హఠాత్తుగా పురిటి నొప్పులు.. ఎమర్జెన్సీ ల్యాండ్‌ కాలేదు! బుల్లి ప్యాసింజర్‌తో ల్యాండింగ్‌..

Passenger Delivers baby mid air on Emirates flight - Sakshi

దుబాయ్‌: విమానంలో ఉన్నట్లుండి ఆరోగ్య సమస్యలు తలెత్తితే.. అత్యవసర ల్యాండింగ్‌లు కావాల్సి ఉంటుంది. అది పురిటి నొప్పులకు కూడా వర్తిస్తుంది. సాధారణంగా డెలివరీ దగ్గర పడుతున్న గర్భిణిల విమాన ప్రయాణాలకు అనుమతి ఉండదు. కానీ, ప్రత్యేక పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తే!. అలా ఎమిరేట్స్ విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలికి హఠాత్తుగా పురిటి నొప్పులు రాగా.. గగనతంలో ఉండగానే విమానంలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

టోక్యో నరిటా నుంచి దుబాయ్‌(యూఏఈ)కి వెళ్తున్న ఎమిరేట్స్‌ ఇంటర్నేషనల్‌ ఫ్లైట్‌లో జనవరి 19వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈకే 319 విమానంలో ప్రయాణికురాలికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆ సమయంలో పైలట్‌ మెడికల్‌ ఎమర్జెన్సీ ప్రకటించినప్పటికీ షెడ్యూల్‌ ప్రకారమే ల్యాండ్‌ కావడం గమనార్హం. ప్రయాణికురాలు ప్రసవ వేదనకు గురవుతున్న క్రమంలో విమాన సిబ్బంది సమయస్ఫూర్తిగా, చాకచక్యంగా వ్యవహరించినట్లు ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. విమానశ్రయంలో దిగేసరికి వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారని, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని, ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని ఎమిరేట్స్‌ ప్రకటించుకుంది. 

సాధారణంగా డెలివరీకి దగ్గరపడే సమయంలో మహిళలను ప్రయాణానికి అనుమతించరు. అయితే.. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణాలకు అనుమతిస్తారు. ఎమిరేట్స్‌ రూల్స్‌ ప్రకారం.. ఏడో నెల వరకు గర్భిణిలకు మాత్రమే విమాన ప్రయాణాలకు అనుమతి ఉంది. ఒకవేళ ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాలు చెబితే మాత్రం నెలలు నిండిన గర్భిణులకు ప్రయాణాలకు అనుమతిస్తారు.  ఇదిలా ఉంటే.. విమాన ప్రయాణాల్లో ఇలా డెలివరీ జరిగిన ఘటనలు కొత్తేం కాదు. 

కిందటి ఏడాది మే నెలలో.. డెన్వర్‌ నుంచి కొలరాడోకు వెళ్తున్న ఫ్రాంటియర్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ప్రయాణికురాలు బిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఈ నెలలోనే ఘనా నుంచి అమెరికా(వాషింగ్టన్‌) వెళ్తున్న ఓ విమానంలో ఆరు గంటల పాటు ప్రసవవేదన అనుభవించిన ఓ ప్రయాణికురాలు.. ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ వద్ద ఉండే క్యాబిన్‌ ఫ్లోర్‌పై విమాన బృందం సాయంతో బిడ్డకు జన్మనిచ్చింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top