Domestic stock market trends
-
వార్ సీజ్.. బుల్స్ ఫైర్!
ముంబై: ఇరాన్–అమెరికా మధ్య రెండు వారాల పాటు సీజ్ఫైర్ (కాల్పుల విరమణ) ఒప్పందం కుదరడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం రాకెట్ వేగంతో దూసుకెళ్లాయి. సీజ్‌ఫైర్‌తో అంతర్జాతీయ మార్కెట్లలో ర్యాలీ, క్రూడాయిల్ ధరలు 100 డాలర్ల దిగువకు రావడం, ఆర్బీఐ కీలక వడ్డీరేట్ల జోలికెళ్లకపోవడం, రూపాయి రికవరీ వంటి అంశాలు సూచీల భారీ లాభాలకు దోహదపడ్డాయి. ఫలితంగా సెన్సెక్స్ 2,946 పాయింట్లు (3.95%) ఎగసి 77,563 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 874 పాయింట్లు (3.78%) పెరిగి 23,997 వద్ద నిలిచింది. గతేడాది(2025) మే 12వ తేదీ తర్వాత సూచీలకిదే అతిపెద్ద లాభం. అలాగే వరుసగా అయిదో లాభాల ముగింపు కూడా. భారీ లాభాలతో షురూ.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 2,674 పాయింట్ల లాభంతో 74,617 వద్ద, నిఫ్టీ 731 పాయింట్లు పెరిగి 23,855 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఆర్బీఐ వరుసగా రెండోసారీ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో ఆరంభ ఉత్సాహం ట్రేడింగ్ ముగిసే వరకు కొనసాగింది. ఒకదశలో సెన్సెక్స్ 3,019 పాయింట్లు ర్యాలీ చేసి 77,636 వద్ద, నిఫ్టీ 901 పాయింట్లు దూసుకెళ్లి 24,025 వద్ద ఇంట్రాడే గరిష్టాలు తాకాయి. గడిచిన అయిదేళ్లలో సూచీలకిదే ఇంట్రాడేలో అతి పెద్ద లాభం. అంతర్జాతీయ మార్కెట్లు రయ్... పశ్చిమాసియాలో శాంతి పవనాలతో ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా 6.43%, జపాన్ 5.11%, తైవాన్ 4.41%, ఇండోనేసియా 4.23%, హాంగ్‌కాంగ్ 3%, చైనా 2.62%, సింగపూర్ 1.39 శాతం లాభపడ్డాయి. యూరప్ ఫ్రాన్స్ 5%, సీఏసీ 4.47%, ఎఫ్టీఎస్ఈ 2.58 శాతం ర్యాలీ చేశాయి. అమెరికా ప్రధాన స్టాక్ సూచీలు నాస్డాక్ 2.63%, డోజోన్స్ సూచీ 2.49 శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. → అన్ని రంగాల్లో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. బీఎస్ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో రియల్టీ 6.76%, ఆటో 6.55%, పీఎస్‌యూ బ్యాంక్స్ 5.79%, బ్యాంకెక్స్ 5.72%, ప్రైవేటు బ్యాంక్స్ ఇండెక్స్ 5.62%, ఫైనాన్షియల్ సర్వీసెస్ 5.48%, సర్వీసెస్ 5.22%, కన్జూమర్ డిస్క్రేషనరీ 5.11 శాతం ర్యాలీ చేశాయి. మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 5%, 4% చొప్పున పెరిగాయి. సెన్సెక్స్ 30 షేర్లలో ఇండిగో 8.16%, ఎల్అండ్టీ 7.64%, బజాజ్ ఫైనాన్స్ 7.03%, ఎంఅండ్ఎం 6.79% యాక్సిస్ బ్యాంక్ 6.56 శాతం అత్యధికంగా లాభపడిన టాప్–5 షేర్లుగా నిలిచాయి. టెక్ మహీంద్రా (–1.53%), సన్‌ఫార్మా(–0.29%), పవర్‌గ్రిడ్ (–0.20%) మాత్రమే నష్టపోయాయి. → గౌతమ్ అదానీకి అమెరికా కోర్టులో ఊరట లభించడంతో అదానీ గ్రూప్ షేర్లు భారీ ర్యాలీ చేశాయి. అదానీ గ్రీన్ 11.38%, అదానీ ఎనర్జీ 8.78%, అదానీ ఎంటర్ప్రైజెస్ 8.62%, అదానీ టోటల్ గ్యాస్ 7.60% ర్యాలీ చేశాయి. → ఎన్డీటీవీ 6.48%, అంబుజా సిమెంట్స్ 6.28%, అదానీ పోర్ట్స్ 5.28 %, ఏసీసీ 5.20%, అదానీ పవర్ 3.55% పెరిగాయి. అదానీ గ్రూప్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14.22 లక్షల కోట్లకు చేరింది. → సీజ్ఫైర్ ఎఫెక్ట్‌తో క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో ఏవియేషన్ షేర్లు రివ్వున ఎగిశాయి. ఇండిగో షేరు 8.16% లాభపడింది. స్పైస్ జెట్ షేరు 5% లాభపడి రూ.11.14 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకి అక్కడే ముగిసింది.రూ.16.25 లక్షల కోట్ల సంపద సృష్టి సూచీల చరిత్రలో రెండో అతిపెద్ద ర్యాలీతో స్టాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ ఒక్కరోజులో రూ.16.25 లక్షల కోట్లు పెరిగి రూ.445.51 లక్షల కోట్లకు చేరింది. -
కొత్త ఆర్థిక సంవత్సరం బుల్ స్టార్ట్!
ముంబై: కొత్త ఆర్థిక సంవత్సరాన్ని(2026–27) దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో మొదలుపెట్టింది. పశ్చిమాసియా యుద్ధం 2–3 వారాల్లో ముగిస్తుందనే ఆశలు సూచీలను పరుగులు పెట్టించాయి. క్రూడాయిల్ ధరలు దిగిరావడం కలిసొచ్చిది. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 1,187 పాయింట్లు పెరిగి 73,134 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 348 పాయింట్లు బలపడి 22,679 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 2,017 పాయింట్లు ఎగసి 73,964 వద్ద, నిఫ్టీ 610 పాయింట్లు బలపడి 22,941 వద్ద ఇంట్రాడే గరిష్టాలు నమోదు చేశాయి. అయితే ట్రేడింగ్ చివరి గంటలో లాభాల స్వీకరణ కారణంగా సూచీల లాభాలు సగానికి తుడిపెట్టుకుపోయాయి. తాజా ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9.60 లక్షల కోట్లు పెరిగి రూ. 422.01 లక్షల కోట్లకు చేరింది. → ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా 8%, జపాన్ 5%, తైవాన్ 4% ర్యాలీ చేశాయి. ఇండోనేíÙయా, హాంగ్‌కాంగ్, సింగపూర్ 2%, చైనా, థాయ్‌లాండ్ 1.55% పెరిగాయి. యూరప్ మార్కెట్లు 1.5% – 2% లాభపడ్డాయి. అమెరికా స్టాక్ సూచీలు 1% లాభంతో ట్రేడవుతున్నాయి. → ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. రంగాల వారీ ఇండెక్సుల్లో సరీ్వసెస్ 5%, పీఎస్‌యూ బ్యాంక్ 3.66%, ఇండ్రస్టియల్స్ 3.40%, క్యాపిటల్ గూడ్స్ 3.29%, కన్జూమర్ డి్రస్కేషనరీ 2.79%, కమోడిటీస్ 2.72%, ఐటీ 2.40% పెరిగాయి. సెన్సెక్స్‌లో ఎన్టీపీసీ (–1.64%), సన్‌ఫార్మా (–1.64%), పవర్‌గ్రిడ్ (–1.13%), అ్రల్టాటెక్ (–0.29%) మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 26 షేర్లూ లాభపడ్డాయి. బుల్ పరుగులు ఎందుకంటే ..