చైనా ఎంత పని చేసింది.. ప్రపంచ దేశాలకు పెను సవాల్‌!

Transport Issue Occurred For China Attacks On Taiwan - Sakshi

కోవిడ్‌ ప్రభావం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోలేదు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ ప్రభావం ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంది. పులి మీద పుట్రలా తైవాన్‌ చుట్టూ చైనా చేస్తున్న సైనిక విన్యాసాలు, క్షిపణి దాడులు ఆందోళన పెంచుతున్నాయి. ఇరుపక్షాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాలిస్తే ప్రపంచ దేశాల మధ్య రవాణా వ్యవస్థ స్తంభించిపోయే అవకాశాలున్నాయి. 

అమెరికా కాంగ్రెస్‌ హౌస్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌లో జరిపిన పర్యటన మరోసారి ప్రపంచ దేశాలకు డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. ఆమె పర్యటనకు ప్రతీకార చర్యగా తైవాన్‌ను అష్టదిగ్బంధం చేసి చైనా మిలటరీ విన్యాసాలు నిర్వహిస్తోంది. తైవాన్‌ జలాల్లోనూ, గగనతలంలోనూ క్షిపణి దాడులకు దిగుతూ తన బలాన్ని ప్రదర్శిస్తోంది. అయితే దీని వల్ల ప్రపంచంలో బిజీగా ఉండే షిప్పింగ్‌ జోన్‌లో సరకు రవాణాకు  గండిపడే అవకాశాలున్నాయి.  

-    తూర్పు ఆసియా వాణిజ్యంలో తైవాన్‌ జలసంధి రవాణా పరంగా అత్యంత కీలకమైనది. తూర్పు ఆసియా దేశాల్లోని కర్మాగారాల్లో తయారయ్యే ఎలక్ట్రానిక్‌ పరికరాలు ప్రపంచ మార్కెట్లకు చేరాలంటే ఈ జలసంధే మార్గం. 
-    సహజ వాయువు సరఫరా కూడా ఈ మార్గం ద్వారానే జరుగుతుంది.
-    ప్రపంచవ్యాప్తంగా రవాణా నౌకల్లో సగం ఈ ఏడాది ఏడు నెలల్లో తైవాన్‌ జలసంధి ద్వారా తిరిగాయని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. 
-    చైనా దుందుడుకు చర్యలతో ఈ జలసంధిలో రవాణాకు అవకాశం లేకపోతే నౌకల్ని దారి మళ్లించినా ప్రపంచ దేశాల్లో సరఫరాకు ఆటంకాలు ఏర్పడతాయని, కోవిడ్, రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం నుంచి ఇంకా కోలుకోని దేశాలు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని సింగపూర్‌కు చెందిన స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌కు చెందిన ఎస్‌. రాజరత్నం అభిప్రాయపడ్డారు.  
-    తాత్కాలికంగా ఈ జలసంధిలో రవాణా నిలిచిపోతే జపాన్, దక్షిణ కొరియాపై అత్యధిక ప్రభావం పడుతుంది. 
-    గురువారం నాటి విన్యాసాలతో నౌకల రవాణా సూచీ 4.6% నుంచి 1.05%కి  పడిపోయింది 
-    చైనా మిలటరీ విన్యాసాలతో ఉత్తర, తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో నౌకలు ప్రయాణించవద్దని ఇప్పటికే తైవాన్‌ నౌకాదళం హెచ్చరికలు జారీ చేసింది.  
-    తైవాన్‌ జలసంధి నుంచి ఫిలిప్పీన్స్‌ సముద్రం వైపు నౌకలను మళ్లించాలన్నా భారీగా కురుస్తున్న వర్షాలతో ఆటంకాలున్నాయి.  
-    చైనా సైనిక విన్యాసాల ప్రభావం గగనతల రాకపోకలపైనా పడింది. 400కు పైగా విమానాలు రద్దు అయ్యాయి.  

చైనా ఎంతవరకు వెళుతుంది ?  
అమెరికా కాంగ్రెస్‌ హౌస్‌ స్పీకర్‌ పెలోసి తైవాన్‌ పర్యటనపై అగ్గి మీద గుగ్గిలం అవుతున్న డ్రాగన్‌ దేశం తన బలాన్ని చూపించడానికి ఎంత వరకు ముందుకెళుతుందన్న చర్చ జరుగుతోంది. గతంలో 1990, 1996లో సంక్షోభాల సమయంలో కూడా తైవాన్‌ జలాల్లో చైనా క్షిపణులతో దాడులు దిగింది. కొన్ని నెలల పాటు సైనిక విన్యాసాలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు రాజేసింది. అయితే ప్రపంచీకరణ పరిస్థితులతో ఇప్పుడు సరకు రవాణాకు ఏ చిన్న అవాంతరం వచ్చినా చైనా ఆర్థిక వ్యవస్థ మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. ఇప్పటికే ఆర్థికపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్న చైనా అగ్రరాజ్యం అమెరికాతో అమీతుమీకి సిద్ధపడే పరిస్థితుల్లేవని అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ ఏ న్యూ అమెరికన్‌ సెక్యూరిటీ సంస్థ ప్రతినిధి థామస్‌ షుగార్ట్‌  వ్యాఖ్యానించారు.  
- నేషనల్‌ డెస్క్‌, సాక్షి    

ఇది కూడా చదవండి: తైవాన్‌ను చుట్టుముట్టిన చైనా సైన్యం.. మిసైల్స్‌తో హడల్‌!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top