పదేళ్ల ప్లాన్‌.. ఉత్త‌ర కొరియా నుంచి సురక్షిత ప్రదేశానికి! | Story About How North Korean Family Of 9 Members Escaped From Kim Jong Un Rule Via Sea Route, Read Inside | Sakshi
Sakshi News home page

పదేళ్ల ప్లాన్‌.. ఉత్త‌ర కొరియా నుంచి సురక్షిత ప్రదేశానికి!

Apr 25 2026 3:16 AM | Updated on Apr 25 2026 1:38 PM

Story About How Family Of 9 Members Escaped From North Korea

ఊహాజనిత చిత్రం

ఉత్త‌ర కొరియా.. నిరంకుశ‌త్వ పాల‌న‌కు ఒక ఉదాహ‌ర‌ణ‌. ప్ర‌పంచంలోనే అత్యంత ప్ర‌మాద‌క‌ర నేత‌గా పేరున్న‌ కిమ్ జోంగ్ ఉన్ ఆ దేశానికి అధ్య‌క్షుడిగా ఉండ‌డం అక్క‌డి ప్ర‌జ‌లు చేసుకున్న దుర‌దృష్టం. ఇప్ప‌టికీ కిమ్ నియంతృత్వ పాల‌న నిరాటంకంగా కొన‌సాగుతూనే ఉంది. బ‌య‌టి ప్ర‌పంచంతో సంబంధం లేకుండా క‌ఠిన నిబంధ‌న‌లు, ఆంక్ష‌ల‌తో దేశ ప్ర‌జ‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేయ‌డం కిమ్ జోంగ్ ఉన్ నైజం. 

అలాంటి దేశాధ్య‌క్షుడి క‌ళ్లు గ‌ప్పి అత‌డి అరాచ‌క పాలన నుంచి విముక్తి పొందేందుకు ఉత్త‌ర కొరియాకు చెందిన 9 మంది స‌భ్యులున్న కుటుంబం చేసిన సాహ‌సం యావ‌త్ ప్ర‌పంచాన్ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. కిమ్ అరాచ‌క పాల‌న నుంచి త‌ప్పించుకోవడానికి ప‌దేండ్ల పాటు ప్ర‌ణాళిక ర‌చించారు. ఇక్క‌డ గ‌మ్మ‌త్తైన విష‌యం ఏంటంటే ప‌దేళ్ల పాటు ర‌చించిన ప్ర‌ణాళిక‌ను కేవ‌లం రెండు గంటల్లోనే అమ‌లు చేయ‌డం విశేషం.

విష‌యంలోకి వెళితే.. ఉత్త‌ర కొరియాకు చెందిన‌ కిమ్ కుటుంబ పెద్ద‌. అయితే కిమ్ జోంగ్ ఉన్ అరాచ‌క పాల‌న‌ను క‌ళ్లారా చూస్తూ వ‌చ్చిన కిమ్‌.. త‌న‌ కుమారులతో ఈ దేశంలో భవిష్యత్‌ లేదు, బాహ్య ప్రపంచం చాలా పెద్దది, అక్కడికి చేరుకోవాలంటే సముద్రమే మనకు ఏకైక మార్గం అని చెప్పడంతో ఈ సుదీర్ఘ ప్రయాణం మొదలైంది.

దక్షిణ కొరియా నుంచి అక్రమంగా వచ్చే టీవీ ఛానెళ్లను చూడటం ద్వారా వారు అక్కడి జీవనశైలిని, సామాజిక స్వేచ్ఛను గమనించారు. ఇది వారిలో స్వేచ్ఛ పట్ల ఉన్న కాంక్షను మరింత బలోపేతం చేసింది. ఈ కుటుంబం ఎంచుకున్న మార్గం చాలా ప్రమాదకరమైంది. చైనా సరిహద్దు లేదా అత్యంత కట్టుదిట్టమైన భూభాగ సరిహద్దు కాకుండా, వారు సముద్రమార్గాన్ని ఎంచుకున్నారు. వారు మత్స్యకారులు కాకపోయినా ఈ ప్రయాణం కోసం పక్కాగా సిద్ధమయ్యారు.

మత్స్యకారులుగా మారి...
చిన్న కుమారుడు కిమ్‌ యి హ్యోక్ సముద్ర తీరానికి వెళ్లి చేపల వేటను వృత్తిగా మార్చుకున్నాడు. పడవలను ఎలా రిపేర్ చేయాలి. అలల వేగాన్ని ఎలా అంచనా వేయాలి అనే విషయాలు నేర్చుకున్నాడు. సముద్రంపై గస్తీ తిరిగే ఉత్తర కొరియా పెట్రోలింగ్ పడవల కదలికలను వారు సుదీర్ఘ కాలంపాటు గమనించారు. రాత్రి వేళల్లో నిఘా తక్కువగా ఉంటుందని వారు గుర్తించారు. 

వర్కర్స్ పార్టీ సభ్యులకు, భద్రతా సిబ్బందికి తమపై ఎటువంటి అనుమానం రాకుండా సాధారణ మత్స్యకారుల వలే వారు ప్రవర్తించారు. పలుమార్లు నిబంధనలు ఉల్లంఘించినప్పుడు అధికారులకు లంచాలు ఇచ్చి తప్పించుకుంటూ తాము తిరిగి వస్తామనే నమ్మకాన్ని వారిలో కలిగించారు.

రెండు గంటల ప్రయాణం
మే 2023లో ఒక వర్షపు రాత్రి సముద్రం అల్లకల్లోలంగా ఉన్న సమయంలో వారు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల రాడార్ నిఘా తక్కువగా ఉంటుందని వారు ఆ సమయాన్ని ఎంచుకున్నారు. చేపల వేట కోసమే వెళ్తున్నామని నమ్మించి గార్డులకు లంచం ఇచ్చి పడవను సముద్రంలోకి తీసుకెళ్లారు. గర్భిణీగా ఉన్న కిమ్‌ ఇల్‌ హ్యోక్‌ భార్యతో సహా కుటుంబంలోని మహిళలు, పిల్లలను రహస్యంగా పడవలోకి ఎక్కించారు. 

పడవ ప్రయాణంలో నాలుగు, ఆరేళ్ల వయసు ఉన్న పిల్లల శబ్దం చేయకుండా ఉండేందుకు వారిని గోనె సంచుల్లో దాచి ఉంచారు. సుమారు రెండు గంటల పాటు ప్రాణాలకు తెగించి ప్రయాణించి, చివరకు ఉత్తర దక్షిణ కొరియాల మధ్య వివాదాస్పద జల సరిహద్దు అయిన నార్తర్న్ లిమిట్‌లైన్‌ను దాటారు.

ఎన్‌ఎల్‌ఎల్‌ దాటిన తర్వాత వారు యోన్‌ ప్యాంగ్ ద్వీం సమీపంలో దక్షిణ కొరియా నౌకాదళానికి సంకేతాలు పంపారు. దక్షిణ కొరియా అధికారులు వారిని రక్షించి, ఆశ్రయం కల్పించారు.  ఇలా తప్పించుకునే క్రమంలో చిక్కితే జైలు శిక్ష, చిత్రహింసలు లేదా మరణ శిక్ష ఉంటుంది. అటువంటి మృత్యువలయం నుంచి ఒకే కుటుంబానికి చెందిన 9 మంది సురక్షితంగా బయటపడటం అద్భుతమని చెప్పాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement