
సాగునీటి కోసం ఆందోళన
మెట్‌పల్లి/కథలాపూర్: ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువ, వరదకాలువకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పలు గ్రామాల రైతులు మెట్‌పల్లి, కథలాపూర్‌లో మంగళవారం ఆందోళనకు దిగారు. మెట్‌పల్లిలో నీటి పారుదల శాఖ కార్యాలయానికి వచ్చిన రైతులు.. అక్కడ అధికారులకు పంటల పరిస్థితిని వివరించారు. అధికారులు స్పందించకపోవడంతో అక్కడే బైఠాయించారు. అనంతరం ఎస్సారెస్పీ వంతెన వద్దకు వెళ్లి అక్కడ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. పోలీసులు సంఘటనస్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. విషయాన్ని ఉన్నతాధికారులకు వివరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. కథలాపూర్ మండలకేంద్రంలో కోరుట్ల–వేములవాడ రోడ్డుపై ధర్నా చేశారు. వరదకాలువలో నీరుంటే తమ పంటలకు అందేవని, వరదకాలువను నమ్ముకుని నార్లు పోశామని పేర్కొన్నారు. ఇప్పుడు నీళ్లు లేకపోవడంతో నార్లు, పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధగంటపాటు ఆందోళన చేసినా.. అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో ఆగ్రహించిన రైతులు వంటావార్పుకు సిద్ధమయ్యారు. వంట చేసేందుకు మాజీ జెడ్పీడీసీ నాగం భూమయ్య బిచ్చమెత్తారు. పలువురు రైతులు రోడ్డుపైకి నిత్యావసర వస్తువులు తీసుకురావడంతో ఆందోళన ఉధృతంగా మారుతుందని భావించిన అధికారులు రైతుల వద్దకు చేరుకున్నారు. దీంతో రైతులు పెద్ద ఎత్తున నినదించారు. కోరుట్ల సీఐ సురేశ్‌బాబు, తహసీల్దార్ వినోద్, ఎస్సై నవీన్‌కుమార్ ఘటనస్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. కోరుట్ల ఆర్డీవో జివాకర్‌రెడ్డి ఫోన్‌లో రైతులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రైతు నాయకులు లోక బాపురెడ్డి, మాజీ జెడ్పీటీసీ నాగం భూమయ్య, పిడుగు ఆనంద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సాగునీటి కోసం ఆందోళన