డైనోసార్లకే.. సారు!

Titanosaur skeleton on display at London's Natural History Museum - Sakshi

విమానమంత పొడవు.. కొంచెం  అటూఇటుగా 4 అంతస్తుల ఎత్తు.. 57 టన్నుల బరువు.. ఇది టిటనోసార్‌..ఈ భూప్రపంచం ఇప్పటివరకూ చూసిన అతి పెద్ద డైనోసార్‌.. దీని ముందు అంతటి టీ రెక్స్‌ కూడా జూజూబీనే..ఎప్పుడో పది కోట్ల ఏళ్ల కింద భూమ్మీద తిరుగాడిన ఈ టిటనోసార్‌ అస్థి పంజరాన్ని లండన్‌లోని నేచురల్‌ హిస్టరీమ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు.

ఆరు డైనోసార్ల ఎముకలతో... 
2010లో అర్జెంటీనాలోని ఓ రైతు తన పొలంలో పెద్ద ఎముకను గుర్తించాడు. శాస్త్రవేత్తలు తవ్వకాలు జరపడంతో.. క్రెటాషియస్‌ కాలానికి చెందిన 6 టిటనోసార్లకు చెందిన 280 ఎముకలు బయటపడ్డాయి. వాటిలో బాగున్న వాటిని కలిపి ఒక పూర్తిస్థాయి టిటనోసార్‌ అస్థిపంజరాన్ని సిద్ధం చేశారు. దీనికి ‘పటగోటిటన్‌ మయోరమ్‌’గా పేరుపెట్టారు. 

ఈ డైనోసార్‌ అస్థి పంజరంలోని తొడ ఎముక ఒక్కటే 8 అడుగుల పొడవు, 500 కిలోలకుపైగా బరువు ఉండటం గమనా ర్హం. మొత్తం టిటనోసార్‌ ఎముకలను లండన్‌కు తరలించేందుకు రెండు విమానాలు కావాల్సి వచ్చాయి. దీన్ని నేచురల్‌ హిస్టరీ మ్యూజియంలో మార్చి 31 నుంచి వచ్చే ఏడాది జనవరి వరకు ప్రదర్శించనున్నారు.

రోజుకు 130 కిలోల ఆకులు, కొమ్మలు..
శాస్త్రవేత్తలు చెప్పిన వివరాల మేరకు.. ఈ టిటనోసార్‌ పొడవు 121 అడుగులు, ఎత్తు 40 అడుగులు, బరువు 57 టన్నులకుపైగా ఉంటుందని అంచనా. భూమ్మీద తిరుగాడిన అత్యంత బరువైన, పెద్దదైన జంతువు ఇదే. 
 ఇది శాఖాహారి. రోజుకు 130 కిలోలకుపైగా చెట్ల ఆకులు, కొమ్మలను తినేస్తుంది. 
 ఒకసారికి 40 వరకు గుడ్లను పెడుతుంది. అయితే మాంసాహార డైనోసార్లు, ఇతర జంతువులు, ప్రమాదాల కారణంగా ప్రతి వంద టిటనోసార్‌ పిల్లల్లో ఒక్కటే పూర్తిస్థాయి వరకు ఎదుగుతుందని అంచనా. 
అంతపెద్ద డైనోసార్‌ అయినా.. గుడ్డులోంచి బయటికి వచ్చేప్పుడు బరువు నాలుగైదు కిలోలు మాత్రమే. కానీ ఎదిగే వేగం చాలా ఎక్కువ. పుట్టాక రెండు నెలల్లోనే ఏకంగా 40–50 కిలోల వరకు పెరుగుతాయట. ఇదే మనుషులకు అయితే పది పదిహేనేళ్లు పడుతుంది మరి. 
 ఆరున్నర కోట్ల ఏళ్ల కింద భూమిని గ్రహశక లం ఢీకొట్టడంతో డైనోసార్లు అంతరించిపోయాయి. ప్రస్తుతం ప్రదర్శనకు పెట్టిన అతిభారీ డైనోసార్‌.. అంతకు మరో మూడున్నర కోట్ల ఏళ్ల ముందు బతికినది కావడం విశేషం.         

– సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top