తొలగింపుల్లో టాప్‌ అమెజాన్‌.. 30 వేలకు పైనే.. | Amazon may cut 14000 jobs in its third big round of layoffs | Sakshi
Sakshi News home page

తొలగింపుల్లో టాప్‌ అమెజాన్‌.. 30 వేలకు పైనే..

Apr 8 2026 6:50 PM | Updated on Apr 9 2026 11:43 AM

Amazon may cut 14000 jobs in its third big round of layoffs

అంతర్జాతీయ టెక్‌ రంగంలో ఉద్యోగాల కోతల పర్వం కొనసాగుతూనే ఉంది. గడిచిన 2025 సంవత్సరం నుంచి ఇప్పటివరకు (2026) ప్రముఖ దిగ్గజ సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. తాజా గణాంకాల ప్రకారం, ఈ లేఆఫ్స్‌ జాబితాలో ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అగ్రస్థానంలో నిలిచింది.

అమెజాన్, ఇంటెల్ సంస్థల్లోనే అధికం
వివిధ నివేదికల ద్వారా వెల్లడైన సమాచారం ప్రకారం.. 2025 నుంచి ఇప్పటివరకు అమెజాన్ ఏకంగా 30,184 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. దీని తర్వాత చిప్‌ మేకర్ ఇంటెల్ (Intel) 27,058 మందిని, సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) 15,347 మందిని తొలగించి టాప్-3లో నిలిచాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం, నిర్వహణ ఖర్చుల తగ్గింపు, సంస్థాగత మార్పులే ఈ భారీ తొలగింపులకు ప్రధాన కారణాలని విశ్లేషకులు భావిస్తున్నారు.

కంపెనీల వారీగా తొలగింపుల వివరాలు

 కంపెనీ పేరుతొలగించిన ఉద్యోగుల సంఖ్య
1అమెజాన్30,184
2ఇంటెల్27,058
3మైక్రోసాఫ్ట్15,347
4హెచ్‌పీ8,000
5మెటా5,800
6సేల్స్ఫోర్స్5,385
7బ్లాక్ (Block)4,931
8నార్త్ వోల్ట్2,800
9హ్యూలెట్ ప్యాకర్డ్2,552
10ఆటోడెస్క్2,350

ఎందుకీ కోతలు?
గత రెండేళ్లుగా టెక్ పరిశ్రమలో అనిశ్చితి కొనసాగుతోంది. 
AI ప్రభావం: పనులను ఆటోమేట్ చేయడం వల్ల కొన్ని విభాగాల్లో మానవ వనరుల అవసరం తగ్గుతోంది.
ఆర్ధిక మందగమనం: పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఖర్చులను తగ్గించుకోవాలనే ఒత్తిడి కంపెనీలపై ఉంది.
రీస్ట్రక్చరింగ్: లాభదాయకత లేని ప్రాజెక్టులను మూసివేసి, ప్రాధాన్యత ఉన్న రంగాలపై పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి.

ఈ పరిణామాలు ఐటీ నిపుణుల్లో ఆందోళన కలిగిస్తుండగా, రానున్న నెలల్లో మరిన్ని కంపెనీలు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అమెజాన్‌లో మళ్లీ లేఆఫ్స్‌.. ఖండించిన కంపెనీ
గడిచిన రెండేళ్లుగా వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన అమెజాన్‌ వచ్చే మే నెలలోనూ మరో భారీ రౌండ్ లేఆఫ్‌లకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈసారి సుమారు 14,000 మంది కార్పొరేట్ ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉందంటూ వార్తలు వెలువడ్డాయి. అయితే వీటిని అమెజాన్‌ ఖండించింది. ఇవన్నీ అవాస్తమని, తమకు అలాంటి ప్రణాళికలు లేవని స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement