Typhoid Mary: Mary Mallon Special Story in Telugu - Sakshi
Sakshi News home page

జనం లేని దీవిలో 30 ఏళ్లు నిర్భంధించారు

Published Sun, Aug 8 2021 5:53 PM

Typhoid Mary Special Story - Sakshi

నేరమైనా, న్యాయమైనా కొన్నిసార్లు బలం ఎటు తూగితే అటు సాగుతుంది సమాజం. నిజానిజాలను నిర్ధారించే సాహసం చేయకుండానే! ఓ పోరాటం ఒంటరిగా నిస్సహాయతకు గురవుతుంటే.. వ్యతిరేక సాక్ష్యాలు కోకొల్లలై బలపడుతుంటే.. బహుశా అల్పమైన బతుకులు ఆయువు తీరేవరకూ తలవంచక తప్పదేమో?! అస్పష్టమైన నేరానికి నిర్బంధమనే శిక్షను చట్టం ఎప్పుడూ వ్యతిరేకిస్తుంది. కానీ నిర్దోషినని  నిరూపించుకోగలగాలి కదా? అదే జరగలేదు ఆమె జీవితంలో! తనకే తెలియని ఓ ఉచ్చులో చిక్కుకుని ఓ విషాదాంతంగా ముగిసిపోయింది. చరిత్రలో ఓ మిస్టరీగా మిగిలిపోయింది.

ఆమె అసలు పేరు మేరీ మల్లాన్‌. అయితే నేటికీ ఆమెను  ‘టైఫాయిడ్‌ మేరీ’గానే గుర్తిస్తారంతా. 1869లో సెప్టెంబర్‌ 23న ఉత్తర ఐర్లాండ్‌లోని కూక్స్‌ టౌన్‌లో పుట్టింది. 1883లో తన 15వ ఏట బంధువులతో కలసి అమెరికాకు వలస వచ్చింది. అప్పట్లో ఇంటి, వంట పనులకు అక్కడ మంచి వేతనం ఉండడంతో వంట మనిషిగా కొలువులో చేరింది. ఆఖరికి అదేSఆమె తలరాతను మార్చింది. మేరీ చేతి వంట తిన్నవారెవరైనా సరే అమృతాన్ని రుచి చూసినట్టే. అంత అద్భుతమైన పాక ప్రావీణ్యంతో  వంట మనిషిగా మేరీ జీవితం బాగానే సాగింది కొన్నేళ్ల పాటు. 1900లో అప్పటికే ఉనికిలోకి వచ్చిన టైఫాయిడ్‌ వ్యాప్తికి అపరిశుభ్రతే కారణమని కనిపెట్టారు శాస్త్రవేత్తలు. టైఫాయిడ్‌ సోకిన రోగి ద్వారానే అది ఇతరులకు వ్యాప్తి చెందుతుందని గుర్తించారు. ఈ పరిశీలన, పరిశోధన పర్యవసానం.. మేరీ.. టైఫాయిడ్‌ మేరీ కావడం. 

మేరీకి.. టైఫాయిడ్‌కి ఏంటి సంబంధం? 
అది తెలుసుకోవాలంటే ఆమెకు  ఏమాత్రం సంబంధం లేని జార్జ్‌ సాపర్‌ అనే సివిల్‌ ఇంజినీర్‌ గురించి చెప్పుకోవాలి. 1906లో చార్లెస్‌ హెన్రీ వారెన్‌ అనే ధనికుడి ఇంట్లో ఒకేసారి ఆరుగురికి టైఫాయిడ్‌ వచ్చింది. వారంతా పరిశుభ్రతను పాటించే వ్యక్తులే.  ఆ చుట్టుపక్కల టైఫాయిడ్‌ బాధితులు లేకపోవడంతో తమ కుటుంబానికి ఈ వ్యాధి ఎలా వ్యాపించిందో తెలుసుకోవాలని టైఫాయిడ్‌ వ్యాప్తిపై అనుభవం ఉన్న జార్జ్‌ సాపర్‌ని కోరాడు హెన్రీ. దాంతో మేరీ జీవితంలోకి ఆమె ప్రమేయం లేకుండా ఎంటర్‌ అయ్యాడు సాపర్‌. అప్పటికే హెన్రీ వారెన్‌ ఇంట్లో వంట మనిషిగా ఉన్న మేరీ.. ఆ కుటుంబంలో వారికి టైఫాయిడ్‌ సోకిన వారానికి  చెప్పాపెట్టకుండా మానేసిందనే పాయింట్‌ పట్టుకున్నాడు సాపర్‌. ఆరా తియ్యడం మొదలుపెట్టాడు. 

