వందేళ్ల క్రితం చనిపోయిన చిన్నారి... ఇంకా ఇప్పటికీ చెక్కుచెదరకుండా..

Two Year Old Girl Preserved Body Worlds Most Beautiful Mummy - Sakshi

ఇంతవరకు ఎన్నోరకాల మమ్మీలు గురించి చదివాం. పైగా వాటి అవయవాలు జాలా జాగ్రత్తగా భద్రపర్చారంటూ విన్నాం. ఆయా మమ్మీల వద్ద విలువైన నాణేలు, బంగారం వంటి వస్తువులను చూశాం. ఇంతవరకు చూసిన మమ్మీలన్నీ చాలా వరకు కాస్త డికంపోజ్‌ అయినట్లుగానే ఉన్నాయి. చనిపోయినప్పుడు ఎలా ఉండేవో అలానే యథాతథంగా ఉండటం అసాథ్యం. కానీ ఇక్కడొక చిన్నారి మమ్మీ మాత్రం తాజా మృతదేహంలా చెక్కు చెదరకుండా ఉండటమే కాకుండా  ప్రపంచంలో అందమైన మమ్మీగా పేరుగాంచింది.

వివరాల్లోకెళ్తే....రోసాలియా లాంబార్డో అనే రెండేళ్ల చిన్నారి డిసెంబర్‌ 2, 1920న తన రెండో పుట్టిన రోజున చనిపోయింది. వాస్తవానికి 1918 నుంచి 1920 మధ్య కాలంలో స్పానిష్‌ ప్లూ మహమ్మారీ ప్రబలంగా ఉండేది. ఆ సమయంలో ఈ చిన్నారి ఆ మహమ్మారి బారిన పడి మృతి చెందింది. అప్పటి నుంచి ఆ చిన్నారి మృతదేహాన్ని మమ్మీలా అత్యంతా జాగ్రత్తగా భద్రపరిచారు. ఈ మేరకు ఆ చిన్నారి మృతదేహం ఉత్తర సిసిలీలో పలెర్మోలోని కాపుచిన్‌ కాటాకాంబ్స్‌ అనే చోట భద్రపరచారు. వందేళ్ల తర్వాత కూడా   ఆ చిన్నారి మృతదేహం ఆమె చనిపోయినప్పుడూ ఎలాగా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉండటం గమనార్హం. 

పర్యావరణ కారకాల నుంచి ఆ మృతదేహం పాడవకుండా అత్యంత బహు జాగ్రత్తగా నైట్రోజన్‌తో నిండిన గాజు సేవ పేటికలో భద్రపరిచారు. ఈ చిన్నారి మమ్మీ ప్రస్తుతం పర్యాటక ఆకర్షణగా మారింది. ఈ కాపుచిన్‌ కాటాకాంబ్స్‌ అనేది దక్షిణ ఇటలీలో ఉండే అతి పెద్ద మమ్మీల పరిశోధన కేంద్రం లేదా మమ్మీలను భద్రపరిచే భూగర్భ శ్మశాన వాటిక. ఇందులో దాదాపు ఎనిమిది వేల మమ్మీలు ఉన్నాయి. రోసాలియా అనే రెండెళ్ల చిన్నారిని భద్రపరిచినంతగా మిగతా వాటిని భద్రపర్చలేదు. ఆ చిన్నారి రాగి జుట్టు, చర్మం రంగు మారకుండా ఏదో మనిషి నిద్రపోతున్నట్లుగా ఉంటుంది.

చాలామంది నకిలీ మమ్మీ అని, మైనపు ముద్ద అంటూ  పుకార్లు సృష్టించారు. మరికొంతమంది ఆ చిన్నారిని చూసినప్పుడు మమ్మల్ని చూసి రెప్పవేసిందని కూడా చెప్పారు. ఐతే వాటన్నింటిని కొట్టి పారేస్తూ...ఆ చిన్నారి శరీరం పై చేసిన పరిశోధనల్లో శరీరం, ఎముకలు, అవయవాలు ఏ మాత్రం చెక్కు చెదరలేదని, కేవలం మెదడు మాత్రమే ఉండాల్సిన పరిమాణం నుంచి 50% తగ్గిపోయిందని నిర్థారించారు ఆర్కియాలజిస్ట్‌లు.

ఏ మాత్రం పాడవకుండా ఉన్న ఈ చిన్నారి మమ్మీ ఇటలీ పురాణాల్లో ప్రసిద్ద అంశంగా మారింది. ఈ చిన్నారిని టాక్సీడెర్మిస్ట్, ఎంబాల్మర్ ఆల్ఫ్రెడో సలాఫియాలు మమ్మీగా మార్చారని చెబుతున్నారు. కానీ కొంతమంది శాస్తవేత్తలు మాత్రం ఈ మమ్మీ శవపేటికలో ఉండటం వల్ల ఇరు పక్కల ఉండే గాజు విండోలు ఒక ఆప్టికల్‌ ఇల్యూషన్‌ కలిగించి ఆ మమ్మీ చెక్కుచెదరకుండా ఉన్నట్లు కనిపించేలా చేస్తున్నాయని, పగటి పూట వేరేలా ఉంటుందని చెబుతున్నారు. 

(చదవండి: ఏనుగులతో సెల్ఫీ అంటే... అట్లుంటది మరీ!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top