ఎలాంటి ఒప్పందం లేకుండానే ఇరాన్ యుద్ధాన్ని 2–3 వారాల్లో ముగించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు భవిష్యత్తులో తమపై దాడులు జరగవని హామీ ఇస్తే యుద్ధం ముగింపునకు సిద్ధమేనని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తెలిపారు. దీంతో భారత్‌తో సహా అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో రిలీఫ్ ర్యాలీ చోటు చేసుకుంది. బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 4% క్షీణించి 100 డాలర్ల దిగువకు దిగివచ్చాయి. మూడునెలల గరిష్టానికి చేరిన అమెరికన్ బాండ్లపై రాబడులు అనూహ్యంగా దిగివచ్చాయి. దలాల్ స్ట్రీట్ మార్చిలో 11% భారీ పతనం తర్వాత షార్ట్ కవరింగ్, వాల్యూ బయింగ్ కొనుగోళ్లు చోటుచేసుకున్నాయి. → జెట్ ఫ్యూయెల్ ధరలు పరిమితంగానే పెరగడంతో ఏవియేషన్ రంగానికి చెందిన ఇండిగో షేరు 6%, స్పైస్‌జెట్ 2% పెరిగాయి. -
క్యూ3 ఫలితాలే దిక్సూచి
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను ప్రధానంగా క్యూ3(అక్టోబర్–డిసెంబర్) ఫలితాలే నిర్దేశించనున్నాయి. ఫిబ్రవరి 1న ప్రకటించనున్న బడ్జెట్‌వైపు ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నప్పటికీ సమీపకాలంలో కార్పొరేట్ పనితీరు, గ్లోబల్ అంశాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. గత వారాంతాన ఇండెక్స్‌లను ప్రభావితం చేయగల బ్లూచిప్ కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించాయి. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌తోపాటు.. బ్యాంకింగ్ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ క్యూ3 పనితీరు వెల్లడించాయి. ఈ ప్రభావం నేడు(19న) కనిపించనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇదేవిధంగా ఈ వారం మరిన్ని కంపెనీలు క్యూ3(అక్టోబర్–డిసెంబర్) ఫలితాలు విడుదల చేయనున్నాయి. ఈ జాబితాలో బీహెచ్ఈఎల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, డీఎల్ఎఫ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తదితరాలు చేరాయి. వీటితోపాటు పలు మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు ప్రకటించనున్న ఫలితాలపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నట్లు నిపుణులు తెలియజేశారు. ట్రంప్ ఎఫెక్ట్ యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ వెనిజువెలా అధ్యక్షుడిని అరెస్ట్ చేయడంసహా.. ఇరాన్లో అంతర్యుద్ధానికి మద్దతు పలకడం, గ్రీన్‌ల్యాండ్ తమదేనంటూ ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలను పెంచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో రక్షణాత్మక పెట్టుబడి సాధానాలుగా భావించే పసిడి, వెండి ధరలు రేసు గుర్రాల్లా పరుగు తీస్తున్నట్లు తెలియజేశారు. వెరసి రిస్క్ పెట్టుబడులు నీరసించే వీలున్నట్లు విశ్లేíÙంచారు. మరోపక్క యూఎస్‌తో భారత్ వాణిజ్య చర్చలు ఒక కొలిక్కిరాకపోవడం సైతం సెంటిమెంటును బలహీనపరుస్తున్నట్లు తెలియజేశారు. విదేశీ గణాంకాలు నేడు చైనా.. అక్టోబర్–డిసెంబర్(క్యూ4) జీడీపీ గణాంకాలు ప్రకటించనుంది. జూలై–సెప్టెంబర్(క్యూ3)లో ఎకానమీ 4.8 శాతం ఎగసింది. ఈ బాటలో డిసెంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి, రిటైల్ అమ్మకాల గణాంకాలు సైతం వెల్లడికానున్నాయి. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వడ్డీ రేట్లపై స్పందించనుంది. ఇక మరోవైపు యూఎస్ క్యూ3 జీడీపీ వృద్ధి రేటు తుది గణాంకాలు విడుదలకానున్నాయి. ఈ నెల 17కల్లా నమోదైన నిరుద్యోగ గణాంకాలు ప్రకటించనుంది. వారం చివర్లో యూఎస్‌తోపాటు.. దేశీయంగా తయారీ, సరీ్వసుల రంగ పీఎంఐ ఇండెక్సులు విడుదలకానున్నాయి. కాగా.. 27 దేశాలతోకూడిన యూరోపియన్ యూనియన్‌తో స్వేచ్చా వాణిజ్య చర్చలు తుది దశకు చేరినట్లు వాణిజ్యం, పరిశ్రమల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించడం సానుకూల అంశమని నిపుణులు పేర్కొన్నారు. నెలాఖరుకల్లా ఒప్పందం ఖరారుకానున్నట్లు మంత్రి తెలియజేశారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
దేశ, విదేశీ గణాంకాలకు ప్రాధాన్యం
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను ఈ వారం ప్రధానంగా దేశ, విదేశీ గణాంకాలు నిర్దేశించే అవకాశముంది. వీటికితోడు ముడిచమురు ధరలు, ప్రపంచ ప్రధాన కరెన్సీలతో డాలరు మారకం వంటి అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. గత కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే మొగ్గు చూపుతున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) ఇటీవల కొనుగోళ్ల యూటర్న్ తీసుకున్న విషయం విదితమే. దీంతో విదేశీ పెట్టుబడులతోపాటు.. రాజకీయ భౌగోళిక అంశాలూ సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు స్టాక్ నిపుణులు తెలియజేశారు. ఎఫ్ఐఐల పెట్టుబడుల కారణంగా లార్జ్‌క్యాప్ బ్యాంకింగ్ షేర్లు జోరు చూపుతున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయ్‌కుమార్ తెలియజేశారు. కొన్ని ఎంపిక చేసిన షేర్లలో పెట్టుబడుల ప్రభావం కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. గత రెండు నెలలుగా భారీ అమ్మకాలు చేపట్టిన ఎఫ్ఐఐలు ఈ నెలలో నికర పెట్టుబడిదారులుగా నిలుస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.గత వారమిలా..శుక్రవారం(6)తో ముగిసిన గత వారం దేశీ సాŠట్క్ ఇండెక్సులు పలు ఆటుపోట్ల మధ్య తిరిగి జోరందుకున్నాయి. సెన్సెక్స్ నికరంగా 1,906 పాయింట్లు(2.4 శాతం) జంప్‌చేసి 81,709 వద్ద ముగిసింది. నిఫ్టీ 547 పాయింట్లు(2.3 శాతం) ఎగసి 24,678 వద్ద స్థిరపడింది. గత వారం మార్కెట్ విలువరీత్యా టాప్–10 కంపెనీలలో ఆరు కంపెనీల మార్కెట్ విలువ రూ. 2 లక్షల కోట్లమేర బలపడింది. టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ. 62,575 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలువ రూ. 45,338 కోట్లు, ఇన్ఫోసిస్ రూ. 26,886 కోట్లు, ఎస్బీఐ రూ. 22,312 కోట్లు చొప్పున ఎగసింది. అయితే ఎయిర్టెల్ విలువ రూ. 16,720 కోట్లు, ఐటీసీ విలువ రూ. 7,256 కోట్లు క్షీణించింది.