
ఒకే కుటుంబానికి 35 బస్తాల యూరియా
● కలెక్టర్ తనిఖీలో వెల్లడి ● ఏఈవోపై ఆగ్రహం
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం పీఏసీఎస్ నుంచి ఒకే కుటుంబానికి 35 బస్తాల యూరియా పంపిణీ చేశారు. ఈ విషయం కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీలో బయటపడడంతో ఆయన ఏఈవో వినోద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీఎస్‌లో తనిఖీలు చేపట్టిన కలెక్టర్.. యూరియా నిల్వలపై ఆరా తీశారు. మే నెలలో కోజన్‌కొత్తూర్‌కు చెందిన ఒకే కుటుంబసభ్యులు అలేఖ్య, గంగాధర్, గంగరాం పేరిట 35 యూరియా బస్తాలు ఇచ్చినట్లు గమనించారు. సదరు రైతుల ఆధార్, పట్టాదార్ పాస్ పుస్తకాల జిరాక్స్ కాపీలు చూపించాలని సీఈవో సతీశ్‌కుమార్‌కు సూచించగా.. లేవని సమాధానం చెప్పారు. దీంతో సతీశ్‌కుమార్‌తోపాటు ఏఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ జరిపి నివేదించాలని డీఏవో భాస్కర్‌ను ఆదేశించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఔట్‌పేషెంట్లు, రికార్డులు చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో ఇప్పటివరకు నాలుగు డెంగీ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ కలెక్టర్‌కు వివరించారు. అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి రికార్డులు పరిశీలించారు. భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలని తహసీల్దార్‌కు సూచించారు. కొత్త రేషన్‌కార్డుల కోసం ఇప్పటివరకు 1300 దరఖాస్తులు రాగా.. 293 పెండింగ్‌లో ఉన్నాయని తహసీల్దార్ సూచించారు. కార్యక్రమంలో మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్,డీఏవో భాస్కర్, డీఎంహెచ్‌వో ప్రమోద్ కమార్, ఏడీఏ రమేశ్, ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీవో రామకృష్ణరాజు, ఏవో రాజ్‌కుమార్, ఆర్‌ఐలు రేవంత్‌రెడ్డి, రమేశ్, వైద్యాదికారి హరీశ్, సింగిల్‌విండో చైర్మన్ బద్దం గోపి పాల్గొన్నారు.