- అమెరికా కొత్త డీపోర్టేషన్ చీఫ్‌గా మాజీ మెరైన్
- అక్రమ వలసదారుల గుండెల్లో వణుకు
- రంగంలోకి దిగుతున్న ‘లాన్స్ ష్రోయర్’
- లక్షలాది మంది బహిష్కరణే లక్ష్యం
లాస్‌ఏంజిల్స్: అమెరికాలో అక్రమ వలసదారుల ఏరివేతను మరింత ఉధృతం చేసేందుకు దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) తదుపరి డైరెక్టర్‌గా ఓక్లహోమాకు చెందిన సీనియర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి ‘లాన్స్ ష్రోయర్’ను నామినేట్ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం తాత్కాలిక బాధ్యతల్లో ఉన్న డేవిడ్ వెంచురెల్లా స్థానంలో ష్రోయర్ రానున్నారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ట్రూత్ సోషల్’ ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ష్రోయర్ ఒక నిజమైన దేశభక్తుడని, అక్రమ వలసదారులను దేశం నుంచి వెళ్లగొట్టడంలో ఆయనకు అపారమైన క్షేత్రస్థాయి అనుభవం ఉందని ప్రశంసించారు.
ట్రంప్ నమ్మిన బంటు.. 29 ఏళ్ల సుదీర్ఘ అనుభవం
లాన్స్ ష్రోయర్ ఓక్లహోమాలో దాదాపు 29 ఏళ్లకు పైగా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ రంగంలో సేవలందించారు. అమెరికా మెరైన్ కార్ప్స్‌లో పనిచేసిన అనుభవం ఉన్న ఆయన ఆ తర్వాత ఓక్లహోమా హైవే పెట్రోల్‌లో ట్రూపర్, లెఫ్టినెంట్, కెప్టెన్, మేజర్‌గా వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 2016, 2020, 2024 దేశాధ్యక్ష ఎన్నికల్లో తాను ఓక్లహోమాలోని మొత్తం 77 కౌంటీల్లో విజయం సాధించానని గుర్తుచేసిన ట్రంప్.. అలాంటి రాష్ట్రంలో అత్యంత కీలక పాత్ర పోషించిన ష్రోయర్, నేరస్థులైన అక్రమ వలసదారులను ఏరిపారేయడానికి సరైన వ్యూహకర్త అని కొనియాడారు.
వలసల నియంత్రణలో కీలక వ్యూహకర్త
లాన్స్ ష్రోయర్ కెరీర్‌లో అత్యంత ముఖ్యమైన అంశం ఇమ్మిగ్రేషన్ అమలు భాగస్వామ్యాలు. ఓక్లహోమాలో ‘287(జీ) ఒప్పందాల’ను విస్తరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ ఒప్పందాల ద్వారా స్థానిక పోలీసులకు ఇమ్మిగ్రేషన్ చట్టాలను అమలు చేసే అధికారాలు లభిస్తాయి. ఇదే విషయాన్ని ట్రంప్ ప్రస్తావిస్తూ, ‘దారుణమైన నేరాలకు పాల్పడే క్రిమినల్స్, హంతకులు, అత్యాచార నిందితులు డ్రగ్స్ స్మగ్లర్లను ఎన్నడూ చూడని స్థాయిలో నిర్బంధించి, దేశం నుండి బహిష్కరించే సత్తా ష్రోయర్‌కు ఉంది’ అని స్పష్టం చేశారు. అలాగే హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ మార్క్‌వేన్ ముల్లిన్‌తో కలిసి ఆయన ఐసీఈ బృందాన్ని సమర్థవంతంగా నడిపిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు.
ఆందోళనల నడుమ నియామకం
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐసీఈ చర్యలపై తీవ్ర ప్రజా విమర్శలు, చట్టపరమైన చిక్కులు ఎదురవుతున్న సమయంలో ఈ నియామకం జరగడం గమనార్హం. గత 500 రోజుల్లో ఐసీఈ కస్టడీలో దాదాపు 52 మంది మరణించడం, నిర్బంధ కేంద్రాలలో వైద్య నిర్లక్ష్యం, రద్దీ వంటి ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా మిన్నియాపాలిస్‌లో జరిగిన ఐసీఈ దాడుల సమయంలో ఇద్దరు అమెరికన్ పౌరులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసింది. అయినప్పటికీ, విమర్శలను పక్కనబెట్టి అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపేందుకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.
ఇది కూడా చదవండి: ముడి చమురుకు బై బై.. భారత్‌లోకి జపాన్ మిథేన్ పవర్


