
వేతనాలు రావు.. వెతలు తీరవు
మెట్‌పల్లిరూరల్: గ్రామ పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఈ–పంచాయతీ ఆపరేటర్లు వేతనాలు అందక సతమతం అవుతున్నారు. అదనపు పనిభారం, చాలీచాలని వేతనం సకాలంలో అందక, ఉద్యోగ భద్రత లేక ఇబ్బంది పడుతున్నారు. దశాబ్ద కాలంగా విధులు నిర్వర్తిస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, నాలుగు నెలలుగా ప్రభుత్వం తమకు వేతనాలే ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం విధులు బహిష్కరించి తమ నిరసన వ్యక్తం చేశారు. డీపీవో మదన్‌మోహన్‌ను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు.
జిల్లాలో 62 మంది ఈ పంచాయతీ ఆపరేటర్లు
ఈ–సేవలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లాలని గత ప్రభుత్వం గ్రామ పంచాయతీ స్థాయిలో ఈ–పాలన విధానం కింద కంప్యూటీకరణను చేపట్టింది. ఇంటర్‌నెట్ వ్యవస్థను ఉపయోగించుకొని గ్రామ పంచాయతీ సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్నీ పెంపొందించే ఉద్దేశంతో ఈ పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇందుకోసం 2014–15లో క్లస్టర్ వారీగా గ్రామ పంచాయతీ స్థాయిలో 62 ఈ–పంచాయతీ ఆపరేటర్లను నియమించింది. కార్వీ సంస్థ ద్వారా ఔట్ సోర్సింగ్ పద్ధతిన నియమకాలు చేపట్టింది. సంస్థ కాలపరిమితి ఏడాది మాత్రమే ఉండడం, నియామకం గడువు ముగియడంతో 2016లో మళ్లీ విధుల్లోకి తీసుకుంది. వీరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో ఆన్‌లైన్ చేస్తున్నారు. ప్రజాపాలన, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతుభరోసా, జనన, మరణ ధృవీకరణ పత్రాలు, భవన నిర్మాణ అనుమతులు, ఆస్తి మార్పిడి, వ్యాపార లైసెన్స్‌లు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు, ఎన్నికల పనులు, పంచాయతీల ఆదాయ, వ్యయాలు, పాటు ఇతరత్రా పనులు కంప్యూటీకరిస్తున్నారు.
నాలుగు నెలలుగా వేతనాల్లేవ్..
ఆపరేటర్లకు నాలుగు నెలలుగా వేతనాలు రావడంలేదు. గతంలో 15వ ఆర్థిక సంఘం ద్వారా పరిపాలన వ్యయం నుంచి 10 శాతం నిధులతో వేతనం చెల్లించేవారు. ఒక్కో ఆపరేటర్‌కు రూ.22,750 వేతనం వచ్చేది. సర్పంచుల పదవీకాలం ముగియడంతో కేంద్రం గ్రాంట్లు నిలిపివేసింది. నాలుగు నెలల క్రితం వరకు మల్టీపర్పస్ వర్కర్లకు కేటాయించిన నిధుల్లోని మిగులు బడ్జెట్‌లో నుంచి రూ.19,500 చొప్పున చెల్లించారు. ప్రస్తుతం నాలుగు నెలలుగా ఇవ్వడమే లేదు.
ఆపరేటర్ల డిమాండ్లివే..
ఉద్యోగ భద్రత కల్పించాలి. జానియర్ అసిస్టెంట్ పేస్కేలు అమలు చేయాలి. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు కల్పించాలి. ఉద్యోగులందరికీ ఆరోగ్య బీమా కల్పించాలి. ఉద్యోగుల్లో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగ అవకాశం కల్పించాలి. వేతనాల కోసం ప్రత్యేక గ్రాంట్లు కేటాయించాలి.
ఈ–పంచాయతీ ఆపరేటర్ల సతమతం
నాలుగు నెలలుగా జీతాల్లేక ఇబ్బందులు
పదేళ్లుగా పనిచేస్తున్నా భద్రత లేదని ఆందోళన
విధులు బహిష్కరించి నిరసన తెలిపిన ఆపరేటర్లు