ఆర్థిక గణాంకాలుదేశీయంగా అక్టోబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి సూచీ వివరాలు గురువారం(12న) వెల్లడికానున్నాయి. సెపె్టంబర్లో పారిశ్రామికోత్పత్తి వార్షికంగా 3.1 శాతం పుంజుకుంది. ఆర్థికవేత్తల 2.5 శాతం అంచనాలను అధిగమించింది. ఇదేవిధంగా నవంబర్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు సైతం 12న వెలువడనున్నాయి. అక్టోబర్‌లో సీపీఐ వార్షిక రేటు 6.21 శాతంగా నమోదైంది. ఐఐపీ, సీపీఐ గణాంకాలు ఆర్థిక వ్యవస్థ పురోగతికి సంకేతాలని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలియజేశారు. ఎఫ్ఐఐలు పెట్టుబడులకు ఆసక్తి చూపడం ట్రేడర్లను ప్రభావితం చేసే వీలున్నట్లు వివరించారు. యుద్ధ భయాలురష్యా– ఉక్రెయిన్ యుద్ధ భయాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు కలిగించే వీలున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ విశ్లేషకులు ప్రవేష్ గౌర్ పేర్కొన్నారు. మరోపక్క తాజాగా ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలహీనపడటానికితోడు ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ వెనకడుగు వేయడం భారత్‌వంటి వర్ధమాన మార్కెట్లకు సానుకూలంగా పరిణమిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. నవంబర్ నెలకు యూఎస్ వ్యవసాయేతర ఉపాధి గణాంకాలు అంచనాలు(2 లక్షలు) మించుతూ 2.2 లక్షలకు చేరింది. నిరుద్యోగిత 4.2 శాతంగా నమోదైంది. అక్టోబర్‌లో తుఫాను సహా బోయింగ్‌లో ఉద్యోగుల సమ్మె కారణంగా ఉపాధి గణాంకాలు పడిపోయిన విషయం విదితమే. ఇవేకాకుండా పలు ఇతర విదేశీ గణాంకాలు సైతం ఈ వారం విడుదలకానున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలియజేశారు. చైనా ద్రవ్యోల్బణం నేడు(9న), వాణిజ్య గణాంకాలు 10న విడుదలకానుండగా.. 11న యూఎస్ కీలక ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడికానున్నాయి. ఇవి ఈ నెలలో కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ చేపట్టనున్న పాలసీ సమీక్షపై ప్రభావం చూపే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 71 డాలర్ల ఎగువకు చేరగా.. న్యూయార్క్ మార్కెట్లో పసిడి ఔన్స్ 2,670 డాలర్లను తాకింది. డాలరు ఇండెక్స్ 106 వద్ద కదులుతోంది. -
ఆర్బీఐ, ఫెడ్ పాలసీ మినిట్స్‌పై దృష్టి
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం కూడా లాభాలు ఆర్జించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల ముందు ర్యాలీకి అవకాశాలు అధికంగా ఉన్నందున మార్కెట్ సెంటిమెంట్ మరింత బలపడే వీలుందంటున్నారు. ఇక ఫెడరల్ రిజర్వ్, ఆర్బీఐ పాలసీ సమావేశ వివరాలు, దేశీయ మార్కెట్లో విదేశీ పెట్టుబడుల తీరుతెన్నులు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, కమోడిటీ, క్రూడాయిల్ ధరలు, బాండ్ల రాబడులపై ఇన్వెస్టర్లు దృష్టి సారించే వీలుందంటున్నారు. ‘‘దేశీయ కార్పొరేట్ క్యూ3 ఫలితాల ఘట్టం ముగిసిన నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సంకేతాలు స్టాక్ సూచీలకు దిశానిర్ధేశం చేయనున్నాయి. నిఫ్టీ కీలకమైన 22 వేల స్థాయిపై ముగిసింది. రానున్న రోజుల్లో ఈ స్థాయిని నిలుపుకోగలిగితే జీవితకాల రికార్డు స్థాయి(22126)ని చేధించే వీలుంది. లాభాల స్వీకరణ జరిగితే 21,750 వద్ద తక్షణ మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 