ఎట్టకేలకు శాంతి!  | US, Israel and Iran agree to a 2-week ceasefire | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు శాంతి! 

Apr 9 2026 3:57 AM | Updated on Apr 9 2026 6:25 AM

US, Israel and Iran agree to a 2-week ceasefire

రెండు వారాల పాటు కాల్పుల విరమణ 

అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్‌ అంగీకారం

యుద్ధానికి ముగింపుపై త్వరలో చర్చలు 

రేపు ఇస్లామాబాద్‌లో ప్రతినిధుల భేటీ! 

యురేనియంను స్వా«దీనం చేసుకుంటాం: ట్రంప్‌ 

లెబనాన్‌పై ఇజ్రాయెల్, ఇరాన్‌ నడుమ పీటముడి? 

ఆ దేశంపై దాడులు ఆపేది లేదన్న ఇజ్రాయెల్‌ 

అలాగైతే చర్చల నుంచి తప్పుకుంటాం: ఇరాన్‌

టెహ్రాన్‌/దుబాయ్‌/వాషింగ్టన్‌/ఇస్లామాబాద్‌: పశ్చిమాసియా కల్లోలానికి ఎట్టకేలకు తాత్కాలికంగా తెర పడింది. రెండు వారాల పాటు కాల్పుల విరమణకు అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్‌ అంగీకరించాయి. కనీవిని ఎరగని దాడులతో ఇరాన్‌ను సర్వనాశనం చేసేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన డెడ్‌లైన్‌ ముగిసేందుకు కేవలం 90 నిమిషాల ముందు ఈ మేరకు కీలక పరిణామం చోటుచేసుకుంది. 

దాంతో తాత్కాలికంగానైనా పెను ముప్పు తప్పిపోయి ప్రపంచమంతా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. ఇరాన్‌ విజ్ఞప్తి మేరకు కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్టు మంగళవారం రాత్రి (అమెరికా కాలమానం ప్రకారం) ట్రంప్‌ తన ట్రూత్‌సోషల్‌ మాధ్యంలో పోస్టు చేశారు. కాల్పుల విరమణను ఇరాన్‌ కూడా ధ్రువీకరించింది. ఇందుకు మద్దతు తెలుపుతూ ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఎక్స్‌లో పోస్టు చేశారు. 

ఈ రెండు వారాల్లోగా యుద్ధానికి పూర్తిగా తెర దించేందుకు కృషి చేయాలని అమెరికా, ఇరాన్‌ నిర్ణయానికి వచ్చాయి. అందులో భాగంగా అమెరికా, ఇరాన్‌ ప్రతినిధులు శుక్ర, లేదా శనివారాల్లో పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో సమావేశం కానున్నారు. అమెరికా బృందానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్‌కు విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ సారథ్యం వహిస్తారని సమాచారం. ఇరు బృందాలూ గురువారమే ఇస్లామాబాద్‌ చేరుకోనున్నట్టు చెబుతున్నారు. ఇరాన్‌ బృందం రాకను అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ ధ్రువీకరించినట్టు పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ వెల్లడించారు. 

అయితే ఇరు వర్గాల పరస్పర విరుద్ధ ప్రకటనలతో కాల్పుల విరమణకు సంబంధించి తీవ్ర అయోమయం నెలకొంది. కాల్పుల విరమణ లెబనాన్‌కు కూడా వర్తిస్తుందని ఒప్పందంలో మధ్యవర్తిగా వ్యవహరించిన పాక్‌ ప్రధాని ప్రకటించగా, నెతన్యాహు మాత్రం దాన్ని ఖండించారు. లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు ఆగబోవని కుండబద్దలు కొట్టారు. అనంతరం ట్రంప్‌ కూడా దీన్ని ధ్రువీకరించారు. హెజ్బొల్లా కారణంగా కాల్పుల విరమణ లెబనాన్‌కు వర్తించబోదని ఆయన చెప్పుకొచ్చారు. అలాగైతే విరమణ ఒప్పందం నుంచి బయటికి రావడమే గాక చర్చల నుంచే తప్పుకుంటామని ఇరాన్‌ హెచ్చరించింది! 

