ఒకప్పుడు రష్యాపై ఆంక్షలు, హెచ్చరికలతో ఒత్తిడి తెచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు అదే దేశాధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో ఇంధన ఒప్పందానికి సిద్ధమయ్యారు. అమెరికాలో పెరుగుతున్న డీజిల్ ధరలను తగ్గించేందుకు రష్యా నుంచి భారీగా ఇంధనం కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయం ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఒకవైపు ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు జరుపుతూనే.. మరోవైపు రష్యాకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చేలా వ్యవహరించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పుతిన్‌కు ఇలాంటి అవకాశాలు కల్పించడం వల్ల శాంతి సాధ్యం కాదని విమర్శించారు. అమెరికా తన ఇంధన అవసరాల కోసం రష్యాకు మళ్లీ దగ్గరవుతోందన్న చర్చకు ఈ పరిణామం తెరతీసింది.
పుతిన్‌కు వరం.. ఉక్రెయిన్‌కు ఆందోళన!
అమెరికా, రష్యా మధ్య కుదిరినట్లు ట్రంప్ ప్రకటించిన ఒప్పందం ప్రకారం.. తక్షణమే 3 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా డీజిల్ సరఫరా చేయనున్నారు. నవంబర్‌లో మరో 5 లక్షల టన్నులు, ఆ తర్వాత ఇంకో 10 లక్షల టన్నుల డీజిల్ అందించనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. పుతిన్‌తో జరిగిన చర్చలు విజయవంతమయ్యాయని తన ట్రూత్ సోషల్ ఖాతాలో పేర్కొన్నారు. అమెరికాలో ఇంధన ధరలను తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అయితే, ఈ ఒప్పందం ద్వారా రష్యాకు అదనపు ఆదాయం సమకూరుతుందని జెలెన్‌స్కీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ నిధులు ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగించేందుకు ఉపయోగపడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధాన్ని ముగించాల్సిన సమయంలో రష్యాకు ఆర్థికంగా చేయూతనివ్వడం సరికాదని విమర్శించారు.
‘పుతిన్‌కు బహుమతులిస్తే శాంతి రాదు’
ట్రంప్ నిర్ణయంపై జెలెన్‌స్కీ ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు. ‘పుతిన్‌కు బహుమతులు ఇవ్వడం వల్ల శాంతి రాదు. నాగరిక ప్రపంచానికి ఎలాంటి ప్రయోజనమూ ఉండదు’ అని వ్యాఖ్యానించారు. రష్యా ఈ డీజిల్ ఆదాయాన్ని మరింత దాడులు, మోసపూరిత చర్యలకు వినియోగించే అవకాశం ఉందని ఆరోపించారు. నిజమైన శాంతి సాధించాలంటే ఇరు పక్షాలు పరస్పరం ఉద్రిక్తతలను తగ్గించుకునే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు ప్రయత్నాల్లో భాగంగా ఉక్రెయిన్ ప్రతినిధి బృందం అమెరికాలో చర్చలు జరుపుతున్న సమయంలోనే ఈ ఒప్పందం ప్రకటించడం జెలెన్‌స్కీ అసంతృప్తికి మరో కారణంగా నిలిచింది. తమ బృందాన్ని కేవలం ఒక సాకుగా ఉపయోగించుకుంటున్నారనే భావన కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. బలమైన భాగస్వాములు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదని అసహనం వ్యక్తం చేశారు.
ఇంధన ధరల కోసం ఆంక్షల సడలింపు?
అమెరికాకు ఊరట..
అమెరికాలో డీజిల్ ధరలు భారీగా పెరగడంతో వాటిని నియంత్రించేందుకు ట్రంప్ ప్రభుత్వం రష్యా సరఫరాలపై దృష్టి పెట్టింది. అమెరికా ఆర్థిక శాఖ శుక్రవారం జారీ చేసిన సాధారణ లైసెన్స్ ద్వారా ఏప్రిల్ 7 వరకు రష్యా నుంచి డీజిల్ దిగుమతులకు అనుమతి కల్పించినట్లు కథనం పేర్కొంది. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యా ఇంధన సంస్థలపై ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, అమెరికాలో డీజిల్ ధరలు గ్యాలన్‌కు 6.28 డాలర్లకు చేరిన నేపథ్యంలో ట్రంప్ ఈ చర్యలు చేపట్టారు. రైతులు, పశువుల పోషకులు, ట్రక్కుల డ్రైవర్లపై ఇంధన ధరల భారాన్ని తగ్గించడమే తన ప్రాధాన్యమని తెలిపారు. అయితే, రష్యా నుంచి సరఫరాలు పెరిగినంత మాత్రాన ధరలు గణనీయంగా, దీర్ఘకాలం తగ్గుతాయని చెప్పలేమని చమురు రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా ప్రయోజనాలా.. శాంతి ప్రయత్నాలా?
అమెరికాలో ఇంధన ధరలను అదుపులోకి తీసుకురావాలన్న ట్రంప్ లక్ష్యం ఒకవైపు ఉంటే.. రష్యాకు అదనపు ఆదాయం సమకూరడం వల్ల ఉక్రెయిన్ యుద్ధం మరింత కొనసాగుతుందన్న ఆందోళన మరోవైపు ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయం అమెరికా ఇంధన అవసరాలు, ఉక్రెయిన్ శాంతి ప్రయత్నాల మధ్య కొత్త వివాదానికి దారితీసింది. పుతిన్‌తో ఒప్పందం అమెరికా వినియోగదారులకు ఎంతవరకు ఊరటనిస్తుందన్నది ఒక ప్రశ్నగా ఉంటే.. అదే సమయంలో రష్యాపై ఒత్తిడి తగ్గినట్లవుతుందా అన్నది అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
ఇదీ చదవండి: కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌కు ఇజ్రాయెలీ అవార్డు!


