బైడెన్‌కు ఉత్తరకొరియా క్షిపణి భయం

President Joe Biden Visit To Asia - Sakshi

వాషింగ్టన్‌: ఆసియాలో మొట్టమొదటి పర్యటనకు బయలుదేరిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఉత్తరకొరియా భయం పట్టుకుంది. అణు పాటవాన్ని చాటిచెప్పేందుకు ఉత్తరకొరియా ఇటీవల కాలంలో పలుమార్లు క్షిపణి పరీక్షలు జరిపిన విషయం తెలిసిందే. ఆసియా పర్యటన సమయంలోనూ ఆ దేశం బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం లేదా అణు పరీక్ష జరిపేందుకు కచ్చితంగా అవకాశాలున్నట్లు తమకు సమాచారం ఉందని జాతీయభద్రతా సలహాదారు జేక్‌ సలివాన్‌ తెలిపారు. బైడెన్‌ దక్షిణ కొరియా, జపాన్‌లలో ఆరు రోజులు పర్యటిస్తారు. ఈ సందర్భంగా రెండు దేశాలతో మరింత చేరువ కావడంపై దృష్టిని కేంద్రీకరిస్తారు.

దీంతోపాటు, ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాకు మద్దతిస్తున్న చైనాకు గట్టి సందేశం పంపించడమే అధ్యక్షుడు బైడెన్‌ పర్యటన ప్రధానోద్దేశమని సలివాన్‌ తెలిపారు. మొదటగా ఆయన దక్షిణకొరియా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన యూన్‌ సుక్‌ యోల్‌తోపాటు, జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిడాతో భేటీ అవుతారు. వాణిజ్యం, ప్రపంచ సరఫరా వ్యవస్థ నిరాటంకంగా కొనసాగేలా చూడటం, ఉత్తరకొరియా అణు కార్యక్రమం, ఆ దేశంలో కరోనా విజృంభణ వంటి విషయాలపై చర్చలు జరుపుతారు. ఈ పర్యటన సమయంలోనే ఇండో–పసిఫిక్‌ వ్యూహాత్మక కూటమి క్వాడ్‌ దేశాల నేతలతో భేటీ అవుతారు. ఈ కూటమిలో అమెరికాతోపాటు ఆస్ట్రేలియా, భారత్, జపాన్‌ సభ్య దేశాలుగా ఉన్న విషయం తెలిసిందే.

క్వాడ్‌ భేటీకి ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఈ నెల 24వ తేదీన జపాన్‌ రాజధాని టోక్యోలో జరగనున్న క్వాడ్‌ దేశాల మూడో భేటీకి ప్రధాని మోదీ హాజరుకానున్నారని విదేశాంగ శాఖ తెలిపింది. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో పరిణామాలు, పరస్పర ఆసక్తి కలిగిన అంశాలపై ఆయన ఆయా దేశాల నేతలతో చర్చలు జరుపుతారు.

ఇది కూడా చదవండి: మంకీపాక్స్‌ విజృంభణ.. శారీరకంగా కలవడం వల్లే కేసుల వ్యాప్తి! ఎందుకంటే..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top