మరోవైపు, అసలు విరమణ ఒప్పందమే చాలా ‘బలహీనంగా’ఉందంటూ వాన్స్‌ పెదవి విరిచారు! ఇంకోవైపు కాల్పుల విరమణ ప్రకటన తర్వాత కూడా ఇరాన్, లెబనాన్‌లపై ఇజ్రాయెల్‌ నిరి్నరోధంగా దాడులను కొనసాగించింది. దాంతో ఇరాన్‌ కూడా గల్ఫ్‌ దేశాలపై భారీగా దాడులకు దిగింది! ఈ నేపథ్యంలో రెండు వారాల కాల్పుల విరమణ ఏ మేరకు అమలవుతుందన్నది సందేహాస్పదంగా మారింది. దీనికి తోడు, ఇరాన్‌తో ద్వైపాక్షిక చర్చలకు సంబంధించి సంబంధించి ఇప్పటిదాకా తుది ప్రణాళిక అంటూ ఏమీ ఖరారు కాలేదని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రెటరీ కోరోలినా లెవిట్‌ మీడియాకు స్పష్టం చేశారు! 

ఇరాన్‌ షరతులపై ట్రంప్‌ అసంతృప్తి 
హార్మూజ్‌ జలసంధిని తక్షణం పూర్తిస్థాయిలో తెరవాలన్న షరతుపైనే కాల్పుల విరమణకు తాను అంగీకరించినట్టు ట్రంప్‌ వెల్లడించారు. ఇరాన్‌ 10 షరతులను తమ ముందుంచిందన్నారు. వాటిలో కొన్ని ఆచరణయోగ్యంగానే ఉన్నాయని అభిప్రాయపడ్డ ఆయన, ఆ తర్వాత మాట మార్చారు. ఇరాన్‌ షరతులు మోసపూరితంగా ఉన్నాయని ఆక్షేపించారు. అంతేగాక ఇరాన్‌ ఇకముందెప్పుడూ యురేనియం శుద్ధికి దిగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ‘‘ఆ దేశం ఇప్పటికే శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అమెరికా స్వాధీనం చేసుకుంటుంది.

 గతేడాది మా దాడుల్లో భూ స్థాపితమైన ఆ యురేనియం నిల్వలను ఇరాన్‌ సహకారంతోనే వెలికి తీసి తరలిస్తాం’’అని చెప్పుకొచ్చారు. యురేనియం నిల్వలను తమకు అప్పగించని పక్షంలో ఇరాన్‌పై మళ్లీ దాడులు తప్పవని అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ హెచ్చరించారు! కానీ ఇందుకు ఆ దేశం ఏ మేరకు అంగీకరిస్తుందన్నది సందేహాస్పదంగా మారింది. యురేనియం నిల్వల అప్పగింతపై ట్రంప్‌ చేసిన తాజా వ్యాఖ్యలపై ఇరాన్‌ స్పందించలేదు. ఇరాన్‌ను చర్చలకు ఒప్పంచడంలో తెర వెనక చైనా కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. ట్రంప్‌ కూడా దీన్ని ధ్రువీకరించారు. ఈ మేరకు తమకు కూడా సమాచారం ఉందని వెల్లడించారు.

విజయం మాదంటే మాదే
అమెరికా, ఇరాన్‌ ప్రకటనలు 
ఇరానే దేబిరించింది: హెగ్సెత్‌ 
షరతులకు ఒప్పకున్నారు: ఇరాన్‌ 
కాల్పుల విరమణ నేపథ్యంలో, నెలన్నర రోజుల యుద్ధంలో గెలిచింది తామంటే తామేనని అమెరికా, ఇరాన్‌ పోటాపోటీగా ప్రకటనలు జారీ చేశాయి. కాల్పుల విరమణ కోసం ఇరానే దేబిరించిందని అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ మీడియా సాక్షిగా ప్రకటించారు! ఆ దేశంపై తాము తలపెట్టిన ‘ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’కనీవిని ఎరగని రీతిలో విజయం సాధించిందని చెప్పుకున్నారు. తమ దాడుల ధాటికి ఇరాన్‌ సైన్యం కనీసం మరికొన్నేళ్లదాకా కోలుకోలేనంతగా దెబ్బ తిన్నట్టు చెప్పారు. అమెరికాయే కాళ్లబేరానికి దిగొచ్చి తాము విధించిన 10 షరతులకు అంగీకరించిందని ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పలు పోస్టులు చేశారు.

