Russia-Ukraine war: ఉక్రెయిన్‌ ఎదురుదాడి

Russia-Ukraine war: Ukraine reveals how many Russian soldiers killed in war - Sakshi

రష్యా సైన్యానికి భారీ నష్టాలు

డోన్బాస్‌లో కూడా వెనకడుగే!

యుద్ధం మొదలై 2 నెలలు

దక్కింది నష్టాలు, అప్రతిష్టే

నేడు ఉక్రెయిన్‌కు అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులు

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి కాలు దువ్వి సరిగ్గా రెండు నెలలైంది. ఇన్ని రోజుల్లోనూ ఉక్రెయిన్‌ను అన్నివిధాలా అతలాకుతలం చేయడం తప్ప పెద్దగా సాధించిందేమీ లేకపోగా సైనికంగా కనీవినీ ఎరుగని నష్టాలను మూటగట్టుకుంది. దీనికి తోడు పశ్చిమ దేశాల ఆంక్షలతో అతలాకుతలమవుతోంది. తూర్పు ఉక్రెయిన్లోని డోన్బాస్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకుని గౌరవప్రదంగా యుద్ధానికి తెర దించాలన్న రష్యా ప్రయత్నాలూ సులువుగా ఫలించేలా కన్పించడం లేదు. అక్కడ శనివారం రష్యా దాడులను ఉక్రెయిన్‌ సైనికులు దీటుగా తిప్పికొట్టడమే గాక 9 యుద్ధ ట్యాంకులను, 18 సాయుధ యూనిట్లను, 13 సాయుధ వాహనాలను, 3 ఆర్టిలరీ వ్యవస్థలను ధ్వంసం చేశారు. దాంతో రష్యా దళాలు బాగా నెమ్మదించాయి. అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులు లాయిడ్‌ ఆస్టిన్, బ్లింకెన్‌ ఆదివారం ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు.

మారియుపోల్‌పై దాడులు
మారియుపోల్‌ను ఆక్రమించామని పుతిన్‌ ప్రకటించినా అక్కడ పోరు కొనసాగుతూనే ఉందని ఇంగ్లండ్‌ రక్షణ శాఖ అంటోంది. అజోవ్‌స్తల్‌ స్టీల్‌ ప్లాంటుపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోందని నగర మేయర్‌ చెప్తున్నారు. నగర టీవీ టవర్‌పై రష్యా అనుకూల డొనెట్స్‌క్‌ వేర్పాటువాదుల జెండా ఎగురుతున్న దృశ్యాన్ని రష్యా అధికార చానల్‌ ప్రసారం చేసింది. నగరం నుంచి పౌరులను తరలించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నగరంలో 45 మీటర్లకు పైగా పొడవున్న మరో సామూహిక సమాధి బయటపడింది. అందులో వెయ్యికి పైగా పౌరుల శవాలుంటాయని భావిస్తున్నారు. మరోవైపు ఖర్కీవ్‌ తదితర నగరాలపైనా రష్యా దాడులు కొనసాగుతున్నాయి. నల్లసముద్రం నుంచి ఒడెసాపైకి రష్యా ఆరుకు పైగా క్షిపణులను ప్రయోగించగా చాలావాటిని కూల్చేసినట్టు ఉక్రెయిన్‌ ప్రకటించింది.

ఆంక్షలతో రష్యా కుదేలు
న్యూయార్క్‌: పాశ్చాత్య దేశాల ఆంక్షలను తట్టుకున్నామని పుతిన్‌ గంభీరమైన ప్రకటనలు చేస్తున్నా, అవి రష్యాను బాగా కుంగదీస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. ‘‘ద్రవ్యోల్బణం 17.3 శాతానికి చేరింది. కంపెనీలు మూతపడుతున్నాయి. నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్నాయి. అవ్యవసర మందులతో సహా అన్నింటికీ తీవ్ర కొరత ఏర్పడింది’’ అని చెబుతున్నారు. కనీసం 2 లక్షల ఉద్యోగాలు ఊడిపోయాయని మాస్కో మేయరే అంగీకరించారు. మరో నెల గడిస్తే ఆంక్షల ప్రభావం తీవ్రతరమవుతుందని అంటున్నారు.

పుతిన్‌తో త్వరలో గుటెరస్‌ భేటీ
ఐరాస: ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ వచ్చే వారం రష్యా, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు పుతిన్, జెలెన్‌స్కీలతో సమావేశం కానున్నారు. ఈ నెల 26న మాస్కోలో పుతిన్‌తో, 28న ఉక్రెయిన్‌ వెళ్లి జెలెన్‌స్కీలతో ఆయన చర్చిస్తారు.

‘మాస్క్‌వా’లో 27 మంది గల్లంతు
గత వారం తమ యుద్ధ నౌక మాస్క్‌వా మునిగిపోయిన దుర్ఘటనలో సిబ్బందిలో ఒకరు మరణించారని, 27 మంది గల్లంతయ్యారని రష్యా ఎట్టకేలకు ప్రకటించింది. 396 మందిని కాపాడినట్టు వివరించింది. నౌకలో ఉన్న 500 పై చిలుకు సిబ్బందిలో చాలామంది మరణించి ఉంటారని వార్తలు రావడం, వాటిని రష్యా ఖండించడం తెలిసిందే.

సర్మాట్‌ మోహరింపు!
ఇటీవల పరీక్షించిన ఖండాంతర అణు క్షిపణి సర్మాట్‌ను రష్యా త్వరలో మోహరించనుంది. మాస్కోకు 3,000 కిలోమీటర్ల దూరంలోని మిలిటరీ యూనిట్‌కు వీటిని అందజేస్తారని రష్యా అంతరిక్ష సంస్థ చీఫ్‌ ద్మత్రీ రొగోజిన్‌ తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top