
ప్రతీ ఒక్కరికి ఆధార్‌కార్డు ఉండాలి
జగిత్యాల: ప్రతి ఒక్కరు ఆధార్‌కార్డు కలిగి ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పిల్లలు జన్మించినప్పుడు వెంటనే సంబంధిత ఆస్పత్రి వారి ద్వారా జనన ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని, ఆస్పత్రుల్లో పిల్లలకు టీకాలు వేసే సందర్భంలో ఆధార్ ద్వారా ఎన్రోల్మెంట్‌ను ప్రోత్సహించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ఆధార్ లేకుంటే నమోదు చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జనన ధ్రువీకరణ పత్రాల జారీలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ లత, ఆర్డీవో మధుసూదన్, డీఆర్డీఏ పీడీ రఘువరణ్, యువైడీఏఐ అధికారి నరేశ్ పాల్గొన్నారు.
వసతి గృహాల తనిఖీ
మల్యాల(చొప్పదండి): మండలంలోని తాటిపల్లి బాలికల గురుకుల కళాశాల, మండలకేంద్రంలోని కస్తూరిబా పాఠశాలను శుక్రవారం అదనపు కలెక్టర్ బీఎస్ లత తనిఖీ చేశారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తాజా కూరగాయలు ఉపయోగించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తహసీల్దార్ వసంత, ప్రిన్సిపాల్ మానస తదితరులు పాల్గొన్నారు.