
మహిళా సంఘాలకు రూ.15.31కోట్ల వడ్డీ విడుదల
జగిత్యాలరూరల్: జిల్లాలోని స్వయం సహాయక బృందాల సభ్యులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా మహిళాశక్తి పథకం ద్వారా స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పుతోంది. వారికి ఆర్థిక సహాయం అందించడంతోపాటు, ఉత్పత్తి చేసిన వస్తువులను విక్రయించేందుకూ అవకాశం కల్పిస్తోంది. బ్యాంక్ రుణాలతోపాటు, సీ్త్రనిధి రుణాలు అందిస్తోంది. ఇందులో భాగంగా ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలకుగాను జిల్లాలో 12,800 మంది సభ్యులు తీసుకున్న రుణాలకు ఆర్నెళ్ల వడ్డీ రూ.15.31కోట్లు మంజూరు చేసింది. ఆ వడ్డీని మహిళ సంఘ సభ్యుల బ్యాంక్ ఖాతాల్లో జమచేస్తున్నారు.
పలు రకాల యూనిట్లకు ఆర్థిక సహాయం
మహిళా సంఘ సభ్యులు మైక్రో ఎంటర్‌ప్రైజెస్, కుట్టు కేంద్రాలు, మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్‌లెట్స్, పాడిపశువుల కొనుగోలు, పెరటి కోళ్ల పెంపకం, పాల కేంద్రం యూనిట్, మీసేవ కేంద్రాల ఏర్పాటు, పౌల్ట్రీఫామ్స్, ఈవెంట్ మేనేజ్‌మెంట్, క్యాంటీన్ల ఏర్పాటు, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్, ఫుడ్ ప్రాసెస్ యూనిట్, మహిళాబజార్, వ్యవసాయ ఉపకరణాల అద్దె కేంద్రాలు ఏర్పాటుకు ప్రోత్సహిస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం 60శాతం, రాష్ట్రప్రభుత్వం 40 శాతం నిధులు కేటాయిస్తున్నాయి.
జిల్లాలో మండల సమైక్యలు 18
గ్రామ సమైక్యలు 565
స్వశక్తి సంఘాలు 15,013
మహిళా సంఘ సభ్యులు 1,76,845