మేరీ ఎవరి ఇంట్లోనూ ఎక్కువ కాలం  పనిచేయదని, ఎప్పుడూ మారుతూ ఉంటుందని, ఆమె పనిచేసి వెళ్లిన ప్రాంతాల్లో టైఫాయిడ్‌ వ్యాపిస్తుందని తెలుసుకున్నాడు. అతడి అనుమానం బలపడింది. వివరాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు జనహితార్థం మేరీని న్యూయార్క్‌ దగ్గరలోని నార్త్‌ బ్రదర్‌ దీవిలో బంధించారు. మేరీకి వైద్య పరీక్షలు చేయించారు. అయితే ఆమెలో ఎలాంటి బ్యాక్టీరియా, వైరస్‌లు  లేవని  వైద్యులు తేల్చారు. దాంతో ఆ నిర్బంధాన్ని మేరీ వ్యతిరేకించింది.  తన హెల్త్‌ రిపోర్ట్స్‌ సాక్ష్యంగా 1910లో  న్యూయార్క్‌ స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ హెల్త్‌కు ఫిర్యాదు చేసి.. విడుదలైంది.. ఇకపై వంట చెయ్యకూడదనే షరతులకు ఒగ్గి! బయటకు వచ్చాక లాండ్రీ పని చేసుకుని బతికింది. కానీ చాలీచాలని జీతం జీవనానికి ఇబ్బందిగా మారడంతో.. మారు పేరు పెట్టుకుని మళ్లీ వంట చెయ్యడం మొదలు పెట్టింది. అదే ఆమె పాలిట శాపమైంది. 

1915లో స్లోనే మహిళా ఆసుపత్రిలో వంట మనిషిగా చేరింది మేరీ. అక్కడ 22 మంది వైద్యసిబ్బందికి ఒకేసారి టైఫాయిడ్‌ వ్యాపించడం, అందులో ఇద్దరు చనిపోవడంతో.. మళ్లీ పోలీసులు రంగంలోకి దిగారు. ఈసారి మేరీని మనుషులు లేని దీవికి తరలించారు. ఆ దీవిలో మేరీ ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా  30 ఏళ్లు నిర్బంధంలో గడిపింది. పక్షవాతం బారిన పడి ఆరేళ్లు కష్టపడింది.  తన 69 ఏట (1938) న్యుమోనియాతో  చనిపోయింది. శరీరంలో బ్యాక్టీరియా లేకుండా వ్యాధిని ఎలా వ్యాప్తి చేసిందనేది తేలకుండానే ఆమె కథ ముగిసింది. వైద్య పరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో మేరీ పరిస్థితిపై పరిశోధనలు, విశ్లేషణలే కాదు.. ఆమె తరపున  నిలబడి పోరాడిన  మనుషులూ లేరు. అయితే ఈ ట్రాజెడీ స్టోరీ తెలుసుకున్న వారు మాత్రం.. ఆమె వంట చేసేటప్పుడు చేతులు శుభ్రం చేసుకునేది కాదేమోనని అభిప్రాయపడుతుంటారు.
∙సంహిత నిమ్మన

Advertisement
Advertisement