కావాలనే 'వ్యాక్సిన్'‌ విషయాన్ని దాచిపెట్టారు

Trump Alleges Pfizer Vaccine Announcement Withheld Before Elections - Sakshi

ఫైజర్‌, ఎఫ్‌డిఎ కుట్రపూరితంగా వ్యవహరించాయి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపణలు

వాషింగ్టన్‌:  కోవిడ్‌ నివారణ కోసం ఫైజర్‌, బయో ఎన్‌టెక్‌ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్‌ సమర్థంగా పనిచేస్తోందన్న విషయాన్ని ఫైజర్‌, అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ), సంస్థలు ​కావాలనే దాచిపెట్టాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించారు. తన గెలుపును అడ్డుకునేందుకే ఈ రెండు సంస్థలు టీకా అభివృద్ధిపై ప్రకటనను నిలిపివేసిందన్నారు. కావాలనే  ఎన్నికల ఫలితాలు వెలువడిన ఐదు రోజుల అనంతరం వ్యాక్సిన్‌పై అప్‌డేట్‌ వచ్చిందని, ఇదంతా కుట్రపూరితంగా జరిగిందని ట్రం‍ప్‌ పేర్కొన్నారు. ఒకవేళ జో బైడెన్‌ అధ్యక్షుడిగా ఉంటే వ్యాక్సిన్‌ వచ్చి ఉండేది కాదని, ఎఫ్‌డిఎ సైతం ఇంత త్వరగా ఆమోదించి ఉండేది కాదని, ఫలితంగా లక్షలమంది ప్రాణాలు పోయేవని ట్రంప్‌ అన్నారు. ఫైజర్‌ సంస్థ ఎన్నికల తర్వాతే వ్యాక్సిన్‌పై ప్రకటన చేస్తారని తాను గతంలోనే చెప్పానని, ఎందుకంటే వారికి అంత ధైర్యం లేదని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల ప్రాణాలు కాపాడటానికి వ్యాక్సిన్‌పై ఎఫ్‌డిఎ ముందే ప్రకటన చేసి ఉండాల్సింది అంటూ ట్రం‍ప్‌ ట్వీట్‌ చేశారు. (కరోనా వ్యాక్సిన్‌ : ఫైజర్‌ పురోగతి)

వ్యాక్సిన్‌ తయారీలో పురోగతి లభించినందుకు అంతకుముందు జో బైడెన్‌ శుభాకంక్షలు తెలిపారు. వ్యాక్సిన్‌ తయారీలో సహకరించిన వారందరిని అభినందిస్తున్నానంటూ పేర్కొన్నారు. కోవిడ్‌పై యుద్ధానికి మరికొన్ని నెలల సమయం మాత్రమే వేచి ఉందని, త్వరలోనే వ్యాక్సిన్‌ అందరికీ అందుతుదంటూ పేర్కొన్నారు. కాగా వ్యాక్సిన్‌ తుది దశ పరీక్షల ఫలితాల్లో పురోగతి సాధించామంటూ ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఫైజర్‌​ కీలక విషయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. కోవిడ్-19 నివారణలో తమ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తోందని చివరి ట్రయల్స్‌ ద్వారా ఇది తెలుస్తోందని ప్రకటించింది. జర్మన్ ఔషధ తయారీదారు బయోన్‌టెక్‌తో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన ఫైజర్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఎలాంటి వైరస్ లక్షణాలు లేని ట్రయల్ వాలంటీర్లలో వ్యాధిని నివారించడంలో 90 శాతం కంటే ఎక్కువ ప్రభావ వంతంగా తమ వ్యాక్సిన్‌ ఉందని తాజా విశ్లేషణలో తేలిందని తెలిపింది. (ఆసక్తికర విషయాలు వెల్లడించిన యూకే శాస్త్రవేత్తలు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top