నావికా దళానికి ట్రంప్ ఆదేశాలు
ఇరాన్‌కు సహకరిస్తే చైనాపై 50 శాతం టారిఫ్!
వాషింగ్టన్: శాంతిచర్చలు విఫలమవడంతో పట్టరాని ఆగ్రహంతో ఊగిపోతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనువెంటనే హార్మూజ్ జలసంధిని దిగ్భంధించాలని తమ నావికాదళానికి ఆదేశాలిచ్చారు. ఈ మేరకు సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఆదివారం ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘ఇరాన్‌కు అక్రమంగా టోల్ చెల్లించిన ఏ ఒక్క సరకు రవాణా నౌక కూడా జలసంధి గుండా రాకపోకలు సాగించడానికి వీల్లేదు.
ఇరాన్‌కు డబ్బులే కావాలి. మరీ ముఖ్యంగా అణ్వాయుధం కావాలి. అందుకే వాళ్ల ప్రయత్నాలను అడ్డుకుంటూ మేం హార్మూజ్‌ను దిగ్భందిస్తాం. ఇరాన్ అమర్చిన సముద్ర మందుపాతరలను ధ్వంసంచేస్తాం’’ అని అన్నారు. జలసంధి దిగ్బంధంలో మరికొన్ని దేశాలు అమెరికాకు సాయపడనున్నట్లు వార్తలొచ్చాయి. ‘‘ఇరాన్‌తో యుద్ధం చేయడం కంటే చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం వెతకడం ముఖ్యమని భావించి శాంతిచర్చలకు సిద్ధపడ్దాం. చాలా అంశాల్లో వాళ్లతో మాకు ఏకాభిప్రాయం కుదిరింది. కానీ అణ్వస్త్ర తయారీ కార్యక్రమం నిలుపుదలపై ఇరాన్ మొండికేసింది.
అందుకే చర్చలు విఫలమయ్యాయి. సంక్లిష్టమైన, అనూహ్యమైన, ప్రమాదకర ఇరాన్ పాలకుల చేతికి అణ్వాయుధం దక్కకుండా చేస్తా. ఇరాన్ ఏనాటికీ అణ్వస్త్ర సామర్థ్యం సాధించబోదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. చర్చల్లో మధ్యవర్తి పాత్ర పోషించిన పాక్ ప్రస్తావనను ట్రంప్ ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ‘‘పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిజంగా అసాధారణ వ్యక్తులు. భారత్‌తో యుద్ధాన్ని నిలువరించి ప్రత్యక్షంగా 3–5 కోట్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడిన నన్ను మునీర్, షెహబాజ్ పొగడ్తల్లో ముంచెత్తారు.
ఇరాన్‌కు రహస్యంగా ఆయుధాలను తరలిస్తే చైనాపై అదనంగా 50 శాతం టారిఫ్‌లు విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఫాక్స్ న్యూస్ ‘సండే మారి్నంగ్ ఫ్యూచర్స్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘భుజంపై నుంచి ప్రయోగించే క్షిపణి విధ్వంసక మిస్సైల్ లాంచర్‌ను ఇరాన్‌కు చైనా రహస్యంగా పంపిస్తోందన్న వార్తలు చదివా. అవి నిజమని అనుకోను. ఇప్పుడు చైనాతో అమెరికా సంబంధాలు బాగానే ఉన్నాయి. కానీ చైనా నిజంగానే ఇరాన్‌కు ఆయుధ సాయం చేస్తే 50 శాతం పన్నుల భారం పడేస్తా’’ అని హెచ్చరించారు.


