ విఠల్, డీఈ మిలింద్, ఏఈలు అనిల్, చరణ్ పాల్గొన్నారు.