ప్రపంచ శాంతికి కీలకమైన రోజు! 
ఇరాన్‌ తమపై దాడులను ఆపాలని కోరింది. కాల్పుల విరమణకు విజ్ఞప్తి చేసింది. ఈ విషయాన్ని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్, ఆర్మీ చీఫ్‌ మునీర్‌ నాకు చేరవేశారు. ఈ రాత్రికి ఇరాన్‌పై తలపెట్టిన అతి పెద్ద దాడిని నిలిపేయాలని విన్నవించారు. హార్మూజ్‌ జలసంధిని తక్షణం తెరిచే షరతుపై ఇరాన్‌పై దాడులను 2 వారాల పాటు నిలిపేసేందుకు నేను అంగీకరించా. ఆ దేశంపై దాడుల ద్వారా మేం ఆశించిన లక్ష్యాలన్నింటిని ఇప్పటికే సాధించేశాం. ఇరాన్‌ మాకు 10 పాయింట్లతో ప్రతిపాదన పంపింది. దానిపై ఈ రెండు వారాల్లో చర్చలు జరిపి ఒప్పందానికి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. హార్మూజ్‌ గుండా నౌకల రాకపోకలు యథావిధిగా సాగేందుకు అమెరికా సాయపడుతుంది. ఇరాన్‌ తన దేశ పునరి్నర్మాణ ప్రక్రియను మొదలు పెట్టుకోవచ్చు. అమెరికాలో మాదిరిగానే పశ్చిమాసియాలో కూడా త్వరలో స్వర్ణయుగాన్ని ఆస్వాదించాలి. ఇది ప్రపంచ శాంతికే అతి కీలకమైన రోజు!  
– ట్రూత్‌ సోషల్‌ పోస్టులో ట్రంప్‌  

ఇరాన్‌కు ఆయుధాలిస్తే 50 % టారిఫ్‌ విధిస్తా 
ఇరాన్‌ మిత్రదేశాలకు ట్రంప్‌ హెచ్చరిక 
వాషింగ్టన్‌: కాల్పుల విరమణ నేపథ్యంలో ఇరాన్‌తో కయ్యానికి కాలు దువ్వబోనని శాంతివచనాలు పలికిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇరాన్‌ మిత్రదేశాలపై టారిఫ్‌ల యుద్ధం ప్రకటించారు. ఇరాన్‌కు ఆయుధాలను సరఫరాచేస్తే ఊరుకునేది లేదని స్పష్టంచేశారు. ‘‘ఇరాన్‌కు మిలటరీ ఆయుధాలు అందించే ప్రతి దేశంపై 50 శాతం టారిఫ్‌లు విధిస్తా. అటు ఇరాన్‌కు ఆయుధాలు పంపుతూ ఇటు అమెరికాకు వస్తూత్పత్తులను ఎగుమతి చేసే దేశాలపై 50 శాతం టారిఫ్‌లను మోపుతా. టారిఫ్‌ల విధింపు విషయంలో ఎలాంటి మినహాయింపులు, సడలింపులు ఉండబోవు. 

ఇకపై ఆయుధాలు పంపిన తక్షణం అదనపు టారిఫ్‌లు అమల్లోకి వస్తాయి’’అని ట్రంప్‌ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌’లో బుధవారం ఒక పోస్ట్‌పెట్టారు. ట్రంప్‌ హెచ్చరికతో అంతర్జాతీయ వాణిజ్యంలో కొత్త అవరోధాలు తలెత్తే ముప్పు ఉంది. ఇరాన్‌ మిత్ర దేశాలైన రష్యా, చైనా, ఉత్తరకొరియా దేశాలపై అమెరికా అదనపు టారిఫ్‌ల భారం మోపే ఆస్కారముంది. రష్యా, చైనా, ఉ.కొరియాలు ఆయుధాలతోపాటు సైనిక సాంకేతికతనూ ఇరాన్‌కు చేరవేసినట్లు గతంలోనే అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.  

త్వరగా దేశం వీడండి
ఇరాన్‌లోని భారతీయ పౌరులకు కేంద్రం సూచన 
దుబాయ్‌: అనూహ్యంగా కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇరాన్‌ నుంచి బయటపడాలని అక్కడి భారతీయ పౌరులకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లోని భారతరాయబార కార్యాలయం బుధవారం ఒక అడ్వైజరీ జారీచేసింది. ‘‘ఇరాన్‌ను వీడాలనుకునే భారతీయులు తొలుత అక్కడి భారతీయ రాయబార కార్యాలయాన్ని సంప్రతించండి. వాళ్ల సూచన మేరకు నడుచుకోండి. ముందస్తు అనుమతి, సమన్వయం లేకుండా, సమాచారం ఇవ్వకుండా ఏ అంతర్జాతీయ సరిహద్దుకు చేరుకోకండి. రాయబార కార్యాలయం సూచించిన మార్గాల్లోనే దేశం వీడండి. అవసరమైతే అత్యవసర పరిస్థితుల్లో +989128109115, +989128109102, +989128109109, +989932179359 నంబర్లకు ఫోన్‌చేసి సంప్రతించి తగు సూచనలు, సలహాలు తీసుకోండి.  cons. tehran@mea.gov.in  ఈమెయిల్‌కు మెయిల్‌చేసి సలహాలు పొందొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement