
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ సినిమాలకు భారీ షాక్ ఇచ్చారు. విదేశీ సినిమాలపై 100శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలో నిర్మించే చిత్రాలకు మినహాయించారు. ట్రంప్ నిర్ణయంతో తెలుగు సినిమాలపై టారిఫ్ ఎఫెక్ట్ పడనుంది. దీంతో అమెరికాలో విడుదల చేసే టాలీవుడ్ సినిమాలు వందశాతం టారిఫ్ చెల్లించాల్సి ఉంది.
విదేశీ సినిమాలపై 100శాతం విధిస్తూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. అందులో ‘మా సినిమా నిర్మాణ వ్యాపారం అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి ఇతర దేశాలు దొంగిలించాయి. ఇది చిన్నపిల్లవాడి నుండి మిఠాయి దొంగిలించినట్లే. బలహీనమైన, అసమర్థ గవర్నర్‌తో కాలిఫోర్నియా తీవ్రంగా దెబ్బతింది. ఈ దీర్ఘకాలిక, ఎప్పటికీ అంతం కాని సమస్యను పరిష్కరించేందుకు, అమెరికా వెలుపల నిర్మించే అన్ని సినిమాలపై 100 శాతం సుంకం విధిస్తున్నాను’అని పేర్కొన్నారు.
టాలీవుడ్ సినిమాలపై ఎఫెక్ట్
అమెరికాలో 700–800 థియేటర్లలో తెలుగు సినిమాలు విడుదలవుతుంటాయి. అలా విడుదలైన బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, పుష్పతో పాటు ఇతర టాలీవుడ్ సినిమాలు అమెరికాలో కోట్ల రూపాయల వసూళ్లు సాధించాయి. టాలీవుడ్ పరిశ్రమ లెక్కల ప్రకారం.. అంతర్జాతీయంగా టాలీవుడ్ సినిమాలకు మార్కెట్ ఉన్న దేశాల్లో అమెరికా తొలి రెండుమూడు స్థానాల్లో ఉంది.
టారిఫ్ ప్రభావం ఎలా ఉంటుందంటే
ఈ క్రమంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో టాలీవుడ్‌పై భారీ ఎఫెక్ట్ పడనుందని అంచనా. ట్రంప్ తాజా నిర్ణయంతో అమెరికాలో విడుదలయ్యే ప్రతి తెలుగు సినిమాపై వంద శాతం అదనపు టారిఫ్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. ఒక సినిమా పంపిణీదారులు రూ.5 కోట్ల రూపాయల విలువైన హక్కులు కొనుగోలు చేస్తే..మరో రూ.5 కోట్లు టారిఫ్‌గా చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల సినిమా టికెట్ ధరలు రెట్టింపు కావచ్చు. ప్రేక్షకులపై భారం పడే అవకాశం ఉంది.
పరిశ్రమలో ఆందోళన
ఇండియన్ సినిమాలపై అమెరికా తీసుకున్న నిర్ణయం వల్ల విదేశీ పంపిణీ ఒప్పందాలు, విడుదల వ్యూహాలు మారిపోవచ్చు. అమెరికాలో వసూళ్లు తగ్గిపోతే, నిర్మాతలు, పెట్టుబడిదారులు తమ వ్యూహాలను పునరాలోచించాల్సి ఉంటుంది. ట్రంప్ ఈ నిర్ణయాన్ని ‘అమెరికా సినిమా పరిశ్రమను రక్షించేందుకు’ తీసుకున్నట్లు పేర్కొన్నారు. కానీ, ఇది అంతర్జాతీయ సినిమా వ్యాపారాన్ని గందరగోళంలోకి నెట్టే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.