21,350–21,450 పరిధిలో మరో తక్షణ మద్దతు స్థాయి ఉంది’’ అని మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ వైస్ ప్రెసిడెంట్ అరవింద్ సింగ్ నందా తెలిపారు. జాతీయ అంతర్జాతీయ అంశాలు మెప్పించడంతో గత వారం సూచీలు ఒకటిన్నరశాతం లాభపడ్డాయి. బ్యాంకులు, ఆటో, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. గురువారం ఆర్బీఐ, ఫెడ్ పాలసీ సమావేశ వివరాలు ఈ ఫిబ్రవరి 8న జరిగిన ఆర్బీఐ ద్రవ్య పాలసీ కమిటీ సమావేశపు మినిట్స్(గురువారం), గత జనవరి చివర్లో జరిగిన ఫెడ్ మినిట్స్ గురువారం(ఫిబ్రవరి 22న) వెల్లడి కానున్నాయి. ఇరు కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్లు, ద్రవ్య విధాన వైఖరిలను మరింత లోతుగా విశ్లేíÙంచేందుకు మార్కెట్ వర్గాలు మినిట్స్ క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. నికర అమ్మకందారులుగా ఎఫ్ఐఐలు అమెరికా బాండ్లపై రాబడులు పెరగడం, ఆర్బీఐ, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై నెలకొన్న సందిగ్ధత నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీలపై బేరిష్ వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఈ ఫిబ్రవరి ఇప్పటి వరకు (ఫిబ్రవరి 16 నాటికి) రూ.3,776 కోట్ల ఈక్విటీలను విక్రయించినట్లు డేటా తెలియజేసింది. ఇదే సమయంలో డెట్ మార్కెట్లో ఎఫ్ఐఐల రూ.16,560 కోట్ల పెట్టుబడులు పెట్టడం విశేషం. ‘‘వినియోగ ఆధారిత ద్రవ్యోల్బణం అంచనాలకు మించిన నమోదడంతో ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఇది అమెరికా బాండ్లపై రాబడుల పెరుగుదలకు దారీ తీసింది. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత వంటి వర్ధమాన దేశాల్లో పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. అలాగే ఆర్బీఐ నుంచి వడ్డీరేట్ల తగ్గింపుపై స్పష్టమైన సంకేతాలు వెలువడకపోవడం ఎఫ్ఐఐలను నిరాశపరిచింది’’ అని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ శ్రీవాత్సవ తెలిపారు. స్థూల ఆరి్థక గణాంకాలు జపాన్ డిసెంబర్ యంత్ర ఆర్డర్ల డేటా సోమవారం, యూరోజోన్ డిసెంబర్ కరెంట్ ఖాతా డేటా మంగళవారం విడుదల కానున్నాయి. బుధవారం జపాన్ జనవరి వాణిజ్యలోటు, యూరోజోన్ వినియోగ విశ్వాస గణాంకాలు, ఈసీబీ నాన్ మానిటరీ పాలసీ మీటింగ్ వివరాలు వెల్లడి కానున్నాయి. గురువారం యూరోజోన్ డిసెంబర్ సరీ్వసులు, ద్రవ్యోల్బణ, ఈసీబీ పాలసీ మీటింగ్ వివరాలు, అమెరికా నిరుద్యోగ డేటా వివరాలు విడుదలవుతాయి. ఇక వారాంతాపు రోజున ఆర్బీఐ ఫిబ్రవరి తొమ్మిదో తేదీతో ముగిసిన వారానికి సంబంధించిన బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి డేటాతో పాటు ఫిబ్రవరి 16వ తేదీతో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలను ప్రకటించనుంది. ఆయా దేశాల ఆరి్థక వ్యవస్థను ప్రతిబింబిజేసే ఈ స్థూల ఆరి్థక గణాంకాల డేటాను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. -
ద్రవ్యోల్బణం, ఐఐపీ డేటా కీలకం
