వార్‌ సీజ్‌.. బుల్స్‌ ఫైర్‌! | Sensex ends 2,946 points up, investors earn Rs 17 lakh crore in a day | Sakshi
Sakshi News home page

వార్‌ సీజ్‌.. బుల్స్‌ ఫైర్‌!

Apr 9 2026 4:43 AM | Updated on Apr 9 2026 4:43 AM

Sensex ends 2,946 points up, investors earn Rs 17 lakh crore in a day

ఇరాన్‌–అమెరికాల మధ్య  కాల్పుల విరమణ  

100 డాలర్ల దిగువకు బ్యారెల్‌ చమురు ధరలు 

కలిసొచ్చిన వడ్డీరేట్ల యథాతథం నిర్ణయం  

రాకెట్లా దూసుకెళ్లిన సూచీలు... 

సెన్సెక్స్‌ 2,946 పాయింట్లు.. నిఫ్టీ 874 పాయింట్లు జంప్‌

ముంబై: ఇరాన్‌–అమెరికా మధ్య రెండు వారాల పాటు సీజ్‌ఫైర్‌ (కాల్పుల విరమణ) ఒప్పందం కుదరడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం రాకెట్‌ వేగంతో దూసుకెళ్లాయి. సీజ్‌ఫైర్‌తో అంతర్జాతీయ మార్కెట్లలో ర్యాలీ, క్రూడాయిల్‌ ధరలు 100 డాలర్ల దిగువకు రావడం, ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్ల జోలికెళ్లకపోవడం, రూపాయి రికవరీ వంటి అంశాలు సూచీల భారీ లాభాలకు దోహదపడ్డాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 2,946 పాయింట్లు (3.95%) ఎగసి 77,563 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 874 పాయింట్లు (3.78%) పెరిగి 23,997 వద్ద నిలిచింది. గతేడాది(2025) మే 12వ తేదీ తర్వాత సూచీలకిదే అతిపెద్ద లాభం. అలాగే వరుసగా అయిదో లాభాల ముగింపు కూడా. 

భారీ లాభాలతో షురూ.. 
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్‌ 2,674 పాయింట్ల లాభంతో 74,617 వద్ద, నిఫ్టీ 731 పాయింట్లు పెరిగి 23,855 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఆర్‌బీఐ వరుసగా రెండోసారీ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో ఆరంభ ఉత్సాహం ట్రేడింగ్‌ ముగిసే వరకు కొనసాగింది. ఒకదశలో సెన్సెక్స్‌ 3,019 పాయింట్లు ర్యాలీ చేసి 77,636 వద్ద, నిఫ్టీ 901 పాయింట్లు దూసుకెళ్లి 24,025 వద్ద ఇంట్రాడే గరిష్టాలు తాకాయి. గడిచిన అయిదేళ్లలో సూచీలకిదే ఇంట్రాడేలో అతి పెద్ద లాభం. 

అంతర్జాతీయ మార్కెట్లు రయ్‌... 
పశ్చిమాసియాలో శాంతి పవనాలతో ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా 6.43%, జపాన్‌ 5.11%, తైవాన్‌ 4.41%, ఇండోనేసియా 4.23%, హాంగ్‌కాంగ్‌ 3%, చైనా 2.62%, సింగపూర్‌ 1.39 శాతం లాభపడ్డాయి. యూరప్‌ ఫ్రాన్స్‌ 5%, సీఏసీ 4.47%, ఎఫ్‌టీఎస్‌ఈ 2.58 శాతం ర్యాలీ చేశాయి. అమెరికా ప్రధాన స్టాక్‌ సూచీలు నాస్‌డాక్‌ 2.63%, డోజోన్స్‌ సూచీ 2.49 శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. 

→ అన్ని రంగాల్లో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. బీఎస్‌ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో రియల్టీ 6.76%, ఆటో 6.55%, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 5.79%, బ్యాంకెక్స్‌ 5.72%, ప్రైవేటు బ్యాంక్స్‌ ఇండెక్స్‌ 5.62%, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 5.48%, సర్వీసెస్‌ 5.22%, కన్జూమర్‌ డిస్క్రేషనరీ 5.11 శాతం ర్యాలీ చేశాయి. మిడ్, స్మాల్‌ సూచీలు వరుసగా 5%, 4% చొప్పున పెరిగాయి. సెన్సెక్స్‌ 30 షేర్లలో ఇండిగో 8.16%, ఎల్‌అండ్‌టీ 7.64%, బజాజ్‌ ఫైనాన్స్‌ 7.03%, ఎంఅండ్‌ఎం 6.79% యాక్సిస్‌ బ్యాంక్‌ 6.56 శాతం అత్యధికంగా లాభపడిన టాప్‌–5 షేర్లుగా నిలిచాయి. టెక్‌ మహీంద్రా (–1.53%), సన్‌ఫార్మా(–0.29%), పవర్‌గ్రిడ్‌ (–0.20%) మాత్రమే నష్టపోయాయి. 

→ గౌతమ్‌ అదానీకి అమెరికా కోర్టులో ఊరట లభించడంతో అదానీ గ్రూప్‌ షేర్లు భారీ ర్యాలీ చేశాయి. అదానీ గ్రీన్‌ 11.38%, అదానీ ఎనర్జీ 8.78%, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 8.62%, అదానీ టోటల్‌ గ్యాస్‌ 7.60% ర్యాలీ చేశాయి. 

ఎన్‌డీటీవీ 6.48%, అంబుజా సిమెంట్స్‌ 6.28%, అదానీ పోర్ట్స్‌ 5.28 %, ఏసీసీ 5.20%, అదానీ పవర్‌ 3.55% పెరిగాయి. అదానీ గ్రూప్‌ మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.14.22 లక్షల కోట్లకు చేరింది.   

→ సీజ్‌ఫైర్‌ ఎఫెక్ట్‌తో క్రూడాయిల్‌ ధరలు దిగిరావడంతో ఏవియేషన్‌ షేర్లు రివ్వున ఎగిశాయి. ఇండిగో షేరు 8.16% లాభపడింది. స్పైస్‌ జెట్‌ షేరు 5% లాభపడి రూ.11.14 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ తాకి అక్కడే ముగిసింది.

రూ.16.25 లక్షల కోట్ల సంపద సృష్టి 
సూచీల చరిత్రలో రెండో అతిపెద్ద ర్యాలీతో స్టాక్‌ మార్కెట్లో పెద్ద ఎత్తున సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ ఒక్కరోజులో రూ.16.25 లక్షల కోట్లు పెరిగి రూ.445.51 లక్షల కోట్లకు చేరింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement