షియోమి.. కుంగ్‌ ఫూ రోబో!

Xiaomi Unveiled Its First Full Size Humanoid Robot CyberOne - Sakshi

ఓ కార్యక్రమం జరుగుతోంది.. స్టేజీ మీద ఉన్న వ్యాఖ్యాత ఓ ప్రత్యేక వ్యక్తిని పిలిచారు.. అతను మెల్లమెల్లగా అడుగులో అడుగేసుకుంటూ వచ్చాడు. అందరికీ పరిచయం చేసుకున్నాడు.. సెల్ఫీ దిగుదామంటే కుంగ్‌ ఫూ పోజిచ్చాడు. కుంగ్‌ ఫూ ప్రాక్టీస్‌ చేసుకోవాల్సి ఉంటుందంటూ వెళ్లిపోయాడు.. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలుసా..? చైనాకు చెందిన ప్రఖ్యాత స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ షియోమి తాజాగా విడుదల చేసిన హ్యూమనాయిడ్‌ (మనిషిని పోలిన) రోబో. దాని పేరు ‘సైబర్‌వన్‌’. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా టెస్లా ‘ఆప్టిమస్‌’ రోబో విడుదలకు కొన్నిరోజుల ముందు షియోమి సంస్థ ఇలా ‘సైబర్‌వన్‌’ను ప్రదర్శించడం ఆసక్తి రేపుతోంది.

మడత పెట్టగల ఫోన్‌ రిలీజ్‌ చేస్తూ..
సోమవారం షియోమీ సంస్థ తాము రూపొందించిన ఫోల్డబుల్‌ ఫోన్‌ను విడుదల చేస్తూ.. ఈ సరికొత్త రోబోను ప్రదర్శించింది. షియోమి సీఈవో లీ జున్‌ ‘సైబర్‌వన్‌’ రోబోను స్టేజీపైకి పిలిచారు. సైబర్‌ వన్‌ చేతిలో పువ్వు పట్టుకుని మెల్లగా నడిచి వచ్చింది. పువ్వును లీ జున్‌కు ఇచ్చింది. పురుష గొంతుతో మాట్లాడుతూ అందరికీ హాయ్‌ చెప్పింది. సెల్ఫీ దిగుదామని అడిగితే.. కుంగ్‌ ఫూ ఫోజు ఇచ్చింది. సెల్ఫీ దిగాక కుంగ్‌ ఫూ ప్రాక్టీసు చేసుకోవాలంటూ వెళ్లిపోయింది. ఈ వీడియోను షియోమి సంస్థ తమ యూట్యూబ్‌ చానల్‌లో పెట్టింది.

బుడి బుడి అడుగులతో..
తమ రోబోకు సంబంధించి మరో వీడియోనూ షియోమీ సంస్థ విడుదల చేసింది. ‘సైబర్‌వన్‌’ రోబో బుడి బుడి అడుగులు వేస్తున్న చిన్నారిలా పడుతూ లేస్తూ నడక నేర్చుకుని.. రేయింబవళ్లూ నడుస్తూ గమ్యాన్ని చేసుకున్నట్టుగా చిత్రించింది. చివరిగా ‘ఏదైనా అద్భుతం జరుగబోతోందని ఎల్లప్పటికీ నమ్ముతాం..’ అంటూ క్యాప్షన్‌తో ముగించింది.

ఏమిటీ రోబో ప్రత్యేకతలు
షియోమి సంస్థ వెల్లడించిన వివరాల మేరకు.. ‘సైబర్‌వన్‌’ రోబో ఎత్తు ఐదు అడుగుల 9.7 అంగుళాలు (177 సెంటీమీటర్లు). బరువు 52 కిలోలు
మనుషులకు సంబంధించి సంతోషం, విషాదం వంటి 45 రకాల భావోద్వేగాలను ఈ రోబో గుర్తించగలదు.
మన చుట్టూ ఉండే వాతావరణానికి సంబంధించి 85 రకాల ధ్వనులను అవి దేనికి సంబంధించినవో గుర్తించగలదు.
షియోమీ సంస్థకు చెందిన రోబోటిక్స్‌ ల్యాబ్‌ అభివృద్ధి చేసిన కృత్రిమ మేధ (ఏఐ) ప్రోగ్రామ్‌ ఆధారంగారోబో పనిచేస్తుంది.
తన చుట్టూ ఉన్న పరిసరాలను త్రీడీ వర్చువల్‌ దృశ్యాలుగా మార్చుకుని చూడగలదు. 
అత్యంత శక్తివంతంగా పనిచేసే సరికొత్త మోటార్లను ఇందులో ఉపయోగించారు.
ఈ రోబో ధర రూ.82.7 లక్షలు అని సంస్థ పేర్కొంది.
భవి­ష్యత్తులో ప్రజల జీవితాల్లో భాగస్వామ్యం అయ్యే అద్భుత టెక్నాలజీలతో రోబోలను రూపొందిస్తామని షియోమీ సీఈవో లీ జున్‌ ప్రకటించారు.
– సాక్షి సెంట్రల్‌డెస్క్‌ 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top