
తియాంజిన్: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సభ్యదేశాల అధినేతలు ముక్తకంఠంతో ఖండించారు. ఈ మేరకు సోమవారం ఉమ్మడి డిక్లరేషన్ విడుదల చేశారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు సంతాపం, సానుభూతి ప్రకటించారు.
ఈ హేయమైన ఘటనకు కారణమైన ముష్కరులను, వారి పోషకులను, కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టి, కఠినంగా శిక్షించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఇలాంటి ఘాతుకాలను సహించడానికి ఎంతమాత్రం వీల్లేదన్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదంపై రాజీలేని పోరాటానికి కట్టుబడి ఉన్నామని వారు ఉద్ఘాటించారు. ఉగ్రవాద, వేర్పాటువాద, తీవ్రవాద శక్తులపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయానికొచ్చారు. అలాంటి శక్తులను స్వలాభం కోసం ఎవరూ వాడుకోకుండా చర్యలు చేపట్టాలని తీర్మానించారు.
బెల్డ్ అండ్ రోడ్‌ను తప్పుపట్టిన మోదీ
చైనా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్డ్ అండ్ రోడ్ కార్యక్రమం(బీఆర్‌ఐ) పట్ల ఎస్సీఓ సదస్సు వేదికగా ప్రధాని మోదీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇలాంటి అనుసంధాన ప్రాజెక్టులు ఇతర దేశాల జాతీయ సార్వభౌమత్వాన్ని గౌరవించేలా ఉండాలని చెప్పారు. ఏ కార్యక్రమం అయినా సరే నమ్మకం, విశ్వసనీయత పెంచుకొనేలా ఉండాలి తప్ప తగ్గించుకొనేలా ఉండొద్దన్నారు. ఆసియా, ఆఫ్రికా, యూరప్‌ను అనుసంధానిస్తూ బీఆర్‌ఐని చైనా ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగమైన చైనా–పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) గుండానే వెళ్తోంది. దీన్ని భారత్ మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది.