
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్ ఆగస్టు 4 నుండి 8 వరకు భారత్‌లో పర్యటించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఫిలిప్పీన్స్ అధ్యక్షునితో పాటు ప్రథమ మహిళ లూయిస్ అరనేటా మార్కోస్, క్యాబినెట్ మంత్రులు, సీనియర్ అధికారులు, పలువురు వ్యాపార ప్రతినిధులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం భారత్‌కు రానుంది.
2022లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు మార్కోస్ భారతదేశానికి రావడం ఇదే తొలిసారి. ఆగస్టు 5న ప్రధాని మోదీ- ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు మార్కోస్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలుసుకోనున్నారు. ఆగస్టు 8న ఫిలిప్పీన్స్‌కు తిరిగి వెళ్లే ముందు ఆయన బెంగళూరును సందర్శిస్తారు.
కాగా భారత్- ఫిలిప్పీన్స్ మధ్య దౌత్య సంబంధాలు 1949 నవంబర్‌లో ప్రారంభమయ్యాయి. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, సముద్ర సహకారం, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, ఔషధాలు, డిజిటల్ టెక్నాలజీ తదితర రంగాల్లో ఇరు దేశాల భాగస్వామ్యం కొనసాగుతోంది. వీసా ప్రాసెసింగ్ ప్లాట్‌ఫామ్ అట్లీస్ ప్రకారం, ఫిలిప్పీన్స్ వీసా రహిత ప్రవేశాన్ని ప్రకటించిన తర్వాత భారత్ నుండి ఫిలిప్పీన్స్ కు 28 శాతం మేరకు ప్రయాణాలు పెరిగాయి.కాగా ఫిలిప్పీన్స్ ఇటీవల 14 రోజుల పాటు ఉండేందుకు భారత పౌరులకు వీసా రహిత ప్రవేశాన్ని ప్రకటించింది.