ఇరాన్‌లో నిర్ణయాలు వీళ్లే తీసుకుంటున్నారా? ఇలాగైతే యుద్ధం.. | Who is making decisions in Iran | Sakshi
Sakshi News home page

ఇరాన్‌లో నిర్ణయాలు వీళ్లే తీసుకుంటున్నారా? ఇలాగైతే యుద్ధం..

Apr 26 2026 5:20 PM | Updated on Apr 26 2026 6:55 PM

 Who is making decisions in Iran

అమెరికా-ఇరాన్‌ మధ్య ఒప్పందం కుదురుతుందా? యుద్ధం మళ్లీ మొదలవుతుందా? అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? అన్న సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. ఇరాన్‌ డిమాండ్లకు అమెరికా ఒప్పుకోవడం లేదు. అమెరికా డిమాండ్లకు ఇరాన్‌ ఒప్పుకోవడం లేదు. అమెరికాలో ‍ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తమ దేశం తరఫున అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. 

అలీ ఖమేనీ (ఇరాన్‌ దివంగత సుప్రీం లీడర్‌)ను అమెరికా-ఇజ్రాయెల్‌ చంపేసిన తర్వాత అతడి కుమారుడు మొజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్‌గా పదవీ బాధ్యతలు స‍్వీకరించారని ఇరాన్‌ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. అయితే, మొజ్తబా ఖమేనీ తీవ్రగాయాలతో బాధపడుతున్నాడని, నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా అతడికి లేదని ప్రచారం జరుగుతోంది. మరోవైపు, అమెరికాతో చేస్తున్న యుద్ధంలో నిర్ణయాలు తీసుకునే అంశంపై మొజ్తబా ఖమేనీని కాదని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) పట్టు బిగించే ప్రయత్నాలు చేస్తోందని పలు నివేదికలు కూడా వచ్చాయి.

నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు? 
అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధం చేస్తోంది ఇరాన్‌. మరి ఈ యుద్ధానికి ఇరాన్‌లో బాధ్యత తీసుకుంటోంది ఎవరు? ఆధికారికంగానైతే సుప్రీం లీడరే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఆయనే బాధ‍్యత వహిస్తున్నారని ఆ దేశం చెబుతోంది. ఫిబ్రవరి 28న (యుద్ధం తొలి రోజే) అలీ ఖమేనీ మృతి చెందాడు. ఆ తర్వాత మొజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్‌గా బాధ్యత స్వీకరించాడు. 

ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థలో ఆ పదవిలో ఉన్న వారే తుది నిర్ణయం తీసుకుంటారు. యుద్ధం, శాంతి, దేశానికి సంబంధించిన వ్యూహాలు వంటి ముఖ్య విషయాలపై తుది మాట ఆ సుప్రీం లీడర్‌దే. అయితే, ఇరాన్‌కు సంబంధించిన నిర్ణయాలు నిజంగానే మొజ్తబా ఖమేనీనే తీసుకుంటున్నారా?   

ఇరాన్ నాయకత్వంలో అంతర్గతంగా ఏకాభిప్రాయం లేదని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఒకే నిర్ణయం మీద లేరని, వేర్వేరు వర్గాలు వేర్వేరు అభిప్రాయాలు చెబుతున్నాయని ట్రంప్‌ తెలిపారు. అమెరికా ప్రభుత్వం ఒకే అభిప్రాయంతో, స్పష్టమైన ప్రతిపాదన ఇవ్వాలని అమెరికా కోరుతోందని అన్నారు. అప్పుడు మాత్రమే చర్చలు సరిగ్గా ముందుకు వెళ్తాయని చెప్పారు.

సుప్రీం లీడర్‌ ఎక్కడ?
పదవి చేపట్టిన తర్వాత మొజ్తబా ఖమేనీ ఒక్కసారి కూడా ప్రజల ముందుకు రాలేదు. ఆయన పేరిట లిఖితపూర్వకంగా కొన్ని ప్రకటనలు రావడం తప్ప ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇరాన్‌ వ్యూహాలకు ఆమోదం తెలుపుతున్నారని గానీ చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. 

అమెరికా-ఇజ్రాయెల్‌ దాడుల్లో మొజ్తబా గాయపడ్డాడని ఇరాన్ అధికారులు అంగీకరించారు. కానీ, అందుకు సంబంధించిన వివరాలు తక్కువగా ఇచ్చారు. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. మొజ్తబా ముఖం సహా శరీరంలోని పలు అవయవాలకు గాయాలు తగిలి మాట్లాడటానికి కష్టంగా మారిందని పేర్కొంది. ఇరాన్ రాజకీయ వ్యవస్థలో అధికారం కేవలం సంస్థాగతం కాదు. మొజ్తబా తండ్రి అలీ ఖమేనీ ప్రసంగాలు, ప్రత్యక్షంగా పలు కార్యక్రమాలకు హాజరు కావడం, పలు వర్గాల మధ్య మధ్యవర్తిత్వం జరిపేవారు. అటువంటి కార‍్యక్రమాలు ఇప్పుడు జరగడం లేదు.