ఈ వారం స్టాక్ మార్కెట్ గమనంపై నిపుణుల విశ్లేషణ - విదేశీ పెట్టుబడులు, క్రూడ్ ధరల కదలికలపైనా దృష్టి - 12న రిటైల్ ద్రవ్యోల్బణం,ఐఐపీ గణాంకాలు... - స్వల్పకాలానికి తీవ్ర హెచ్చుతగ్గులు ఉండే అవకాశం... న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్ ట్రెండ్‌కు కీలకంగా నిలుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ముడిచమురు(క్రూడ్) ధరల కదలికలపైనా ఇన్వెస్టర్లు నిశితంగా దృష్టిసారించనున్నారని వారు పేర్కొన్నారు. గురువారం(12న) జనవరి నెలకు ఐఐపీ డేటాతో పాటు ఫిబ్రవరి నెల రిటైల్ ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు కూడా వెలువడనున్నాయి. స్టాక్ సూచీల గమనం స్వల్పకాలానికి ఈ రెండు డేటాలపైనే ఆధారపడి ఉంటుందనేది మార్కెట్ నిపుణుల అభిప్రాయం. కాగా, సమీప కాలంలో మార్కెట్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉండొచ్చని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్‌కు చెందిన వివేక్ గుప్తా అంచనా వేశారు. జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.11 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. ధరలు అదుపులోనే ఉండటంతో ఆర్బీఐ గవర్నర్ రెండు నెలల వ్యవధిలోపే రెండోసారి పావు శాతం పాలసీ వడ్డీరేటు(రెపో)ను తగ్గించి ఆశ్చర్చపరిచారు. దీంతో ఈ రేటు 7.5 శాతానికి దిగొచ్చింది. ఇక ఐఐపీ డిసెంబర్లో నామమాత్రంగా 1.7 శాతం వృద్ధి రేటును మాత్రమే నమోదు చేసింది. నవంబర్‌లో ఐఐపీ 3.9 శాతంగా ఉంది. అమెరికా ఉద్యోగ గణాంకాల ప్రభావం... గురువారం అమెరికాలో వెలువడిన ఫిబ్రవరి నెల ఉద్యోగ గణాంకాల ప్రభావానికి అనుగుణంగా నేడు(సోమవారం) దేశీ స్టాక్ సూచీలు ప్రతిస్పందించే అవకాశాలున్నాయి. యూఎస్‌లో నిరుద్యోగ రేటు 5.7శాతం 5.5 శాతానికి తగ్గుముఖం పట్టింది. ఇదే సమయంలో ఫిబ్రవరిలో కొత్తగా అంచనాలకు మించి 2,95,000 కొలువులు జతైనట్లు తాజా ప్రభుత్వ గణాంకాల్లో వెల్లడైంది. పటిష్టమైన జాబ్ డేటా నేపథ్యంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను సమీప భవిష్యత్తులోనే పెంచొచ్చన్న అంచనాలు బలపడుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో కీలక బిల్లుల పురోగతిని ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నారని.. బొనాంజా పోర్ట్‌ఫోలియో అసోసియేట్ ఫండ్ మేనేజర్ హిరేన్ ధాకన్ పేర్కొన్నారు. మార్కెట్లో నెలకొన్న ఆందోళనలు చాలావరకూ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) నిధుల ప్రవాహం కొనసాగనుందని.. ప్రస్తుత వేల్యుయేషన్స్ నిలదొక్కుకోవడానికి అధికంగా ఆస్కారం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వారంలో దేశీ మార్కెట్లు బుల్లిష్‌గానే ఉండొచ్చని కూడా అంచనా వేశారు. గడచిన వారంలో సెన్సెక్స్ 88 పాయింట్లు లాభపడి 29,449 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. కాగా, యాడ్‌ల్యాబ్స్ ఎంటర్టైన్మెంట్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) మంగళవారం(10న) మార్కెట్లో లిస్ట్ కానుంది.


