గాలిలో ప్రాణాలు | Plane crash aviation safety in world | Sakshi
Sakshi News home page

గాలిలో ప్రాణాలు

Published Mon, Dec 30 2024 5:39 AM | Last Updated on Mon, Dec 30 2024 5:39 AM

Plane crash aviation safety in world

వరుస విమాన ప్రమాదాలు 

వైమానిక భద్రతపైనే అనుమానాలు

దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం నేపథ్యంలో వైమానిక భద్రత మరోసారి  చర్చనీయాంశమైంది. గత  ఐదారేళ్లుగా అత్యంత ఘోరమైన ప్రమాదాల సంఖ్య  పెరుగుతుండటం ఆందోళన  కలిగిస్తోంది... 

టేకాఫ్‌ అయిన కాసేపటికే... 
గత ఐదేళ్లలో అత్యంత విషాదకరమైన, చర్చనీయమైన విమాన ప్రమాదం లయన్‌ ఎయిర్‌ ఫ్లైట్‌ 610. 2018 అక్టోబర్‌ 29న ఇండోనేసియాలోని జకార్తా నుంచి పాంగ్‌కల్‌ పినాంగ్‌కు బయలుదేరిన బోయింగ్‌ 737 మ్యాక్స్‌ 8 విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికే జావా సముద్రంలో కూలిపోయింది. 189 మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది చనిపోయారు. విమానంలోని ఆగ్మెంటేషన్‌ సిస్టమ్‌ (ఎంసీఏఎస్‌)లో లోపమే ప్రమాదానికి కారణమని తేలింది. బోయింగ్‌ విమానాల రూపకల్పన, ఏవియేషన్‌ రెగ్యులేటర్లు, ముఖ్యంగా ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మిని్రస్టేషన్‌ (ఎఫ్‌ఏఏ) పర్యవేక్షణలో తీవ్ర లోపాలను ఈ దుర్ఘటన ఎత్తిచూపింది. 

ఐదు నెలలకే మరోటి... 
లయన్‌ ఎయిర్‌ ప్రమాదం జరిగిన ఐదు నెలలకే మరో బోయింగ్‌ 737 మ్యాక్స్‌ కూలిపోయింది. 2019 మార్చి 10న ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌ విమానం 302 అడిస్‌ అబాబా నుంచి టేకాఫ్‌ అయిన కాసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 157 మంది చనిపోయారు. దీనికీ ఎంసీఏఎస్‌ వ్యవస్థే కారణమని తెలిసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా విమానయాన అధికారులు మాక్స్‌ను నిలిపివేశారు. బోయింగ్‌ చట్టపరమైన, ఆర్థికపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంది. 

సముద్రంలో కూలిన విమానం... 
2021 జనవరి 9న ఇండోనేషియాలోని జకార్తాలో విమాన ప్రమాదం జరిగింది. సోకర్నో–హట్టాలో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పాంటియానాక్‌కు బయలుదేరిన బోయింగ్‌ 737–500 విమానం సముద్రంలో కూలిపోయింది.  టేకాఫ్‌ అయిన కొద్ది నిమిషాల్లోనే సముద్రంలో కూలిపోవడంతో అందులో ఉన్న 62 మంది  చనిపోయారు. ఇండోనేషియాలో ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం ఇది. 

యాంత్రిక వైఫల్యం, మానవ తప్పిదం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. విమానంలోని ఆటోథ్రోటిల్‌ సిస్టమ్‌లో లోపం వల్ల విమానం ఇంజన్లు అసమతుల్యం కావడంతో అదుపు తప్పి కూలిపోయింది.  పైలట్‌ పరిస్థితికి తగిన విధంగా స్పందించడంలో విఫలమయ్యారని తేలింది. ఈ ప్రమాదం పాత విమానాల నిర్వహణలో అప్రమత్తతను, విమానాల అప్‌గ్రేడేషన్‌ ప్రాముఖ్యతను నొక్కిచెప్పింది. యాంత్రిక వైఫల్యాలు తలెత్తినప్పుడు ప్రతిస్పందించడానికి విమానయాన సిబ్బంది అందరికీ శిక్షణ ఇవ్వాలని ఉద్ఘాటించింది.

ఇళ్లపైనే కూలిన విమానం..  
2020 మే 22న పాకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్లైన్స్‌ (పీఐఏ) ఫ్లైట్‌ 8303, ఎయిర్‌బస్‌ ఎ 320 కరాచీలోని ఇళ్లపై కూలిపోయింది. లాహోర్‌ నుంచి బయలుదేరిన ఈ విమానంలో 99 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో 41 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ల్యాండింగ్‌ సమయంలో పైలట్‌ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ల్యాండింగ్‌ గేర్‌లో తలెత్తిన సమస్యల కారణంగా విమానం రన్‌ వేపైకి దూసుకెళ్లడంతో ఇంజన్లు ధ్వంసమయ్యాయి. చివరకు అదుపు తప్పిన విమానం నివాస ప్రాంతంలోకి దూసుకెళ్లింది. పైలట్లు
ప్రామాణిక అత్యవసర విధానాలను పాటించలేదని విమానం బ్లాక్‌ బాక్స్‌ వెల్లడించింది. ఈ ప్రమాదం పైలట్ల శిక్షణ, నియంత్రణ పర్యవేక్షణలో లోతైన లోపాలను బహిర్గతం చేసింది. పాకిస్తాన్‌ సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీలో శిక్షణ నాణ్యతపై విచారణకు దారితీసింది,  

