లెబనాన్‌పై భీకర దాడులు  | Morethen 112 killed across Lebanon in large wave of Israeli strikes | Sakshi
Sakshi News home page

లెబనాన్‌పై భీకర దాడులు 

Apr 9 2026 4:34 AM | Updated on Apr 9 2026 5:37 AM

Morethen 112 killed across Lebanon in large wave of Israeli strikes

112 మందికి పైగా దుర్మరణం 

700 మందికి గాయాలు 

10 నిమిషాలు...100 లక్ష్యాలు! 

బీరూట్‌పై ఇజ్రాయెల్‌ బాంబులు

ఇరాన్‌పైనా భారీగా దాడుల వర్షం

ప్రతి దాడులతో విరుచుకుపడ్డ ఇరాన్‌ 

బీరూట్‌/దుబాయ్‌/టెల్‌ అవీవ్‌: తాజా కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్‌కు వర్తించబోదన్న ఇజ్రాయెల్‌ అన్నంత పనీ చేసింది. బుధవారం మధ్యాహ్నం ఆ దేశంపై భారీ స్థాయిలో విరుచుకుపడింది. ఎలాంటి హెచ్చరికలూ లేకుండానే రాజధాని బీరూట్‌పై కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 100కు పైగా లక్ష్యాలపై క్షిపణులు, బాంబుల వర్షం కురిపించింది. అత్యంత జనసమ్మర్ధంతో కూడిన ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుంది!

 దాంతో పలు పౌర, వాణిజ్య ప్రాంతాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. నివాస స్థలాలు, అపార్ట్‌మెంట్లు కుప్పకూలాయి. ఈ దాడులకు ఏకంగా 112 మందికి పైగా బలైనట్టు లెబనాన్‌ ఆరోగ్య శాఖ పేర్కొంది. 700 మందికి పైగా గాయపడ్డట్టు వెల్లడించింది. వారందరినీ హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. ఈ నేపథ్యంలో ప్రాణనష్టం భారీగా పెరగవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

 అల్‌ మజారా ప్రాంతంలో దగ్ధమైన వాహనాల్లో కాలి బుగ్గిగా మారిన మృతదేహాలను వెలికితీసినట్టు ఏపీ వార్తా సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైన నాటినుంచీ లెబనాన్‌పై ఇదే అతి భారీ దాడి అని ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది! దక్షిణ లెబనాన్‌తో పాటు తూర్పున బెక్కా లోయపైనా క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దాడులపై మీడియా ప్రశ్నలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుండబద్దలు కొట్టినట్టుగా బదులిచ్చారు. 

‘‘ఇజ్రాయెల్‌–లెబనాన్‌ ఘర్షణకు ఇరాన్‌తో సంబంధం లేదు. కనుక కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్‌కు వర్తించబోదు’’అని మరోసారి స్పష్టం చేశారు. దాడులను అనాగరిక చర్యగా లెబనాన్‌ అధ్యక్షుడు జోసెఫ్‌ ఔన్‌ అభివరి్ణంచారు. తాము కేవలం క్షిపణి లాంచర్లు, కమాండ్‌ కేంద్రాలు, నిఘా వ్యవస్థలనే లక్ష్యంగా చేసుకున్నట్టు ఇజ్రాయెల్‌ సైన్యం చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో కాల్పులకు తెర దించేందుకు ఇజ్రాయెల్‌తో చర్చలకు సిద్ధమని లెబనాన్‌ ప్రకటించింది. గత 40 రోజుల దాడుల్లో లెబనాన్‌లో 1,530 మందికి పైగా మరణించారు. 10 లక్షల మందికి పైగా నిర్వాసితులయ్యారు. 

దద్దరిల్లిన టెహ్రాన్‌ 
ఇరాన్‌పై కూడా దాడులు జరిగాయి. పేలుళ్లతో రాజధాని టెహ్రాన్‌ దద్దరిల్లిపోయింది. లావాన్‌ దీవిలోని చమురు క్షేత్రంపైనా ఇజ్రాయెల్‌ క్షిపణి దాడులకు దిగింది. ఇందుకు ప్రతీకారంగా ఇరాన్‌ కూడా గల్ఫ్‌ దేశాలపై పెద్ద ఎత్తున దాడులు కొనసాగించింది. భారీ సంఖ్యలో దూసుకొచ్చిన డ్రోన్లు, క్షిపణులను అడ్డుకున్నట్టు ఇజ్రాయెల్‌తో పాటు యూఏఈ, కువైట్, బహ్రెయిన్‌ తదితర దేశాలు వెల్లడించాయి.  

హార్మూజ్‌కు మళ్లీ మూత! 
లెబనాన్‌పై దాడులతో ఇరాన్‌ నిర్ణయం
టెహ్రాన్‌: అంతర్జాతీయంగా చమురు సరఫరాలకు జీవనాడి అయిన హార్మూజ్‌ జలసంధి ఎట్టకేలకు తెరుచుకుందన్న ఆనందనం కొద్ది గంటల ముచ్చటగానే ముగిసింది. అమెరికాతో రెండు వారాల కాల్పుల విరమణ నేపథ్యంలో 40 రోజుల ప్రతిష్టంభన అనంతరం బుధవారం ఉదయమే హార్మూజ్‌ను ఇరాన్‌ తెరిచిన విషయం తెలిసిందే. ఆ వెంటనే కొన్ని నౌకలు దాని గుండా వెళ్లినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత కాసేపటికే లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భారీ దాడులకు దిగింది. దాంతో హార్మూజ్‌ను మళ్లీ మూసేస్తూ ఇరాన్‌ నిర్ణయం తీసుకుంది! లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలోనే జలసంధిని మూసేసినట్టు ఫార్స్‌ న్యూస్‌ వార్తా సంస్థ వెల్లడించింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement