అమెరికాలోని ఎంబసీ ఆస్తులను అమ్మకానికి పెట్టిన పాకిస్థాన్‌

Pakistan Is Selling Its Embassy Property In US Washington - Sakshi

ఇస్లామాబాద్‌: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది పాకిస్థాన్‌. చేసిన అప్పులు తీర్చేందుకు, ఉద్యోగులకు జీతాలు సైతం ఇచ్చేందుకు ఇబ్బందులు పడుతూ ఆస్తులు అమ్ముకుంటోంది. తమకు సాయం చేయాలని అంతర్జాతీయ సంస్థలతో పాటు వివిధ దేశాలను వేడుకుంటోంది. ఈ క్రమంలోనే అమెరికాలోని ఎంబసీ ఆస్తులను అమ్మకానికి పెట్టింది. వాషింగ్టన్‌లోని పాత ఎంబసీ బిల్డింగ్‌ను అమ్మకానికి పెట్టగా కొనుగోలు చేసేందుకు మూడు సంస్థలు బిడ్లు దాఖలు చేసినట్లు పాకిస్థాన్‌ స్థానిక మీడియా వెల్లడించింది.

భారత సంస్థ బిడ్‌..
వాషింగ్టన్‌లోని పాక్‌ ఎంబసీ భవనాన్ని కొనుగోలు చేసేందుకు అత్యధికంగా 6.8 మిలియన్‌ డాలర్లకు జువిష్‌ సంస్థ బిడ్‌ దాఖలు చేసింది. ఆ భవనం స్థానంలో ప్రార్థనా మందిరం నిర్మించాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత రెండోస్థానంలో భారత్‌కు చెందిన ఓ రియాల్టీ సంస్థ బిడ్‌ వేసింది. 5 మిలియన్‌ డాలర్లకు ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చింది. అలాగే.. పాకిస్థాన్‌కు చెందిన రియాల్టీ సంస్థ 4 మిలియన్‌ డాలర్లకు కోట్‌ చేసినట్లు పాక్‌ డాన్‌ పత్రిక వెల్లడించింది.

మరోవైపు.. ప్రైవేటీకరణపై ఏర్పడిన పాకిస్థాన్‌ కేబినెట్‌ కమిటీ ఆర్థిక మంత్రి ఇషాక్‌ డార్‌ నేతృత్వం సోమవారం భేటీ అయింది. న్యూయార్క్‌లోని రూసెవెల్త్‌ హోటల్‌ సైట్‌ను లీజుకు ఇచ్చేందుకు ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ను నియమించాలని ప్రైవేటీకరణ కమిషన్‌కు సూచించినట్లు డాన్‌ పత్రిక తెలిపింది. పాకిస్థాన్‌కు వాషింగ్టన్‌లో రెండు ప్రాంతాల్లో రాయబార కార్యాలయాలు ఉన్నాయి. అందులో ఒకటి పాతది కాగా మరొకటి కొత్తది. ఆర్‌ స్ట్రీట్‌లో ఉన్న భవనాన్ని 1956లో కొనుగోలు చేశారు. 2000 వరకు అందులో కార్యకలాపాలు సాగాయి. పాత భవనాన్ని అలాగే అమ్మేయాలా? లేక పునరుద్ధరణ పనులు చేయించి విక్రయించాలా? అనే అంశంపై ఎంబసీ అధికారులు చర్చిస్తున్నట్లు పాక్‌ పత్రిక పేర్కొంది. 

ఇదీ చదవండి: ‘ఏ దోస్త్‌ మేమున్నాం’.. పాకిస్థాన్‌కు జిన్‌పింగ్‌ భరోసా

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top