నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) నుంచి వైదొలిగే అంశాన్ని అమెరికా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ ఆలోచన చేస్తుండడానికి ప్రధాన కారణం ఇరాన్ యుద్ధంలో నాటో దేశాలు సహకరించకపోవడమే. ఇప్పటికే నాటోపై పలుసార్లు ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఆయా ప్రాంతాల భద్రతకు ప్రధాన ఆధారంగా ఉంది నాటో. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లెవిట్ మాట్లాడుతూ.. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని నాటోకి ఓ పరీక్షగా అభివర్ణించారు. ఇందులో ఆ కూటమి విఫలమైందన్నారు.
ట్రంప్ ఒత్తిడి చేసినప్పటికీ నాటో మిత్రదేశాలు యుద్ధానికి సైనిక బలగాలను పంపడానికి నిరాకరించాయి. లెవిట్ చేసిన వ్యాఖ్యలు ట్రంప్ వైట్ హౌస్‌లో నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టేను కలవడానికి ముందు వెలువడ్డాయి.
“నాటో గురించి ట్రంప్ ఓ వ్యాఖ్య చేశారు. నాటోను పరీక్షించామన్నారు. ఈ పరీక్షలో నాటో విఫలమైందని చెప్పారు” అని లెవిట్ తెలిపారు. గత ఆరు వారాలుగా నాటో అమెరికా ప్రజలను విస్మరించడం బాధాకరమని అన్నారు. నాటో రక్షణ ఖర్చులను అమెరికా ప్రజలే భరిస్తున్నారని ఆమె చేర్చారు. రుట్టేతో ట్రంప్ సూటిగా, స్పష్టంగా మాట్లాడతారని ఆమె తెలిపారు.
ట్రంప్ నాటో నుంచి బయటకు వెళ్లాలనుకుంటున్నారా అని మీడియా అడిగింది. లెవిట్ స్పందిస్తూ.. రుట్టేతో సమావేశం తర్వాత దీనిపై ట్రంప్ మాట్లాడవచ్చని చెప్పారు. ట్రంప్, రుట్టే మధ్య సన్నిహిత సంబంధం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ రెండోసారి పదవి చేపట్టిన తర్వాత రుట్టే పలుసార్లు వైట్ హౌస్‌ను సందర్శించారు. గత ఏడాది మార్చి, జూలై, ఆగస్టు, అక్టోబర్ నెలల్లో కూడా వచ్చారు.
గతంలో రుట్టే అమెరికా మద్దతు లేకుండా నాటో పనిచేయదు అని హెచ్చరించారు. ట్రంప్‌తో సమావేశంలో పాల్గొన్న తర్వాత రుట్టే మాట్లాడుతూ.. ట్రంప్‌కు తన మద్దతును పునరుద్ఘాటించారు. అయితే, నాటో మిత్రదేశాలు లాజిస్టిక్స్, బేస్‌ల వినియోగం ద్వారా అమెరికాకు సాయం అందించాయని చెప్పారు.
నాటో నుంచి బయటకు వెళ్లేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారా అని రుట్టేను మీడియా అడిగింది. రుట్టే స్పందిస్తూ.. “ట్రంప్‌లో నిరాశ ఉందనేది స్పష్టమే. అదే సమయంలో నా వాదనలు ఆయన జాగ్రత్తగా విన్నారు” అని రుట్టే సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత ట్రంప్ నాయకత్వాన్ని ప్రశంసించారు.
సైన్యాన్ని వెనక్కి..
ఇరాన్‌తో జరిగిన యుద్ధానికి మద్దతు ఇవ్వలేదని ట్రంప్ భావించిన దేశాల్లోని అమెరికా సైన్యాన్ని వెనక్కి రప్పించి, ఆ ఘర్షణలో సహాయకంగా ఉన్న దేశాలకు సైన్యాన్ని తరలించడం వంటి నిర్ణయాలు తీసుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. నాటో సభ్య దేశాల్లో కొన్నింటిపై చర్యలు తీసుకోవాలని వైట్ హౌస్‌లో చర్చించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కొన్నిసార్లు ట్రంప్ నాటోకు మద్దతును ఉపసంహరించుకుంటామని బెదిరింపులు చేశారు. మరికొన్నిసార్లు మిత్రదేశాలకు మద్దతు కొనసాగుతుందని హామీ ఇచ్చారు. గత ఏడాది ట్రంప్ డెన్మార్క్ స్వయం పాలిత ప్రాంతం గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి సైనిక శక్తి వినియోగిస్తామని బెదిరించడం అమెరికా, యూరప్ మిత్రదేశాల మధ్య ఉద్రిక్తతను మరింత పెంచింది. ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను జాతీయ భద్రతకు కీలకమని పేర్కొన్నారు. అనంతరం అమెరికా కొంత వెనక్కు వెళ్లింది. అయితే గ్రీన్‌లాండ్‌పై అమెరికా అధికారం అవసరమని ట్రంప్ మళ్లీ అన్నారు.


