
కైరో: గాజాకు తిరిగి వచ్చే పాలస్తీనియన్ల కోసం సోమవారం నుంచి రఫా క్రాసింగ్ పాయింట్‌ను తెరిచి ఉంచుతామని పాలస్తీనా దౌత్య కార్యాలయం తెలిపింది. గాజాకు తిరిగి వెళ్లేందుకు తమ వద్ద పేర్లు నమోదు చేయించుకున్న పాలస్తీనియన్ల సంఖ్య భారీగా ఉందని శనివారం పేర్కొంది. అయితే, ఎందరనే విషయం స్పష్టం చేయలేదు. ఈ ప్రకటనపై ఇజ్రాయెల్ ప్రభుత్వం స్పందించలేదు.
యుద్ధానికి ముందు ఇజ్రాయెల్ నియంత్రణలో లేని బయటి ప్రపంచానికి గాజాకు ఉన్న ఏకైక మార్గం ఈ క్రాసింగ్. గాజాను నియంత్రణ తీసుకున్న తర్వాత 2024 మే నుంచి ఇజ్రాయెల్ దీనిని మూసివేసింది. ఇలా ఉండగా, ఇజ్రాయెల్– హమాస్ మధ్య జరిగిన యుద్ధంలో మృతుల సంఖ్య 68 వేలు దాటిపోయిందని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. వారం క్రితం కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత మరణాల సంఖ్య పెరిగిందని పేర్కొంది. శిథిలాల తొలగింపు సందర్భంగా మృతదేహాలు బయటపడుతు న్నట్లు వెల్లడించింది.