
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై మరోమారుతీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా భారతదేశంతో చాలా బాగానే కలిసిపోతుంది.. కానీ న్యూఢిల్లీ వాషింగ్టన్ నుండి విపరీతమైన సుంకాలు వసూలు చేస్తున్నందున చాలా ఏళ్లుగా ఇరుదేశాల సంబంధం ఏకపక్షంగా ఉందని వ్యాఖ్యానించారు.
వైట్‌హౌస్‌లో భారతదేశంపై విధించిన కొన్ని సుంకాలను తొలగించాలని ఆలోచిస్తున్నారా? అని మీడియా అడినప్పుడు.. తాము భారత్‌తో బాగానే కలిసిపోతామని, కొన్నేళ్లుగా భారత్- అమెరికా మధ్య సంబంధం ఏకపక్షంగా ఉందని పేర్కొన్నారు. అయితే తాను పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు అది మారిందని వ్యాఖ్యానించారు. భారత్ తమ నుండి అపారమైన సుంకాలను వసూలు చేస్తోందని, అది ప్రపంచంలోనే అత్యధికమని అని ట్రంప్ పేర్కొన్నారు. అందుకే అమెరికా.. భారత్‌తో పెద్దగా వ్యాపారం చేయడం లేదన్నారు.
అయితే తాము వారి నుండి భారీ సుంకాలు వసూలు చేయడం లేదు కాబట్టే వారు మాతో వ్యాపారం చేస్తున్నారు. వారిలా మూర్ఖంగా మేము వసూలు చేయడం లేదన్నారు. ఇక్కడ తయారవని ఉత్పత్తులను భారతదేశం యూఎస్‌లోకి ‘తరలిస్తోందని’ ట్రంప్ ఆరోపించారు.వారు తమ నుండి 100 శాతం సుంకాలను వసూలు చేస్తున్నందున తాము ఏమీ పంపడం లేదని పేర్కొన్నారు. ఇందుకు హార్లే డేవిడ్సన్ మోటార్ సైకిళ్లే ఉదాహరణ అన్నారు. మోటార్ సైకిళ్లపై 200 శాతం సుంకం ఉన్నందున భారతదేశంలో వీటిని విక్రయించలేమన్నారు.అయితే ఇప్పుడు హార్లే డేవిడ్సన్ భారతదేశానికి వెళ్లి అక్కడ మోటార్ సైకిల్ ప్లాంట్ నిర్మించింది. ఇప్పుడు వారు మన మాదిరిగా సుంకాలు చెల్లించాల్సిన అవసరం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు.