ట్రంప్ మనసు చదవాలనుకున్నాడు.. ఇంతలోనే.. | Who Is Oz Pearlman: Man Performing During Shooting Incident | Sakshi
Sakshi News home page

ట్రంప్ మనసు చదవాలనుకున్నాడు.. ఇంతలోనే..

Apr 26 2026 11:32 AM | Updated on Apr 26 2026 1:08 PM

Who Is Oz Pearlman: Man Performing During Shooting Incident

వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్‌లో శనివారం రాత్రి  ఓ దుండగుడు కాల్పులకు తెగబడటం షాక్‌కు గురిచేసింది. షాట్‌గన్‌తో భద్రతా సిబ్బందిపై కాల్పులు కలకలం  రేపాయి. అయితే, ఈ ఘటన జరిగిన సమయంలో ట్రంప్.. ఒక ప్రదర్శనకారుడితో నిమగ్నమై ఉన్నారు. అతని పేరు ఓజ్ పెర్ల్‌మాన్. ఆ విందులో ఆయన ప్రాధాన్యత ఏంటి?. ఈసారి విందు.. సంప్రదాయానికి భిన్నంగా ఎందుకు జరిగింది? పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం

ఓజ్ పెర్ల్‌మాన్.. అమెరికన్ మెంటలిస్ట్. మైండ్ రీడింగ్ (మనసును చదవడం), ఇంటరాక్టివ్ మెంటలిజంలో ఆయన ప్రసిద్ధి చెందారు. 43 ఏళ్ల పెర్ల్‌మాన్ 2015లో 'అమెరికాస్ గాట్ టాలెంట్' సీజన్ 10లో మూడో స్థానంలో నిలిచి గుర్తింపు పొందారు. అప్పటి నుండి కార్పొరేట్ క్లయింట్లు, అథ్లెట్లు, టీవీ ప్రేక్షకుల కోసం ప్రదర్శనలు ఇస్తున్నారు. ఆయన.. ది జో రోగన్ ఎక్స్‌పీరియన్స్, ది ఎల్లెన్ షో, లేట్ నైట్ విత్ జిమ్మీ ఫాలన్ వంటి ప్రసిద్ధ కార్యక్రమాల్లో కనిపించారు. 2018లో తన ఎన్‌బీసీ ట్రావెల్ షో 'ఓజ్ నోస్'కు ఎమ్మీ అవార్డును గెలుచుకున్నారు.

ఈ సారి సంప్రదాయానికి భిన్నంగా..
ఈసారి వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌ సంప్రదాయానికి భిన్నంగా జరిగింది. సాధారణంగా డిన్నర్‌లో అధ్యక్షుడు, మీడియా రంగంపై జోకులు వేయడానికి హాస్యనటుడిని ఆహ్వానిస్తారు. కానీ ఈసారి పెర్ల్‌మాన్‌ను ప్రధాన ప్రదర్శనకారుడిగా ఎంపిక చేశారు. 2025 కోసం కమెడియన్ అంబర్ రఫిన్‌ను అనుకున్నప్పటికీ.. ట్రంప్ పరిపాలనతో ఉన్న ఉద్రిక్తతల కారణంగా ఆమెను ముందే తొలగించారు. 2026 నాటి ఈ విందు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది.. ఎందుకంటే తన రెండు అధ్యక్ష కాలాల్లో ట్రంప్ హాజరైన మొదటి వేడుక ఇది. రాజకీయ విమర్శల కంటే.. 25 నిమిషాల పాటు నవ్వులు పూయించి.. అద్భుతమైన క్షణాలతో అందరినీ ఏకం చేయడమే తన లక్ష్యమని పెర్ల్‌మాన్ పేర్కొన్నారు.

నేను ట్రంప్ మనసును చదవగలనా?
వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవ్వడం అంత సులభం కాదు అంటూ పెర్ల్‌మాన్ ఈ కార్యక్రమానికి ముందు ఒక వ్యాసంలో రాశారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి మనసును చదవాలని నాకు ఉంది. అధ్యక్షుడు తదుపరి ఏమి చెబుతారో?. ఏమి చేస్తారో ఎవరూ ఊహించలేరు. ట్రంప్ అందరిలాంటి వ్యక్తి కాదు.. ఆయనను అర్థం చేసుకోవడం చాలా కష్టం’’ అని ఆయన పేర్కొన్నారు.

అందుకే ఈసారి ఇలా..
తాను రాజకీయాలకు అతీతుడినని.. ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి, విభజించడానికి తాను రాలేదన్నారు. అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ అలరించడమే తన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. కమెడియన్ల విమర్శలు ట్రంప్‌కు నచ్చవు కాబట్టే.. ఈసారి తనలాంటి మెంటలిస్ట్‌ను ఎంపిక చేసి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు.
 

Advertisement
 
Advertisement
Advertisement