కొందరు యుద్ధ సమయంలో పదవీ స్వీకరణ వల్ల అతను తన అధికారాన్ని స్థాపించలేకపోయాడని అంటున్నారు. మరికొందరు గాయాల కారణంగా వ్యవస్థను నిర్వహించగలడా అన్న ప్రశ్న వేస్తున్నారు. పరిస్థితుల గురించి స్పష్టత లేదు. ఎవరు ఏమి నిర్ణయిస్తున్నారు? అసలు అధికారంలో ఎవరు బలంగా ఉన్నారు? అన్న దానిపై గందరగోళం ఉంది.

క్లిష్టమైన సమయంలో బాధ్యతలు 
మొజ్తబా బాధ్యతలు చేపట్టిన సమయం చాలా క్లిష్టమైనది. ఆ సమయంలో యుద్ధం జరుగుతోంది. అందుకే తన నాయకత్వాన్ని పూర్తిగా అమలు చేయడానికి, తన మాట నిలబెట్టుకోవడానికి సరైన స్థిరత్వం, సమయం దొరకలేదు. ఫలితంగా, ఇరాన్‌లో ఇతర వర్గాలు/నాయకులు కూడా ప్రభావం చూపుతూ ఉండవచ్చు. పాలనలో మొజ్తబా పూర్తి నియంత్రణను స్థాపించుకోలేకపోయాడని తెలుస్తోంది. 

యుద్ధానికి ముందు నిర్ణయాలు సుప్రీంలీడర్‌ చుట్టూ ఉన్న వ్యవస్థ చేతిలో ఉండేవి. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు నిర్ణయాలు ఒక్కరే తీసుకోవడం లేదు. పలు వర్గాలు/నాయకులు కలిసి లేదా వేర్వేరు విధాలుగా ప్రభావం చూపుతున్నారు. అధికార వికేంద్రీకరణ జరిగింది.

ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ అమెరికాతో చర్చల్లో పాల్గొంటున్నారు. కానీ వ్యూహాలు రచించడం అనేది వీరి చేతల్లో లేదని తెలుస్తోంది. పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్-బాఘెర్ ఘాలిబాఫ్ నేతృత్వంలో ప్రతినిధి బృందానికి ప్రస్తుతం ఉన్న అధికారాలపై పలు ప్రశ్నలు తలెత‍్తుతున్నాయి.

ఇరాన్‌లో అరాఘ్చీ పాత్ర ఇతరుల నిర్ణయాల అమలు స్థాయిలోనే ఉంది. హార్మూజ్ విషయంలో ఆయన వెను వెంటనే చేసిన ప‍్రకటనలు సందేహాలు లేవనెత్తాయి. పెజెష్కియన్ కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఇస్లామాబాద్‌లో అమెరికాతో జరగాల్సిన రెండో దశ చర్చలు నిలిచిపోవడం దీన్నే సూచిస్తుంది.

హార్మూజ్ జలసంధి నియంత్రణ ఇరాన్‌కు ఒత్తిడి సాధనంగా మారింది. దీని ద్వారానే అమెరికాపై ఒత్తిడి తెస్తోంది. కానీ, దాన్ని మూసి ఉంచే నిర్ణయం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ – ఇరాన్ విప్లవ గార్డ్ సైనిక విభాగం) చేతిలో ఉంది. ఇరాన్‌లో ఒకే వ్యక్తి వ్యూహాన్ని స్పష్టంగా నడిపిస్తున్నట్టు కనిపించడం లేదు. చర్యలు, వాటికి సంబంధించిన సందేశాల మధ్య జాప్యం కనపడుతోంది.  

సుప్రీం లీడర్‌కు పూర్తిగా అధికారాలు ఉన్నాయి. కానీ, స్పష్టంగా అవే అమలు అవుతున్నట్లు కనపడడం లేదు. అధ్యక్షుడు నాయకత్వం వహించడం లేదు. రాజనీతిక చర్యలు నిర్ణయాత్మకంగా జరగడం కాదు. ఇలాగైతే యుద్ధం ఇప్పట్లో ఆగుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇరాన్‌ ఒప్పందం చేసుకోకపోతే చరిత్రలో ఎవరూ చూడనంత విధ్వంసాన్ని చూస్తారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటికే హెచ్చరించారు. యుద్ధం భీకరంగా జరిగితే ఇరాన్‌లో అంతా బూడిదే మిగులుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement