
వివాదాస్పదంగా మెట్‌పల్లి క్లబ్ స్థల విక్రయం
● పోలీసులకు పలువురు ఫిర్యాదు ● రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని డిమాండ్
మెట్‌పల్లి: పట్టణంలోని రాంనగర్‌లో ఉన్న మెట్‌పల్లి క్లబ్ సొసైటీకి చెందిన విలువైన స్థలాన్ని విక్రయించడం వివాదానికి దారి తీసింది. తమకు సమాచా రం ఇవ్వకుండా స్థలాన్ని విక్రయించారని, వచ్చిన సొమ్ములో తమకు సమాన వాటా ఇవ్వడం లేదని సొసైటీ ఉంటూ చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణ చేపట్టాలని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ అంశం స్థానికంగా చర్చనీయాంశమైంది.
విక్రయించింది 1864 గజాలు
● పట్టణానికి చెందిన కొందరు మెట్‌పల్లి క్లబ్ సొసైటీని ఏర్పాటు చేశారు. సుమారు 190 మందికి సభ్యత్వం ఇచ్చారు. వీరందరి సహకారంతో స్థానిక రాంనగర్‌లో 1864 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి అందులో కొన్ని నిర్మాణాలు చేపట్టారు.
● విలువైన సదరు స్థలాన్ని క్లబ్ అవసరాల కోసం సభ్యుల సమ్మతితో ఇటీవల విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు.
● ఓపెన్ టెండర్‌తో ఆ స్థలాన్ని ఇద్దరు వ్యక్తులు కొనుగోలు చేయగా.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యింది.
వారి అభ్యంతరంతో వివాదం
● సదరు స్థలాన్ని విక్రయించే సమాచారం తమకు తెలపలేదని చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండడం వివాదానికి దారి తీసింది.
● స్థలం విక్రయించగా.. వచ్చిన సుమారు రూ.4కోట్లను సభ్యులందరికి సమానంగా పంపిణీ చేయలేదని, చనిపోయిన వారి కుటుంబాలకు కేవలం రూ.30వేల చొప్పున ఇచ్చి దౌర్జన్యంగా సంతకాలు తీసుకుంటున్నారని విమర్శిస్తున్నారు.
● ఈ వ్యవహారాన్ని శనివారం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు దృష్టికి తీసుకెళ్లడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
● రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.