రన్‌వే నుంచి జారి లోయలో పడి...  
గత ఐదేళ్లలో భారత్‌లో జరిగిన అత్యంత ఘోర విమాన ప్రమాదం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం 1344ది. దుబాయ్‌ నుంచి వచి్చన ఈ విమానం 2020 ఆగస్టు 7న కేరళలోని కోజికోడ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్‌ అవుతుండగా కూలిపోయింది.  ప్రయాణికులు, సిబ్బంది మొత్తం 165 మంది ఉండగా.. 21 మంది మరణించారు. భారీ వర్షాల కారణంగా రన్‌వే తడిసిపోయి ఉంది. ఇక్కడ రన్‌వే పొడవు కూడా తక్కువగా ఉండటంతో ల్యాండ్‌ అయిన విమానం జారి లోయలో పడిపోయింది. వాతావరణ పరిస్థితులు, మానవ తప్పిదం, రన్‌ వే మౌలిక సదుపాయాల సరిగా లేకపోవడం వల్ల జరిగిందని దర్యాప్తులో తేలింది. ఈ ప్రమాదం తరువాత దేశంలోని విమానాశ్రయాల మౌలిక సదుపాయాలను సమీక్షించారు.  

రన్‌వే నుంచి జారి..
నేపాన్‌లోని ఖాట్మండులోని త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పొఖారాకు బయల్దేరిన విమానం టేకాఫ్‌ సమయంలో కుప్పకూలింది. శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో సిబ్బందితో సహా 19 మంది ఉన్నారు. 18 మంది మృతి చెందగా, పైలట్‌ కెపె్టన్‌ ఎంఆర్‌ షాక్యా తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. రన్‌వే దక్షిణం వైపు నుంచి విమానం టేకాఫ్‌ అవుతుండగా, రెక్కల కొన భూమిని తాకడంతో ఒక్కసారిగా పలీ్టలు కొట్టింది. దీంతో వెంటనే విమానంలో మంటలు చెలరేగాయి.

మంచు కారణంగా... 
ఈ సంవత్సరం బ్రెజిల్‌ విమానయాన సంస్థకు చెందిన వోపాస్‌ 2283, ఏటీఆర్‌ 72 ట్విన్‌ఇంజన్‌ టర్బోప్రాప్‌ ఆగస్టు 9న కూలిపోయింది. 58 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో సావోపాలో అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరిన విమానం.. సావోపావో సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్నవారంతా మరణించారు. విమాన ప్రమాదానికి మంచు కారణమని తేలింది.  

పండుగ రోజున ప్రమాదం..  
ఇటీవలే.. క్రిస్మస్‌ పర్వదినాన అజర్‌బైజాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి ప్రమాదం జరిగింది. అజర్‌బైజాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం బాకు నుంచి రష్యాలోని గ్రోజీ్నకి వెళ్తుండగా కాస్పియన్‌ సముద్ర సమీపంలో కూలిపోయింది. విమానంలో 62 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉండగా 38 మంది మరణించారు. ఉక్రెయిన్‌ వరుస డ్రోన్‌ దాడులను తిప్పికొడుతున్న రష్యా వైమానిక రక్షణ దళాలు విమానాన్ని కూలి్చవేశాయని రష్యా అంగీకరించింది. దాడి చేసినందుకు అధ్యక్షుడు పుతిన్‌ క్షమాపణ చెప్పారు.  
 

వీడని మిస్టరీ..  
చైనాలో జరిగిన అత్యంత విషాద ఘటనల్లో ఈస్టర్న్‌ ఎయిర్లైన్స్‌ ఫ్లైట్‌ ఎంయూ 5735 కుప్పకూలడం ఒకటి.  చైనా ఈస్టర్న్‌ ఎయిర్లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737–800.. 2022 మార్చి 21న దక్షిణ చైనాలోని పర్వతాల్లో కూలిపోయింది. ప్రయాణికులు, సిబ్బంది సహా విమానంలో ఉన్న 132 మంది మరణించారు. విమానం ఎత్తునుంచి కిందికి దించే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తాత్కాలిక దర్యాప్తులో తేల్చారు. విమానం వేగంగా, ఉద్దేశపూర్వకంగా ల్యాండ్‌ చేసినట్లు బ్లాక్‌ బాక్స్‌ డేటా వెల్లడించింది. ఈ ప్రమాదం యాంత్రిక వైఫల్యమా, మానవ తప్పిదమా అనే విషయంపై అనేక ఊహాగానాలు వచ్చాయి. ఈ విపత్తుకు అసలు కారణం మాత్రం మిస్టరీగా మిగిలిపోయింది.  
   
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement