మట్టితోనే గట్టి పునాది!

Scientists Trying To Build Houses On The Moon And Mars - Sakshi

చంద్రుడు, అంగారకుడిపై ఇళ్ల నిర్మాణంపై చిగురించిన ఆశలు..

అక్కడి మట్టితో ఇటుకలు, కాంక్రీటు తయారు చేయవచ్చంటున్న శాస్త్రవేత్తలు

భూమిని దాటేసి అంతరిక్షంలో పాగా వేయాలని.. చంద్రుడిపై, అంగారకుడిపై ఇళ్లు కట్టాలని శాస్త్రవేత్తలు ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. సంకల్పం బాగానే ఉన్నా.. అక్కడ ఇల్లు కట్టుకునేదెలా? భూమ్మీది నుంచి సిమెంటు, ఇటుకలు, ఉక్కు, గాజు వంటివి పట్టుకెళ్లలేం. పోనీ గట్టి ప్లాస్టిక్‌నూ తీసుకెళదామనుకున్నా అదీ కొంతే.

మరి ఇళ్లు కట్టుకోవడమెలాగన్న దానిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు.. చంద్రుడిపై, అంగారకుడిపై ఉన్న మట్టితోనే గట్టి ఇటుకలను, కాంక్రీట్‌ వంటి పదార్థాన్ని తయారు చేయవచ్చని గుర్తించారు. 

నిర్జీవమైన మట్టే.. 
ధూళి రూపంలో ఉండే చంద్రుడి మట్టిపై శాస్త్రవేత్తలు ఇప్పటికే చాలా ప్రయోగాలు చేశారు. అందులోని రసాయనాలు భూమిపై ఉండే మట్టికి భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు. ఇక అంగారకుడిపైకి పంపిన రోవర్లు అక్కడి మట్టి, రాళ్లపై పరిశోధనలు చేసి..రసాయనాల శాతాన్ని పరిశీలించాయి. వీటన్నింటిపై పరిశోధన చేసిన అమెరికాకు చెందిన సెంట్రల్‌ ఫ్లోరిడా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు..ఆ మట్టితో గట్టి నిర్మాణ పదార్థాన్ని రూపొందించవచ్చని తేల్చారు. 

బాగా వేడి అవసరం 
చంద్రుడు, అంగారకుడిపై మట్టికి ఉప్పు నీళ్లు కలిపి ఇటుకలు, కాంక్రీట్‌ వంటి పదార్థాన్ని తయారు చేయవచ్చని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త రణజే ఘోష్‌ తెలిపారు. చంద్రుడి రాళ్ల నుంచి సేకరించిన ధూళి (రిగోలిత్‌)ను ఉపయోగించి చేసిన ప్రయోగంలో తాము ఈ విషయాన్ని గుర్తించామని వెల్లడించారు.

అయితే ఆ మట్టిని, ఉప్పు నీళ్లకు కలిపి అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయాల్సి ఉంటుందని.. దీనికి సంబంధించిన ఆ వేడిని ఉత్పత్తి చేయడం (హీట్‌ సోర్స్‌) ఎలాగనేది తేల్చాల్సి ఉందని వివరించారు. దీనికి సంబంధించి త్వరలోనే మరింత మెరుగైన పరిష్కారాన్ని కనుగొనగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. 
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top