Russia-Ukraine: రష్యా సైన్యం మరింత బలోపేతం!

Russia-Ukraine: Russian parliament votes to scrap military age limit - Sakshi

నియమకాలపై వయోపరిమితి తొలగింపు 

బిల్లుకు పార్లమెంట్‌ దిగువ సభ ఆమోదం

కీవ్‌/మాస్కో/దావోస్‌: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. సుదీర్ఘ పోరాటానికి పుతిన్‌ సైన్యం సన్నద్ధమవుతున్నట్టు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. సైన్యంలో నూతన నియామకాలకు సంబంధించిన బిల్లుకు రష్యా పార్లమెంట్‌ దిగువ సభ ఆమోదం తెలిపింది. సైన్యంలో చేరడానికి ప్రస్తుతమున్న 40 ఏళ్ల వయోపరిమితిని తొలగించారు. వయసు మళ్లిన వారినీ చేర్చుకుంటారని సమాచారం.

మోటార్‌ సిచ్‌ ప్లాంట్‌ ధ్వంసం
జపొరిజాజియాలోని ఉక్రెయిన్‌కు చెందిన కీలక హెలికాప్టర్ట ఇంజన్ల తయారీ కర్మాగారాన్ని ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్‌లో అత్యంత కీలకమైన మారియుపోల్‌ ఓడరేవులో కార్యకలాపాలు మూడు నెలల తర్వాత ప్రారంభమయ్యాయి. అక్కడ మందుపాతరలను రష్యా సైన్యం తొలగించిందని సమాచారం. తూర్పు ఉక్రెయిన్‌లోని పోక్రోవ్‌స్క్‌లో రష్యా దాడుల్లో చాలామంది గాయపడ్డారు.

రష్యాకు తలొంచం: జెలెన్‌స్కీ
ఉక్రెయిన్‌లో ఏం జరుగుతోందో పుతిన్‌కు తెలియదని జెలెన్‌స్కీ చెప్పారు. దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. తమ భూభాగాన్ని రష్యాకు అప్పగించే ప్రసక్తే లేదన్నారు. ‘‘చర్చలకు రష్యా ముందుకు రావాలి. ముందు తన సేనలు, ఆయుధాలను ఉపసంహరించాలి’’ అన్నారు.

మూడో ప్రపంచ యుద్ధానికి ఆరంభం: సోరోస్‌
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి ఆరంభం కావొచ్చని ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్‌ జార్జి సోరోస్‌ హెచ్చరించారు. అదే జరిగితే భూగోళంపై నాగరికతే మిగలదన్నారు. దీన్ని నివారించేందుకు పుతిన్‌ను ఓడించడమే మార్గమన్నారు. యుద్ధానికి ముగింపు పలకాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ‘‘చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పుతిన్‌ది అవధుల్లేని అనుబంధం. యుద్ధంపై పింగ్‌కు ముందే సమాచారమిచ్చాడు. వారిద్దరి మధ్యా ఎన్నో పోలికలున్నాయి. ఇద్దరూ ప్రజలను భయపెట్టి పరిపాలిస్తున్నారు’’ అని దుయ్యబట్టారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top