
విద్యుత్ ప్రమాదాలు నివారించాలి
కోరుట్ల: విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ సిబ్బందికి సహకరించాలని ఎస్‌ఈ సుదర్శనం అన్నారు. మేడిపల్లి మండలం వల్లంపల్లి, మెట్‌పల్లి మండలం కోనరావుపేట శివారులో ఏర్పాటు చేసిన 33 కేవీ విద్యుత్ టవర్లను మెట్‌పల్లి డీఎస్పీ రాములుతో కలిసి మంగళవా రం ప్రారంభించారు. పట్టణంలో గణపతి విగ్రహాల తయారీదారులతో సమావేశమయ్యారు. గణపతుల తయారీ షెడ్లలో విద్యుత్ వైరింగ్ తరచూ తనిఖీ చేసుకోవాలన్నారు. విగ్రహాల తరలింపు సమయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. 30 మంది గణపతి విగ్రహాల తయారీ దారులకు నోటీసులు జారీ చేశారు. డీఈ మధుసూదన్, డీఈ టెక్నికల్ గంగారాం, ఏడీఈ కోరుట్ల రఘుపతి, ఏఈలు సిబ్బంది పాల్గొన్నారు.
భద్రత ప్రమాణాలు పాటించకుంటే జరిమానా
మెట్‌పల్లి: విధులు నిర్వహించే సమయంలో విద్యుత్ సిబ్బంది భద్రత ప్రమాణాలు పాటించకుంటే జరిమానా విధిస్తామని ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ సుదర్శనం తెలిపారు. మంగళవారం మెట్‌పల్లి, మల్లాపూర్ సబ్ డివిజన్ సిబ్బందికి అవగాహన కల్పించారు. సిబ్బంది హెల్మెట్, సేఫ్టీబెల్ట్, ఎర్త్ డిశ్చార్జ్ రాడ్, ఇండక్షన్ టెస్టర్ తప్పనిసరిగా వినియోగించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పట్టుబడితే రూ.మూడువేల జరిమానా వసూలు చేసి ఆ మొత్తాన్ని సంస్థ చారిటీఖాతాలో జమ చేస్తామన్నారు.