
పాఠశాలను కాపాడాలని గ్రామస్తుల ధర్నా
మల్లాపూర్: తమ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులను ఎక్కడికీ పంపించొద్దని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు జాతీయ రహదారిపై ధర్నాకు దిగిన ఘటన మండలంలోని రేగుంటలో చోటుచేసుకుంది. గ్రామంలోని ప్రీప్రైమరీలో 19 మంది ఉండగా.. బడిబాటతో సుమారు 142మందికి పెరిగారు. ఇక్కడ నలుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. తాజాగా ఒకరిని వేరే పాఠశాలకు సర్దుబాటు చేశారు. దీంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయుల మాట విని పిల్లలను బడిలో చేర్పించామని, ఇప్పుడు సర్దుబాటు పేరిట ఇతర పాఠశాలకు పంపిస్తే తమ పిల్లల భవిష్యత్ ఏం కావాలని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న ఎస్సై రాజు సిబ్బందితో ఘటనస్థలికి చేరుకున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ధర్నాలో ఆల్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు గనవేని మల్లేశ్, మహిళా నాయకురాలు ఇనుగుర్తి సరిత, బొల్లారపు నరహరి, ఎండీ.బషీర్, కుక్కుదుగు అశోక్, దురిశెట్టి ప్రకాష్, శ్రీనివాస్, దండికే వెంకటేశ్, పిప్పెర రమేశ్, నాగరాజు, ఆరెళ్ల చిన్నశంకర్, మ హిళలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.